ప్రైవేటులో టెస్టులతో భారీగా బయటపడుతున్న కరోనా కేసులు

దాచినా దాగుతలే
మొదటి నుంచీ అరకొరగా టెస్టులు.. వైరస్ లేదంటూ ప్రకటనలు
ఇప్పుడు కేసులు పెరగడంతో ప్రైవేటుపై సర్కారు నిందలు
టెస్టులు సరిగా చేయడం లేదంటూ ల్యాబ్లపై చర్యలకు రెడీ

రాష్ట్ర సర్కార్ ఎంత దాచినా కరోనా దాగుతలేదు. అంతకంతకూ రెట్టింపవుతోంది. మొన్నటి వరకు అంతంత మాత్రంగా టెస్టులు చేసిన ప్రభుత్వం.. ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులకు పర్మిషన్ ఇవ్వడంతో 18 రోజుల నుంచి కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి. ప్రైవేటులో టెస్టులు పెరుగుతున్న కొద్దీ.. కేసులు పెరగడం సర్కారుకు ఇప్పుడు సంకటంగా మారింది. అందుకే.. జనం దృష్టిని మళ్లించేందుకు మరో ఎత్తుగడను ప్రయోగించింది. ప్రైవేటు హాస్పిటళ్లు రూల్స్ పాటించటంలేదని, ప్రైవేటు ల్యాబ్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయంటూ సుద్దులు పలుకుతోంది. కరోనాపై చేయాల్సిన యుద్ధాన్ని ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్లపై చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ అయి నాలుగు నెలలవుతోంది. మొదటి నుంచి ప్రభుత్వం టెస్టులు, ట్రేసింగ్ విషయంలో నిరక్ష్ల్యంగా వ్యవహరించింది. ప్రజలు, ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో టెస్టులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. జూన్ 15 నాటికి రాష్ట్రంలో 43,180 టెస్టులు చేస్తే.. 5,193 మందికి పాజిటివ్ వచ్చింది. జూన్ 16 నుంచి టెస్టుల సంఖ్యను పెంచారు. ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులకు అనుమతించారు. ఇక అప్పటి నుంచి అసలు కథ షురువైంది. టెస్టుల సంఖ్య పెరిగింది. కేసుల అసలు లెక్క బయటకొచ్చింది. ఈ 18రోజుల్లో 67,365 టెస్టులు చేస్తే, 17,119 కేసులు వచ్చినయి. టెస్టు చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఇందులోనూ 50 వేలకు పైగా టెస్టులు గ్రేటర్‌ హైదరాబాద్‌‌, చుట్టుపక్కల జిల్లాల్లోనే చేశారు. జిల్లాల్లోనూ టెస్టుల సంఖ్యపెంచితే, అక్కడి అసలు సంగతేంటో తెలిసే అవకాశం ఉంది.

ట్రేసింగ్ ఏది?
కరోనా టెస్టుల విషయంలో సర్కార్ నిరక్ష్ల్యంగా వ్యవహరిస్తే.. ట్రేసింగ్ విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టులకు కూడా సకాలంలో టెస్ట్ చేయించడం లేదు. టెస్టుల కోసం బాధితులే వెళ్లి ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబుల వద్ద లైన్లు కడుతున్నారు. టోకెన్లు అయిపోయాయని శాంపిల్ సెంటర్ల వద్ద ఉన్న సిబ్బంది, బాధితులను వెనక్కి పంపుతున్నారు. ఇలా తిరిగి తిరిగి శాంపిల్‌‌ ఇస్తే, టెస్ట్ రిజల్ట్ రావడానికి ఇంకో నాలుగైదు రోజులు పడుతోంది. ఈలోపల ఏదైనా జరిగి దవాఖానకు పోతే, రిపోర్ట్‌‌ ఉంటే తప్ప చేర్చుకోబోమని వెనక్కి పంపిస్తున్నారు. అటు, ఇటూతిరిగి దవాఖాన గేట్ వద్దే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.

