న్యాయమూర్తుల విచక్షణకు అదొక మచ్చుతునక

దున్నపోతు యీనిందనగానే దూడను కట్టేయమన్న చందంగా, నిందితుడని- ఒక వ్యక్తిని ప్రవేశపెట్టగానే విచక్షణ లేకుండా, ఆ వ్యక్తిని రిమాండ్ కు పంపే మెజిస్ట్రేట్లు దండిగా ఉన్న రోజులవి. తెల్లదొరల పాలనలోని ఆనాటి న్యాయ వ్యవస్థలో, ఆనాటికే చెందిన, ఒక యువ మెజిస్ట్రేట్  అనుసరించిన, న్యాయ విచక్షణ– విధానం, ఈనాటికి కూడా మన యువ న్యాయమూర్తులకు మార్గదర్శకంగా నిలుస్తున్నది. ఒక కేసులో ఆయన అనుసరించిన విధానం ఆయన మాటల్లోనే..“...ఆరోజు ఒక బందిపోటు దొంగతనం కేసు నా ముందు విచారణకు వచ్చింది. నిందితుడు బలిష్టంగా, ఎత్తుగా, ఉద్రేక వ్యక్తిగా కనిపించాడు. అతడిని చూడగానే దొంగేనన్న భావన కలిగేలా ఉన్నాడు. అతను మాసంలోని శుక్లపక్ష అష్టమి లేదా నవమిన తెల్లవారు జామున1:30 గంటలకు నేరం చేసినట్లుగా చెప్పారు. విచారణలో ప్రత్యక్ష సాక్షి స్పందిస్తూ.. వెన్నెలకాంతిలో కొంత దూరం నుంచి నేరస్తుడిని చూశానని, ఎదురుగా ఉన్న ఈ నిందితుడే నేరం చేసినట్లు చెప్పాడు. ఇరుపక్షాల వాదనలు ముగిసి తీర్పు రాయాల్సిన సమయంలో నిందితుడు దోషేనన్న భావన నాకు స్పష్టంగా కలిగింది. అయితే, నేరం జరిగింది శుక్ల పక్ష అష్టమి లేదా నవమి రోజు. తెల్లవారు జామున 1:30 గంటలకు దూరం నుంచి ఒక వ్యక్తిని గుర్తించగలమా అన్న సందేహం ఏదో ఒక మూలన నాలో కలిగింది. దీంతో రాస్తున్న తీర్పును పక్కన పెట్టా. మరో వారం రోజుల్లోనే శుక్ల పక్ష నవమి రానుంది. ఆరోజును నా సునిశిత పరిశీలన కోసం ఎంచుకున్నా.  అర్ధరాత్రి మేల్కొని సరిగ్గా సాక్షి చెప్పినట్లుగా..1:30 గంటలకు దూరంగా కొందరు వ్యక్తుల్ని నిలబెట్టి గుర్తించేందుకు  ప్రయత్నించా. అలా గుర్తించడం అసాధ్యమని స్పష్టమైంది. అందు వల్ల తీర్పు చెప్పే సమయంలో న్యాయసూత్రాల ననుసరించి సంశయ లాభం(బెన్ఫిట్-ఆఫ్ -డౌట్) కింద నిందితుడిపై మోపిన అభియోగాన్ని కొట్టేసి నిందితుడికి న్యాయం చేశా”.. ఈ ఉదంతం బ్రిటీష్ పాలన నాటి ఒక యువ మెజిస్ట్రేట్ స్వీయ చరిత్ర నుంచి సేకరించింది. అయితే ఇది చెప్పిన మెజిస్ట్రేట్ మరెవరో కాదు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఆ పదవికే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి మొరార్జి దేశాయి.
 

మొరార్జీ సూచనలు అనుసరణీయం
ధర్మపీఠంపై కూర్చునే ప్రతి న్యాయమూర్తి న్యాయ దేవతకు ప్రతినిధి అని, ఆయన వల్ల ఏ నిర్దోషికి అన్యాయం జరగకూడదని, న్యాయ విచక్షణ,- సునిశిత పరిశీలన లేకుండా నిందితులను  రిమాండ్ కు పంపే న్యాయమూర్తులు, న్యాయ దేవతకు అన్యాయం చేస్తున్న వారేనని మొరార్జి దేశాయి భావించేవారు. కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు అనుసరించాల్సిన విధి విధానాల్ని ఆయన స్పష్టంగా సూచించారు. “న్యాయమూర్తి అదివరకే తనలో స్థిరపడిన భావాలతో ఏ కేసునూ విచారించకూడదు, అంతేకాదు ఒక నిందితుడికి ఏవిధమైన అన్యాయం జరగకుండా, న్యాయ విచక్షణతో- సునిశితంగా ప్రతి కేసుని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ సిద్ధాంతాల్ని విశ్వసించిన నేను, మొదట నామదిలో తిష్ట వేసుకున్న భావాలేమైనా ఉంటే వాటిని తొలిగించుకొని నిర్మల హృదయంతో  కేసులను విచారించి, తీర్పుల్ని చెప్పేవాడిని”అని ఆయన పేర్కొన్నారు. అందువల్లనేమో, 1919- నుంచి 1930 కాలంలో మొరార్జి దేశాయి న్యాయమూర్తిగా 1,000 క్రిమినల్ కేసుల్లో తీర్పులు వెలువరిస్తే, కేవలం మూడు కేసులు మాత్రమే అప్పీళ్లలో ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయమూర్తిగా మొరార్జి అనుసరించిన వృత్తి నిబద్ధత, నైతిక విలువలు, న్యాయవిచక్షణ, సూక్ష్మపరిశీలనాంశాలు నేటి యువ న్యాయమూర్తులకు ఆదర్శాలు.                                     - బసవరాజు నరేందర్ రావు,  అడ్వకేట్, హైదరాబాద్