జలదిగ్భందంలో మొరంచపల్లి.. వరదల్లోనే 1000 మంది

జలదిగ్భందంలో మొరంచపల్లి.. వరదల్లోనే 1000 మంది

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా -పరకాల ప్రధాన రహదారి పై మొరంచపల్లి వాగు పొంగిపొర్లుతంది. దాదాపు 15 ఫీట్ల ఎత్తు నుంచి వరద ప్రవహిస్తోంది.  వరద ప్రవాహానికి   ఊరంతా నీటమునిగింది.  దాదాపు 1000 మంది గ్రామస్తులు వరదలో చిక్కుకుపోయారు.   బస్టాండ్ ఆవరణలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే దానిపై కి ఎక్కి వర్షములో బిక్కుబిక్కుమంటూ  గడుపుతున్నారు.ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్‌ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు.    ఇద్దరు వ్యక్తులో చెట్టుపై చిక్కుకుపోయారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. 

పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు  వరంగల్ మహానగరం తడిసిముద్దవుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చారిత్రక కట్టాడాలు జలమయం అయ్యాయి. అండర్ బ్రిడ్జి కింద భారీగా నిలిచింది. హనుమకొండలోని భవాని నగర్ లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. మోకాళ్ళ లోతు నీళ్లలోనే ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు వాహనదారులు.

హనుమకొండ-ములుగు జాతీయ రహదారిపై ఉధృతంగా వరద ప్రవాహిస్తోంది. చిట్యాల మండలంలోని మానేరువాగు, చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఘనపురం మండలం గణపసముద్రంలోని లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ రెండు, మూడో గనిలోకి భారీగా వరదనీరు చేరడంతో బొగ్గుఉత్పత్తిని నిలిచిపోయింది.