ప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది

ప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది
  • బాలింతలకు పండ్లు పంపిణీ చేసిన మంత్రి గంగుల కమలాకర్
  • రాబోయే కాలంలో వైద్యానికి మరిన్ని నిధులు కేటాయిస్తాం: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటే భయపడే పరిస్థితి ఉండేవని...అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులేవీ లేవని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేని ఆయన పేర్కొన్నారు. భారత దేశ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. సంరక్షణ కేంద్రంలోని బాలింతలకు మంత్రి గంగుల కమలాకర్ పండ్లు పంపిణీ చేశారు.

రజని అనే మహిళకు ఒకే కాన్పులో కవల పిల్లలు (ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు) జన్మించడంతో వారికి రెండు సీఎం కేసీఆర్ కిట్లతో పాటు 5000 రూపాయలను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి.కర్ణన్,  మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. వార్డుల్లో బాలింతలతో మంత్రి గంగుల మాటా మంతీ జరిపారు. అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో విద్య వైద్యానికి పెద్దపీట వేశామన్నారు. రాబోయే కాలంలో వైద్యానికి మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్య సేవల పట్ల ఇక్కడి బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవల కారణంగా ప్రతిరోజు 200 నుండి 300 మంది గర్భిణీ స్త్రీలు వస్తున్నారని, గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి...ఇప్పుడు ఆ పరిస్థితులు లేకుండా పోయాయని గుర్తు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా నాణ్యమైన ప్రభుత్వ వైద్యం కేవలం తెలంగాణలోనే అందుతోందని వివరించారు. 

నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ కు నిరుపేదల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక్కడ  దుతున్న వైద్య సేవలపై నమ్మకంతో  ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా ఇక్కడికే వస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున వస్తున్న పేషెంట్లతో ఇప్పుడున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం సరిపోవడం లేదు. దీన్ని మరింత విస్తరించి... వైద్య సిబ్బందిని నియమిస్తామని మంత్రి గంగుల తెలిపారు.