మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అదీ మీ వంటింట్లోనే ఉంది. అది కూడా నిత్యం వంటచేసినప్పుడల్లా వాడే పోపుల పెట్టెలోనే దాగుంది. పోపుల పెట్టెలో ఉండే నల్ల మిరియాల గురించి మాట్లాడుదాం. క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలువబడే మిరియాలు.. ఘాటుగా ఉన్నా... తియ్యగా ఉండే బెల్లంతో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వర్షాకాలంలో బ్లాక్ పెప్పర్.. బెల్లం కలిపి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. . .
వర్షాకాలం వచ్చిందంటే దోమలు.. ఈగలతో చాలా ఇబ్బంది పడతాం.. ఇక వైరస్ వ్యాప్తి చెందిందంటే ... ఇమ్యూనిటి పవర్ తగ్గి..సీజనల్ వ్యాధులు అంటే .. వైరల్ ఫీవర్, డెంగ్యూ లాంటి విష జ్వరాలతో.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి.. ఇలా ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వంటిట్లో ఉండే నల్లమిరియాలు.. బెల్లంతో అలాంటి వ్యాధులకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
దగ్గు,జలుబు: మిరియాలను మిక్సీలో పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత అందులో బెల్లం తురుగు కలిపి పరగడుపున రెండు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి. ఇలా నేరుతో తీసుకోలేని వారు వేడినీటిలో బెల్లం ముక్క.. చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగితే క్షణాల్లోనే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. పిల్లలకు పాలల్లో కూడా బెల్లం.. మిరియాల పొడి కలిపి కపం లాంటివి తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గొంతు నొప్పి: జలుబు.. తీవ్రంగా ఉన్నప్పడు గొంతునొప్పి వస్తుంది. బెల్లం .. నల్లమిరియాల పొడి మిశ్రమం గొంతు నొప్పిని తగ్గిస్తుంది. 50 గ్రామలు బెల్లం పొడి... 20 గ్రాముల మిరియాల పొడిని బాగా మిక్స్ చేయాలి. వర్షాకాలంలో ఈ మిశ్రమాన్ని టేబుల్ స్పూన్ సగం మోతాదులో ఒక గ్లాసుడు ( టీ గ్లాస్) గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.
కీళ్ల నొప్పులకు : మిరియలు.. బెల్లం మిశ్రమం కీళ్ల నొప్పులకు మంచి ఔషధం. బెల్లంలో ఉండే పాస్పరస్, కాల్షియం.. కీళ్లనొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది, నల్లమిరియాల్లో నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే పైపెరిన్ అనే మూలకం ఆర్థరైటిస్ పేషెంట్లకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే చేతులు, కాళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
జీర్ణక్రియ విషయంలో: బెల్లం.. మిరియాలు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయిని పెంచే గుణం ఉంటుంది. బెల్లం... నల్లమిరియాలు మిక్సింగ్ పదార్దం కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రిస్తుంది.
డిప్రెషన్ కు మంచి ఔషధం: మిరియాలు.. బెల్లం మిశ్రమం కలిపి తింటే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాలలో ఉండే పైపెరిన్ ... సెరోటోనిన్‌ని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
పీరియడ్స్ క్రాంప్స్ తగ్గేందుకు: పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్ మరియు... గ్యాస్ సమస్యను మిరియాలు ... బెల్లం తీసుకోవడం ద్వారా తగ్గుతాయి. బెల్లం.. మిరియాల పొడితో టీ..కాఫీ.. పాలు ఇలా ఏదైనా తాగవచ్చు.
ఆకలి పెంచడానికి: ఆకలిగా ఉండటం లేదని చాలామంది ఫీలవుతూ ఉంటారు. ఇలా సమయానికి ఆహారం తీసుకోకపోతే.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి రోజూ తీసుకుంటే.. ఆకలి పెరుగుతుంది.
తలనొప్పి: అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. తలనొప్పి నుంచి ఈజీగా బయటపడవచ్చు.
బరువు తగ్గడానికి: మిరియాల పైపొరలో ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడడంతో పాటు రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి కాపాడుతాయి. కాబట్టి మిరియాలు తీసుకోవడం వల్లే ఆరోగ్యమే కాదు.. ఫిట్ గానూ ఉండవచ్చు
ALSO READ | కవర్ స్టోరీ : వైరస్ రష్..ఈ సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?