![ఆ సినిమా చూసి.. యాక్టర్నయ్యా: ఉన్ని ముకుందన్](https://static.v6velugu.com/uploads/2022/11/More-about-Yashoda-Movie-Actor-Unni-Mukundan_kexKCGNO7q.jpg)
‘జనతా గ్యారేజ్’తో తెలుగులో పరిచయమై, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ మూవీస్ ద్వారా దగ్గరయ్యాడు. ప్రస్తుతం సమంత లీడ్ రోల్లో నటించిన ‘యశోద’లో తన నటనతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తున్నాడు ఉన్ని ముకుందన్. ఇప్పటికే మలయాళం, తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న అతడు సింగర్, ప్రొడ్యూసర్ కూడా. ‘‘మొదటి నుంచి సినిమాల గురించి ప్లానింగ్ ఏం లేదు. కథ, నా క్యారెక్టర్ నచ్చితే, చేస్తున్నా” అంటున్న ఈ వర్సటైల్ యాక్టర్, సినిమా జర్నీ గురించి తన మాటల్లోనే...
మాది కేరళలోని త్రిసూర్. నాన్న మడాతిపరంబిల్ ముకుందన్ నాయర్, అమ్మ రోజీ. నాకొక అక్క ఉంది. పేరు కార్తీక. నేను పుట్టిన తర్వాత మా ఫ్యామిలీ గుజరాత్‌కి షిఫ్ట్ అయింది. దాదాపు ఇరవై ఏండ్లకు పైగా అక్కడే అహ్మదాబాద్‌లో ఉన్నాం. మా స్కూల్ పక్కనే థియేటర్ ఉండేది. దాని గోడలపై రోజూ సినిమా పోస్టర్స్ చూస్తూ వెళ్లేవాడిని. అలా ఒకరోజు హృతిక్ రోషన్ నటించిన ‘కహో నా ప్యార్ హై’ సినిమా పోస్టర్ కనిపించింది. అది చూస్తుంటే థియేటర్‌కి వెళ్లాలనిపించింది. ఫస్ట్ టైం థియేటర్లో నేను చూసిన సినిమా అదే. అప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా. ఆ సినిమా చూశాక, ‘నేనూ యాక్టర్ అవ్వాలి’ అని ఫిక్స్ అయ్యా. నాకు ఇంగ్లీష్ లిటరేచర్, ఫాంటసీ, యానిమేషన్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నేను నా తోటి వాళ్లకు కథలు బాగా చెప్పేవాడిని. నాకు మ్యూజిక్ కూడా చాలా ఇష్టం. సో, నేను యాక్టింగ్ కూడా చేయగలననే నమ్మకం వచ్చింది. అలాగని చదువు రాదని కాదు.. స్కూల్లో బాగానే చదివేవాడిని. కానీ, నా డ్రీమ్స్ నన్ను చదువులో వెనకపడేలా చేశాయి. ఎలాగోలా త్రిసూర్‌లోని ప్రజోతి నికేతన్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్, జర్నలిజం డిగ్రీ పూర్తి చేశా.
మొదటి ఆఫర్ వదులుకున్నా
కొన్నాళ్లు అహ్మదాబాద్‌లో ఒక కంపెనీలో జాబ్ చేశా. తర్వాత ఒకరోజు మా పేరెంట్స్‌తో ‘నేను యాక్టింగ్ చేస్తా’నని చెప్పా. వాళ్లు షాక్ అయ్యారు. ఎందుకంటే మా ఫ్యామిలీకి సినిమాలు చూసే అలవాటు లేదు. అలాగని ‘యాక్టింగ్ వద్దు’ అని కూడా అనలేదు. అప్పట్లో నేను లోహితాదాస్ అనే డైరెక్టర్‌కి నా కలల గురించి ఒక లెటర్ రాసి, పంపా. అది తెలిసి, మా నాన్న లోహితాదాస్ అడ్రస్ పట్టుకుని నన్ను ఆయన దగ్గరకు పంపించాడు. ఆయన ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తా అన్నారు. అప్పటికీ నేను గుజరాత్లో చేస్తున్న జాబ్ మానేయలేదు. కానీ, అప్పుడు యాక్టర్ కంటే డైరెక్టర్ అయితే బెస్ట్ అనిపించింది. దాంతో ఆ సినిమా ఛాన్స్ వదులుకున్నా. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు నేను కేరళ వెళ్లేవాడిని. అలా ఒకసారి లోహితాదాస్ నన్ను ఒక ప్రొడ్యూసర్‌కి పరిచయం చేశాడు. ఆయన తీస్తున్న ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే.. నేను జనాల్లో ఉండి షూటింగ్ చూసేవాడిని. తర్వాత లోహితాదాస్ దగ్గరికి వెళ్లి డౌట్స్ అడిగేవాడిని. ఆయన నాకు చాలా విషయాలు నేర్పించాడు.
