Agriculture: నానో ట్రాక్టర్​... ఇది రైతులకు ఎంతో ఉపయోగం...

Agriculture: నానో ట్రాక్టర్​... ఇది రైతులకు ఎంతో ఉపయోగం...

వ్యవసాయంలో రోజు రోజుకూ మెషినరీ అవసరం పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే కొత్త కొత్త టెక్నాలజీతో అనేక మెషిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో చిన్న, సన్నకారు రైతులు కూడా మెషిన్లపైనే ఆధారపడుతున్నారు. చాలామంది కాడెడ్లకు బదులు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. కాకపోతే స్తోమత ఉన్నవాళ్లు సొంతంగా ట్రాక్టర్ కొనుక్కుంటుంటే.. లేనివాళ్లు కిరాయికి తెచ్చుకుని పొలం దున్నించుకుంటున్నారు. కానీ.. అది తలకు మించిన భారం అవుతోంది. అలాంటి వాళ్లకోసమే ఈ జుగాడ్ ఆలోచనతో 'నానో ట్రాక్టర్ లు మార్కెట్​ లోకి వచ్చేశాయి.తయారు చేశాడు మెకానిక్ బ్రహ్మచారి.

 ఎద్దులతో పొలం దున్నడం చాలా తగ్గిపోయింది.. ఇప్పుడు చాలామంది రైతులకు ఎడ్లే లేవు. అందరూ ట్రాక్టర్లపైనే ఆధారపడుతున్నారు. అందుకే చిన్న రైతుల కోసం ఒక చిన్న ట్రాక్టర్​ను తయారు చేశాడ ఓ ఇంజనీరు యాదారం బ్రహ్మచారి. అనుకున్న వెంటనే తయారీ మొదలుపెట్టాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా... అధిగమించి సామాన్య రైతులకు కూడా అందుబాటులో ఉండేవిధంగా ఒక ట్రాక్టర్ను తయారు చేశాడు. 

ఆ యువ ఇంజనీరు  బ్రహ్మచారి ఆరోతరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత వెల్డింగ్ పని నేర్చుకుని షాపు పెట్టుకున్నాడు. రైతులకు ఉపయోగపడే కర్లు, ఇనుప నాగళ్లను తయారు చేస్తుంటాడు. తన షాపునే ఒక ప్రయోగశాలగా మార్చుకుని ట్రాక్టర్ తయారీకి రెడీ అయ్యాడు. చాలా రోజులపాటు కష్టపడి  ఒక ట్రాక్టర్లు తయారుచేశాడు. ఆ తర్వాత దానికి కొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఏ మాత్రం డ్రైవింగ్ అనుభవం లేని రైతు కూడా దీన్ని నడపొచ్చు. పెద్ద ట్రాక్టర్​ తో  కూడా చేయలేని కొన్ని పనులు దీంతో చేయొచ్చు. ముఖ్యంగా అంతర పంటల సాగుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ట్రాక్టర్ టన్ను బరువును లాగగలదు. ట్రాలీని తగిలించినా పరుగులు పెడుతోంది. మరో విశేషం ఏంటంటే.. దీనికి డైనమో కూడా బిగించుకోవచ్చు. ఈ డైనమోతో కరెంట్ లేనప్పుడు బోరు బావిలోని మోటారును నడిపించవచ్చు..

నానో ట్రాక్టర్​ స్పెషాలిటీస్ 

ఈ చిట్టి ట్రాక్టర్ బరువు 150కిలోలు, నాలుగు అడుగుల పొడవు, 30 ఇంచుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తు, ఇంజిన్ కెపాసిటీ 4హెచ్ పీ(హార్స్ పవర్), డీజిల్, పెట్రోల్తో నడిచే ఈ ట్రాక్టర్ తయారు చేయడానికి లక్షా 40వేల రూపాయలు ఖర్చయింది. ఈ ట్రాక్టర్ నడవాలంటే గంటకు ఒక లీటర్ డీజిల్ కావాలి.
గంటకు 10 నుండి 15 కిలోమీటర్ల స్పీడుతో నడుస్తుంది. దీనికి ఐదు గేర్లు ఉంటాయి. అందులో ఒకటి రివర్స్ గేర్..  స్టీరింగ్ దగ్గరే బ్రేక్, గేర్ లు ఉంటాయి. మొత్తం చేతులతోనే ఆపరేట్ చెయ్యొచ్చు. కాలితో చేయాల్సిన పని ఏమీ ఉండదు. త్వరలోనే దీనికి హైడ్రాలిక్ సిస్టమ్​ ను  కూడా జోడిస్తానంటున్నాడు చారి. హైడ్రాలిక్ ఉంటే.. దున్నేటప్పుడు రాళ్లు అడ్డుపడితే చెయ్యి పెట్టి తియ్యాల్సిన పని తప్పుతుంది.

అన్ని పనులూ..

ఈ ట్రాక్టర్ను ఉపయోగించి అన్ని రకాల పనులూ చేసుకోవచ్చు. సాళ్లకు తగినట్లు 4 అంగుళాల వెడల్పు వరకు తగ్గించుకోవటం, పెంచుకోవటం చేసుకోవచ్చు. సాళ్ల మధ్య కలుపు మొక్కలను కూడా తొలగించవచ్చు. మెదట్లో  ఒక్క గేరుతో నడిచే నానో ట్రాక్టర్​ తయారు చేశానని. అప్పుడు 75వేల రూపాయలు ఖర్చయ్యాయని బ్రహ్మచారి తెలిపారు. ఆ తరువాత  కొన్ని మార్పులు చేసి కొత్తగా ఐదు గేర్లతో అందుబాటులోకి తీసుకొచ్చానని తెలిపాడు. ఉద్యానవన పంటల్లో చెట్ల చుట్టూ దున్నుకోవచ్చు. గొర్రు, దంతె, రోటోవేటర్ లాంటివాటిని బిగించుకోవచ్చు. అంతేకాకుండా గ్రామాలు, పట్టణాల్లో ఇరుకు వీధుల్లో కూడా చెత్త రవాణాకు వినియోగించవచ్చు. దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే కాబట్టి పేద రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.