
హైదరాబాద్, వెలుగు: తెలంగాణాలో రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలుజా తెలిపారు. ఇక్కడ తమకు రెండు గిగావాట్ల సోలార్ సెల్, 4.1 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రం ఉన్నాయని తెలిపారు. మరో నాలుగు గిగావాట్ల సెల్, మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. మూడు వేల కోట్ల పెట్టుబడి పెడతామని, ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నామని చిరంజీవి వివరించారు. ప్రీమియర్ ఎనర్జీస్ 2024లో 1గిగావాట్ల సోలార్ సెల్ లైన్, 1గిగావాట్ల సోలార్ మాడ్యూల్ లైన్ విస్తరణ కోసం రూ. 800 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు ప్రకటించిందన్నారు. ఈ ప్లాంట్ల నిర్మాణం ప్రస్తుతం చివరి దశలో ఉన్నదని చిరంజీవి సలూజా వివరించారు.