పత్తి సాగుకే మొగ్గు..9.3‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా

పత్తి సాగుకే మొగ్గు..9.3‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా
  •     ఉమ్మడి పాలమూరులో పెరగనున్న సాగు విస్తీర్ణం
  •     సలహాలు, సూచనలు పాటించాలంటున్న అగ్రికల్చర్​ ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు: తొలకరి జల్లులు పడడంతో రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. ఈ వానాకాలం సీజన్​లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరితో పాటు పత్తి సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. రోహిణి కార్తెలో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు, ఈ నెల మొదటి వారం నుంచి వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు విత్తుకుంటున్నారు. అగ్రికల్చర్​ ఆఫీసర్ల అంచనా మేరకు ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్​లో 9.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని చెబుతున్నారు.

నిరుడు పత్తి రైతులకు లాస్..

నిరుడు పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు 8 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఆగస్టులో మోస్తరు వర్షాలు పడినా చేలకు జీవం పోయలేదు. బోర్ల ద్వారా నీళ్లు అందిద్దామన్నా గ్రౌండ్​ వాటర్​ పడిపోవడంతో చేన్లు ఎదగలేదు. మహబూబ్​నగర్​ జిల్లాలో 70 వేల ఎకరాల్లో పత్తికి వైరస్​ సోకింది. ఆకుమాడు తెగులు, ఎండు తెగులు, సుక్ష్మాధాత్రి లోపం, రసం పీల్చే పురుగు ఆశించి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో మొక్కలు రెండు ఫీట్లకు మించి పెరగలేదు. ఇది దిగుబడిపై ప్రభావం చూపింది. 

నాగర్​కర్నూల్​ జిల్లాలోనూ పత్తి చేన్లు ఎండిపోయాయి. నారాయణపేట జిల్లాలో వర్షాలు లేక 30 శాతం పంటలు ఎండిపోగా, 40 శాతం పంట ఎదగలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో  వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి సగానికి పడిపోయింది. కొన్ని ఏరియాల్లో వెదర్​ ఎఫెక్ట్​తో ఒక్కో మొక్కకు 10 నుంచి 12 కాయలు మాత్రమే పట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సీజన్​లో వర్షాలు పుష్కలంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగుకు సిద్ధం అవుతున్నారు.

60 ఎంఎం వర్షం పడితేనే..

ఉమ్మడి జిల్లాలో రైతులు పత్తి విత్తనాలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. వేసవి దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు, ఇటీవల కురిసిన వర్షానికి విత్తనాలు విత్తుకున్నారు. ఈ వర్షాలకు దుక్కులు చేసుకున్న మరి కొందరు, మంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 14 ఇంచుల (60 ఎంఎం) వర్షం పడితేనే విత్తనాలు విత్తుకోవాలని అగ్రికల్చర్​ ఆఫీసర్లు సూచిస్తున్నారు. ఐదారు ఇంచుల వర్షానికే విత్తనాలు విత్తుకుంటే, భూమి లోపలి నుంచి వచ్చే వేడికి మొలక శాతం తగ్గిపోతుంది. 

ఎకరా పత్తి చేనులో 12 వేల నుంచి 14 వేల మొక్కలు ఉండాలి. అందులో 90 శాతం మొక్కలు (11 వేలు) బతికితే రైతులకు మంచి లాభం వస్తుందని చెబుతున్నారు. 50 శాతం మొక్కలే వస్తే, నష్టాలు ఎదురవుతాయి. విత్తనాలు విత్తుకునేటప్పుడే రైతులు అడుగు పిండి, డీఏపీ, పొటాష్​ లేదా కాంప్లెక్స్​ ఎరువులు చల్లుకుంటే లాభం ఉంటుంది. విత్తనాలు విత్తుకున్న 15 రోజుల తర్వాత వీటిని చల్లుకుంటే మొక్క ఎదగదు.

ఏటా నాగర్​కర్నూల్​లోనే అధిక సాగు..

వానాకాలం సీజన్​లో ఏటా నాగర్​కర్నూల్​ జిల్లా రైతులే ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారు. వరిని రెండో ప్రధాన పంటగా వేస్తున్నారు. ఈ జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 4 లక్షల ఎకరాలు కాగా, గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు 3.32 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈసారి 4.50 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు 9 లక్షల పైచిలుకు ఉంటే, అందులో నాగర్​కర్నూల్​జిల్లాలోనే సగం సాగవుతుండడం విశేషం.

బిల్లులు తీసుకొని భద్రపర్చుకోవాలి..

విత్తనాలు కొనేటప్పుడు రైతులు మోసపోవద్దు. సర్కారు సర్టిఫై చేసిన విత్తనాలే కొనాలి. పత్తి విత్తనాలు కొంటే  బిల్లులు తీసుకోవాలి. విత్తన ప్యాకెట్​ కవర్​ లేదా సంచితో పాటు బిల్లును పంట కోత పూర్తి అయ్యేంత వరకు భద్రపర్చుకోవాలి. బిల్లులో కంపెనీ పేరు, లాట్​ నంబర్, ఏ రకమో ఉండేలా చూసుకోవాలి. పంట నష్టం వస్తే సంబంధిత కంపెనీతో పరిహారం ఇప్పించే అవకాశం ఉంటుంది.
- వెంకటేశ్వర్లు, డీఏవో, మహబూబ్​నగర్​

వానాకాలం సాగు విస్తీర్ణం

జిల్లా        సాగు విస్తీర్ణం    పత్తి సాగు
నాగర్​కర్నూల్    5,43,057    4,60,795
నారాయణపేట    4,79,069    1,64,861
మహబూబ్​నగర్​    3,72,890    1,15,380
గద్వాల        3,49,786    2,22,903
వనపర్తి        2,27,198    21,689