- రూపాయి మారకంగా వ్యాపారానికి రెడీ
- వోస్ట్రో ఖాతాలు తెరవడంపై చర్చిస్తున్న మరో 4 దేశాలు
- గల్ఫ్‌దేశాల నుంచి రూపాయల్లో పెట్టుబడులకు అవకాశం
న్యూఢిల్లీ: డాలర్లకు బదులు రూపాయల్లో వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రుపీ ట్రేడ్సెటిల్మెంట్ మెకానిజం’లో చేరడానికి మరిన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇది వరకే మారిషస్, శ్రీలంక, రష్యా వంటి దేశాలు ఈ పద్ధతికి మారాయి. తజికిస్థాన్, క్యూబా, లగ్జెంబర్గ్ , సూడాన్ ఈ విధానాన్ని ఉపయోగించడం గురించి భారతదేశంతో మాట్లాడుతున్నాయని అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో రష్యాపై యూరోపియన్ యూనియన్, అమెరికా సహా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా అది డాలర్లలో డబ్బు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనదేశంతో వ్యాపారానికి రూపాయి సెటిల్మెంట్ విధానాన్ని ఉపయోగిస్తోంది.
రుపీ ట్రేడ్సెటిల్మెంట్ మెకానిజాన్ని ఆర్బీఐ ఈ ఏడాది జూలైలో అందుబాటులోకి తెచ్చింది. డాలర్ల కొరత ఉన్న దేశాలను ఈ విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వోస్ట్రో ఖాతాలు అని పిలిచే ప్రత్యేక రూపాయి ఖాతాలను తెరవడానికి ఈ నాలుగు దేశాలు ఆసక్తి చూపాయి. భారతదేశంలోని భాగస్వామ్య బ్యాంకులు ఇంకా సంబంధిత సౌకర్యాలను అందించలేదని తెలుస్తోంది. ఈ ఖాతాలను తెరవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం అవసరం. మారిషస్, శ్రీలంక, రష్యా ఇది వరకే ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. వీటికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. రుపీ ట్రేడ్సెటిల్మెంట్ మెకానిజంలో కొత్త దేశాల చేరికపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు, ఆర్బీఐకి పంపిన ప్రశ్నలకు సమాధానం రాలేదు.
గల్ఫ్ దేశాలతో చర్చలు
భారతదేశానికి ప్రధాన చమురు సరఫరాదారులు సౌదీ అరేబియా, యూఏఈ సహా మరికొందరు పెద్ద వ్యాపార భాగస్వాములతో రూపాయలలో వాణిజ్యం గురించి మోడీ ప్రభుత్వం చర్చిస్తోంది. రూపాయి–-దిర్హామ్ ట్రేడ్ మెకానిజంపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఆర్బీఐ, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వర్గాలు చెప్పాయి. రూపాయి–-రియాల్ వాణిజ్య విధానంపై సౌదీ అరేబియాతో చర్చలు కూడా కొనసాగుతున్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా ఇదివరకు సంపాదించిన భారతీయ రూపాయలను ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు వివరాలను సేకరిస్తున్నాయి. భారతదేశానికి గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. ‘‘మేం భారతీయ మార్కెట్లలో అదనపు రూపాయలను పెట్టుబడి పెట్టడం గురించి ఆయా దేశాలకు వివరించాం.
ఈ ఏడాది ప్రారంభంలో జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీలలో రూపాయి హోల్డింగ్స్‌కు ఆర్బీఐ అనుమతించింది”అని ఆయన వివరించారు. రూపాయి కరెన్సీలో వ్యాపారం చేసేందుకు మరిన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని బ్యాంకులకు, పరిశ్రమ సంఘాలకు ప్రభుత్వ సూచించింది. ఇది వరకే 18 విదేశీ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, విదేశీ మారకద్రవ్యం ఆదా చేయడానికే ఈ ప్రయత్నం. భారతీయ బ్యాంకులు ఇప్పటికే ఈ మూడు దేశాల బ్యాంకుల్లో ప్రత్యేక వోస్ట్రో రూపాయి ఖాతాలను (ఎస్వీఆర్ఏలు) తెరిచాయి. రూపాయి కరెన్సీలో అమ్మకాలు కొనుగోళ్లు చేస్తున్నాయి. ఇటీవల ఎస్బీఐ మారిషస్ లిమిటెడ్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంకలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఎస్వీఆర్ఏని ప్రారంభించాయి.