అర్ధరాత్రి ఊరును ముంచిన వరద.. జలదిగ్బంధంలో మోరంచపల్లి

  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లు, చెట్ల పైకి ఎక్కిన ప్రజలు
  • కాపాడాలని 700 మంది గ్రామస్తుల హాహాకారాలు
  • ఎన్డీఆర్ఎఫ్​ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బృందాల రెస్క్యూ ఆపరేషన్​తో బయటకు
  • నలుగురు గల్లంతు.. ఇంకా ఎక్కువ మందే గల్లంతై ఉంటారంటున్న స్థానికులు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: 300 ఇండ్లున్న ఆ గ్రామాన్ని రాత్రికి రాత్రే వరద చుట్టుముట్టింది. 700 మంది గ్రామస్తులు పిల్లపాపలతో వరదల్లో చిక్కుకున్నారు. కరెంట్​పోయే సరికి చుట్టూ చిమ్మ చీకటి. తెల్లారేసరికి ఊరు, వాగు ఏకమైంది. రోడ్డుకు అటు.. ఇటు 300 మీటర్ల దూరం ఏడెనిమిది ఫీట్ల ఎత్తుతో వరద పోటెత్తింది. నీళ్లల్లో మునిగిన పెంకుటిళ్లలోంచి ప్రాణాలు రక్షించుకోవడానికి బయ టికి వెళ్లిన నలుగురు వరద ఉధృతికి గల్లంతయ్యారు. మిగిలిన వాళ్లు తమ ప్రాణాలు రక్షించు కోవడానికి ఇండ్ల స్లాబ్‌‌‌‌లపైకి వెళ్లారు. ఇంకొందరు చెట్లు ఎక్కారు. తమను కాపాడాలని గ్రామస్తులు అక్కడి నుంచే హాహాకారాలు చేశారు. కానీ సర్కారు నుంచి సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఉదయం 11 గంటల తర్వాత ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ బృందాలు చేరుకొని బోట్లలో ప్రజలందరిని సురక్షిత  ప్రాంతాలకు తరలించాయి. ఇదంతా భూపాలపల్లి జిల్లా  మోరంచపల్లిలోని పరిస్థితి. 

రెండు చెరువులు తెగి..!

భారీ వర్షాలతో మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. 12 గంటల వ్యవధిలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో 44.4, చిట్యాల మండలం లో43.4, ఘనపూర్ మండలంలో 39.4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మోరంచపల్లి గ్రామానికి ఎగువన ఉన్న రెండు చెరువులు తెగిపోయి వాగులోకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. బుధ‌‌వారం అర్ధరాత్రి త‌‌ర్వాత గ్రామంలోకి  వ‌‌ర‌‌ద నీరు రావ‌‌డం మొదలైంది. అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఇండ్లలోకి నీళ్లు రావడంతో మొదట ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాగు ఉప్పొంగిందని అర్థమయ్యాక వెంటనే ప్రాణాలు కాపాడుకునేందుకు బిక్కుబిక్కుమంటూ గ్రామస్తులు ఇండ్లపైకి ఎక్కారు. అర్ధరాత్రి వ‌‌ర‌‌ద నీరు అక‌‌స్మాత్తుగా ఊర్లకు  చొచ్చుకురావ‌‌డం, ఎటూ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలంతా ఇండ్ల పైక‌‌ప్పుల మీదికి చేరుకుని కాపాడాలంటూ ఆర్తనాదాలు పెట్టారు. 

ALSO READ:విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. కదం తొక్కుదాం

రంగంలోకి ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు

మోరంచపల్లి గ్రామం వరదల్లో చిక్కుకున్న సమాచారాన్ని గురువారం ఉదయం 6 గంటల వరకే గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌‌‌‌, ఎస్పీ ఆఫీస్‌‌‌‌కు చేరవేశారు. కానీ ఉదయం 11 గంటల దాకా రెస్క్యూ ఆపరేషన్​ మొదలుకాలేదు. గుడెప్పాడ్‌‌‌‌ టు సీరొంచ నేషనల్‌‌‌‌ హైవే 153సీ రోడ్డు పక్కనే మోరంచపల్లె గ్రామం ఉంటుంది. మోరంచవాగును ఆనుకొని 100 మీటర్ల దూరంలోనే ఇండ్లు ఉన్నాయి. పోలీసులు, అధికారులు చేరుకునేసరికి మోరంచవాగు నుంచి ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ రోడ్డుపై అటు ఇటు 300 మీటర్ల దూరం, ఎడెనిమిది ఫీట్ల ఎత్తుతో వరద ప్రవాహం ఉంది. దీనివల్ల సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానిక బీజేపీ నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి విషయాన్ని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయ‍న జిల్లా కలెక్టర్‌‌‌‌ భవేశ్‌‌‌‌ మిశ్రాతో ఫోన్‌‌‌‌లో మాట్లాడి విషయం తెలుసుకొని సెంట్రల్‌‌‌‌ హోం శాఖ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హోంశాఖ సెక్రటరీ రెండు ఆర్మీ హెలీకాప్టర్లను భూపాలపల్లి జిల్లాకు పంపించారు. అలాగే రాష్ట్ర సర్కారు ఆదేశాలతో ఉదయం 11 గంటల తర్వాత ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ బృందాలు కూడా రంగంలోకి దిగి గ్రామస్తులను కాపాడి పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. జిల్లా కలెక్టర్‌‌‌‌ భవేశ్‌‌‌‌ మిశ్రా, ఎస్పీ పుల్లా కర్ణాకర్‌‌‌‌, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి టౌన్‌‌‌‌ వైపు ఒడ్డున ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు.  సర్వం కోల్పోయి కట్టుబట్టలు, పిల్లాపాపలతో వచ్చిన గ్రామస్తులను గాంధీనగర్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు. 

నలుగురు గల్లంతు.. వందలాది పశువుల మృత్యువాత

మోరంచపల్లిలో పెంకుటిల్లు నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వచ్చిన గొర్రె ఓదిరెడ్డితో పాటు గొర్రె వజ్రమ్మ, మహాలక్ష్మి, సరోజన అనే మహిళలు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. వీరి ఆచూకీ ఇంత వరకు దొరకలేదు. ఈ నలుగురే కాకుండా మరికొందరు వాగులో గల్లంతు అయినట్లు స్థానికులు చెప్తున్నారు. వందలాది పశువులు కూడా వాగులో కొట్టుకుపోయాయి. ఈ గ్రామంలో ఎందరు గల్లంతయ్యారనేది ఆఫీసర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, ఇండ్లలోని టీవీలు, ఫ్రిడ్జిలు, బియ్యం, ఇతర నిత్యావసర సామగ్రి, బట్టలు, బోళ్లు అన్నీ నీళ్లలో కొట్టుకుపోయి క‌‌ట్టుబ‌‌ట్టలతో మిగిలామ‌‌ని గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు.