రాష్ట్ర సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం..

  • మార్చి నాటికి 10 వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ!
  • గత సర్కార్ మూడేండ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు 
  • ఖజానాపై ఏటా రూ.5 వేల కోట్ల దాకా అదనపు భారం
  • ఆదాయంలో 35 శాతానికి పైగా జీతభత్యాలు, పింఛన్లకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేకల్లా అంటే రానున్న మార్చి నాటికి దాదాపు 10 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై నాటికే 4,405 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. దీంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.1,500 కోట్ల మేర భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది. రాష్ట్ర ఆదాయం దేనికెంత ఖర్చు అవుతుందనే వివరాలను ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు. ఇందులో జీతాలు, పెన్షన్​లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వాటికే ఎక్కువ మొత్తం వెళ్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 61కి పెంచింది.

ఫలితంగా 2021–24 మధ్యకాలంలో ఎలాంటి పదవీ విరమణలు జరగలేదు. మూడేండ్లు పూర్తవడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి. వచ్చే మార్చి నెలాఖరు నాటికి ఇంకో ఐదారువేల మంది రిటైరవుతారని అంచనా. మూడేండ్ల తరవాత ఈ ఏడాది నుంచి భారీగా పదవీ విరమణలు పెరిగినందున రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్లకు ఆర్థికభారం అధికంగా పడుతోంది. 2014-–15లో రాష్ట్రంలో మొత్తం 2,44,723 మంది పింఛన్ దారులకు రూ.7,046 కోట్లను పింఛన్ చెల్లించగా.. ఈ ఏడాది దానికన్నా 169 శాతం పెరిగి రూ.18,972 కోట్లకు చేరింది. వేతన సవరణలు, ఇంక్రిమెంట్లు, డీఏల కారణంగా ఉద్యోగులు, పింఛన్ దారుల సంఖ్య పెద్దగా పెరగకున్నా వారికి చెల్లించాల్సిన సొమ్ము భారీగా పెరుగుతున్నది. 

ఉదాహరణకు 2017–18లో రాష్ట్రంలో మొత్తం 2,57,604 మంది పింఛన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11,417 కోట్లను ఫింఛన్ కింద చెల్లించింది. ఆ తరవాత ఏడేండ్లలో 2023–24లో పింఛన్ దారుల సంఖ్య 2,184 మంది అదనంగా పెరిగి 2,59,788కి చేరింది. కానీ పింఛన్లకు చెల్లించిన సొమ్ము మొత్తం రూ.11,417 కోట్ల నుంచి అదనంగా 44.50 శాతం పెరిగి రూ.16,498 కోట్లకు చేరింది. ఇక ఈ సారి నుంచి రిటైర్మెంట్లు ఏటా కనీసం 8 వేల నుంచి 10 వేల వరకు ఉండనున్నాయి. రిటైర్ అవుతున్న ఉద్యోగులకు యావరేజ్​గా ఒక్కరికి కనీసం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఆపైన బెనిఫిట్స్ రూపంలో అందుతాయి. దీంతో ఈ మేరకు వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో అదనంగా ఏటా రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది. కొత్త వేతన సవరణ ఒప్పందం (పీఆర్సీ)తో పాట డీఏ పెంపు పెండింగ్​లో ఉన్నాయి. వాటిని కూడా అమలుచేస్తే మరింత ఆర్థికభారం పెరగనుంది.

177 శాతం పెరిగిన చెల్లింపులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 35 శాతానికి పైగా జీతాలు, పెన్షన్​లు, బెనిఫిట్స్ వంటి​ వాటికే పోతున్నది. 2014–15లో జీతభత్యాలు, పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్ము రూ. 21,233 కోట్లుంటే ఈ ఆర్థిక సంవత్సరం అది రూ.59,013 కోట్లకు చేరింది. గత పదేండ్ల కాలంలో ఏకంగా 177 శాతం చెల్లింపుల భారం పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయంలో జీతభత్యాలు, పింఛన్లకు 35 శాతం, పాత అప్పులపై కిస్తీల చెల్లింపులకు మరో 40 శాతం ఈ ఏడాది వెచ్చిస్తున్నట్లు తేలింది. మిగిలిన 25 శాతం సొమ్ముతోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర ఖర్చులన్నీ చేయాల్సి రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. సంక్షేమ హాస్టళ్లు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, ఇతర రాయితీలకు కూడా తప్పనిసరిగా నిధులు అవసరం కావడంతో నెలకు కనీసం రూ.4 వేల కోట్లయినా రుణాలు తీసుకోకపోతే ప్రభుత్వం ఆర్థికంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉన్నదని ఆర్థిక శాఖ రిపోర్టులో వివరించింది.