రెండోసారి కూడా..
ఆయన చనిపోయాక, నా కెరీర్‌కి బ్రేక్ పడింది. దాంతో అది ఆపేసి, ఆర్మీలో చేరాలనుకున్నా. మళ్లీ గుజరాత్ వెళ్లి, జుట్టు కత్తిరించుకున్నా. అప్పుడే నాకు తమిళంలో ‘సేడాన్’ సినిమా ఆఫర్ వచ్చింది. అది ‘నందనం’ అనే మలయాళ సినిమా రీమేక్. యాక్టింగ్ వద్దనుకుని, ‘నాకు ఇంట్రెస్ట్ లేద’ని చెప్పా. కానీ డైరెక్టర్ టీం నా ఫొటో చూసి స్క్రీన్ టెస్ట్ చేద్దామన్నారు. అప్పుడు మా అమ్మ కలగజేసుకుని, ‘ఇన్నాళ్లు దానికోసమే ఎదురుచూశావు కదా! ఈ ఒక్కసారి ట్రై చెయ్’ అని చెప్పింది. అప్పుడు స్క్రీన్ టెస్ట్ కోసం నేను చెన్నైకి వెళ్లా. అది ఓకే అయి, ఆ సినిమాతో కెరీర్ స్టార్ట్ అయింది.
టర్నింగ్ పాయింట్
నా కెరీర్లో టర్నింగ్ పాయింట్ ‘మల్లు సింగ్’. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ అయ్యి, నాకు గుర్తింపు వచ్చింది. కానీ, ఆ సక్సెస్ తర్వాత 11 నెలలు గ్యాప్ వచ్చింది. నేను బరువు కూడా పెరిగా. అప్పుడు నాకు పెద్దగా గైడెన్స్ లేదు. దాంతో ఈసారి కూడా మళ్లీ గుజరాత్ వెళ్లిపోయి, జాబ్ చేసుకుందామనుకున్నా. అప్పుడు స్క్రిప్ట్ రైటర్ సేతు బి. ఉన్నికృష్ణన్ ‘లావు తగ్గితే బాగానే ఉంటావ్’ అని నన్ను మళ్లీ ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.
దానికోసం బరువు తగ్గా
‘విక్రమాదిత్యన్’ సినిమాలో నా క్యారెక్టర్ కోసం ఐదున్నర నెలల్లో పాతిక కిలోలు తగ్గా. అంతేకాకుండా కండలు బాగా పెంచా. ఈ ఫిజిక్ నా కాన్ఫిడెన్స్ లెవల్స్‌ని పెంచింది. ఆ సినిమా అయిపోయాక కూడా నేను ఫిజిక్ అలాగే మెయింటెయిన్ చేయాలని చాలా కష్టపడ్డా. నా ఫిట్నెస్ జర్నీని యూట్యూబ్ ఛానెల్లో పెట్టా. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా వయసు పెరిగినా, నేను ఎప్పుడూ ఒకేలా ఉండటానికి ట్రై చేస్తా. ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు ఎక్కువ టైం జిమ్‌లో ఉండటం ఇష్టం.
తెలుగులో..
‘కెఎల్10’, ‘విక్రమాదిత్యన్’లో సినిమాలు చూసి, నాకు‘జనతా గ్యారేజ్’లో అవకాశం ఇచ్చారు డైరెక్టర్. ఆ తర్వాత అనుష్కతో ‘భాగమతి’లో నటించా. ఆమె నుంచి చాలా నేర్చుకున్నా. నేను ‘చాణక్యతంత్రం’లో ఉమెన్ రోల్ చేసినప్పుడు నాకు స్టైల్, కాస్ట్యూమ్, బిహేవియర్లో కొన్ని టిప్స్ ఇచ్చింది అనుష్క. తెలుగులో నా మూడో సినిమా ‘ఖిలాడి’. లేటెస్ట్గా ‘యశోద’. నా ఫ్యూచర్ సినిమాలు తెలుగులో కూడా రాబోతున్నాయి.
భాష నాకు ప్రాబ్లమ్ కాదు
భాషలు నేర్చుకోవడం నాకు ఛాలెంజ్‌లా అనిపించదు. ఎందుకంటే నేను మలయాళీనే అయినా నేను పెరిగింది గుజరాత్లో. నాకు హిందీ, గుజరాతీ బాగా వచ్చు. మలయాళం చదవడం, రాయడం రాదు. దాంతో నా తోటివాళ్లు నన్ను ఎగతాళి చేసేవాళ్లు. నేను మలయాళం మాట్లాడితే ‘యాస డిఫరెంట్‌గా ఉంది’ అనేవాళ్లు. అప్పుడు నేను ఛాలెంజింగ్‌గా తీసుకుని, మలయాళం చదవడం, రాయడం నేర్చుకున్నా. ఇప్పుడు పాటలు రాసి పాడుతుంటే వాళ్లంతా షాక్ అవుతున్నారు. ప్రొడక్షన్, పాటలు రాయడం, నా సొంత ప్లే బ్యాక్ సాంగ్స్ రికార్డింగ్‌తో పాటు దక్షిణాది భాషల్లో యాక్టింగ్ చేస్తున్నా. ఉత్తరాదిలో చేస్తే.. అది కూడా నా లిస్ట్‌లో చేరుతుంది అంతే. ఇప్పటికే దాదాపు ఇరవైకి పైగా సినిమాలు చేశా. అక్కడ నాది డెబ్యూ సినిమా. బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ, నేనే చేయలేదు.
యాక్టర్‌గా ఎలా ఉందంటే..
సినిమాని అర్థం చేసుకోవడానికి నాకు ఆరేండ్లు పట్టింది. కొత్త క్యారెక్టర్స్‌తో ప్రయోగాలు చేయాలి. యాక్టర్ లైఫ్‌లో చాలా ఒత్తిడి ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన ఏ సినిమా అయినా కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తా. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అనేది ఆలోచిస్తా. నటుడిగా కొత్తదనం చూపించడం కూడా ముఖ్యమే. సో, ఆడియెన్స్‌ని దృష్టిలో పెట్టుకుని, కాన్ఫిడెంట్‌గా వర్క్ చేస్తున్నా. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
పిల్లల కోసం ఒక సినిమా
ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి, ఒక సినిమా కూడా మొదలుపెట్టాం. కొవిడ్ రావడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత నా బ్యానర్లో ‘మెప్పడియన్’ అనే సినిమా మొదలుపెట్టాం.
నేను ప్రొఫెషనల్ డైటీషియన్‌ని కాదు. కాకపోతే నా ఎక్స్‌పీరియెన్స్ నుంచి నేర్చుకున్నవి తెలిసిన వాళ్లకి చెప్తుంటా. చాలామందికి ఆ టిప్స్ పనిచేశాయి కూడా.
లైఫ్‌లో అనుకున్నవన్నీ అందరూ సాధించొచ్చు. ఒక్కటి తప్ప. అదే మంచి ఆరోగ్యం.
డైరెక్షన్ చేయడం నాకు చాలా ఇష్టం. పిల్లల కోసం సూపర్ హీరో సినిమా చేయాలనుకుంటున్నా.
‘మమాంగం’లో నేను చేసిన క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాత్ర కోసం దాదాపు ఏడాది కష్టపడ్డా.
‘మాలికాపురం’ సినిమా పాన్ ఇండియా కాన్సెప్ట్. దాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నాం.
‘యశోద’ ఎక్స్‌పీరియెన్స్
మలయాళంలో వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. నటుడిగా రిహార్సల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఆలోచిస్తా. మలయాళ సినిమా సెట్‌లో ఇతర ఆర్టిస్టులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటా. అందుకని ముందు ఏం చేస్తానో చెప్పను. డైరెక్ట్‌గా కెమెరా ముందు చేసి చూపిస్తా. అప్పుడు వాళ్ల ఎక్స్‌ప్రెషన్స్ నేచురల్‌గా ఉంటాయి. కానీ, ఈ సినిమాలో ఒక సీన్ చేసేటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది? అని నేను, సమంత డిస్కస్ చేసుకున్నాం.
ప్రజ్ఞ