గాంధీ హాస్పిటల్ తప్ప మరో దారేది?
రాష్ట్రంలోకి వైరస్ ఎంటరై 4 నెలలు దాటినా గాంధీ హాస్పిటల్ తప్ప మరో ప్రభుత్వ దవాఖానలో కరోనా ట్రీట్‌‌మెంట్ స్టార్ట్ చేయలేదు. వైరస్ లక్షణాలు ఎక్కువ ఉంటే ఆదిలాబాద్ పేషెంటైనా, నిజామాబాద్ పేషెంటైనా వందల కిలోమీటర్లు ప్రయాణించి గాంధీ హాస్పిటల్ కు రావాల్సిన పరిస్థితి. ఒక్క గాంధీ హాస్పిటల్లోనే ట్రీట్‌‌మెంట్ వల్ల తమపై ఒత్తిడి ఎక్కువ అవుతోందని 20 రోజుల కిందటే అక్కడి డాక్టర్లు ధర్నాకు దిగారు. ట్రీట్‌‌మెంట్‌‌ను డీసెంట్రలైజ్ చేయాలని, ఇతర హాస్పిటల్స్‌‌లోనూ కరోనా ట్రీట్‌‌మెంట్ స్టార్ట్ చేయాలని డాక్టర్లు అంటున్నా.. సర్కార్‌ పెద్దగా పట్టించుకోలేదు. పైగా గాంధీ హాస్పిటల్లో పేషెంట్లను పట్టించుకోకపోవడం, శవాలు తారుమారు కావడం వంటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చినయి. ఇటీవల చెస్ట్ హాస్పిటల్‌‌ పేషెంట్లు సెల్ఫీ వీడియోల ద్వారా తమ ఆవేదనను చెప్పుకుంటూనే కన్నుమూశారు. సర్కార్‌ దవాఖాన్లలో ఉన్న దుస్థితి ఈ వీడియోలతో బయటపడింది. దీంతో ప్రైవేటు హాస్పిటల్స్‌‌కు బాధితులు క్యూ కడుతున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులతో రికమెండ్ చేయించుకున్నా బెడ్లు దొరకని పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖాన్లపై నమ్మకం కలిగించేందుకు కనీసం ఓ కార్యక్రమం కూడా చేపట్టడం లేదు. గాంధీ హాస్పిటల్లోనే కార్పొరేట్‌‌ స్థాయిలో సేవలు అందిస్తున్నామని చెబుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు హాస్పిటల్స్‌‌కు వెళ్తున్నారు.

ప్రైవేటుపై నిందలు ఎందుకు?
రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్‌‌మెంట్‌ ‌కోసం ప్రైవేటులో అనుమతించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రైవేట్‌‌లో టెస్టుల సంఖ్యను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రభుత్వం మొదలుపెట్టింది. పర్మిషన్ ఇచ్చిన పది రోజులకే ప్రైవేటు ల్యాబుల్లో రైడ్‌ చేయించింది. అన్ని ల్యాబుల్లోనూ టెస్టులు కరెక్ట్ చేయడంలేదని ఓసారి.. కొన్ని ల్యాబుల్లోనేనని మరోసారి ప్రకటనలు చేసింది. లెక్కకు మించి టెస్టులు చేస్తున్నారని, పాజిటివ్ రేట్‌‌ ప్రైవేటులో ఎక్కువ వస్తోందని చెప్పుకొచ్చింది. ల్యాబులు సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ టెస్టులు తక్కువ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. రోజూ 8 వేల టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నా.. 3 వేల కంటే ఎక్కువ టెస్టులు చేయకపోవడానికి ఇదే కారణమని వాళ్లు అంటున్నారు.

For More News..

కరోనా డేంజర్లో హైదరాబాద్

జూలై 7 నుంచి నిమ్స్ లో వ్యాక్సిన్ ట్రయల్స్