అక్రమాలకు కేరాఫ్‌గా మారిన మీ-సేవ కేంద్రాలు
ఒక్కదానికే పర్మిషన్ తీసుకొని రెండు, మూడు బ్రాంచ్‌ల ఏర్పాటు
ఓ ఊళ్లో ఏర్పాటు చేస్తామని.. మరో ఊరికి తరలింపు
పట్టించుకోని ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని మీ – సేవ సెంటర్లు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా తమ ఇష్టానుసారం వసూలు చేయడమేకాక, ఒక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని అదే నంబర్‌తో బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఊళ్లనే మార్చివేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు లేకపోవడంతో మీ – సేవా కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఓ చోట పర్మిషన్, మరోచోట నిర్వహణ
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 83 మీ–సేవ కేంద్రాలు, నాలుగు ప్రభుత్వ సెంటర్లు, 19 స్త్రీనిధి సెంటర్లు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం మీ–సేవ సెంటర్లను కేటాయిస్తుంది. ప్రభుత్వం ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చిందో అక్కడే సెంటర్‌ను నడపాల్సి ఉంటుంది. ఈ సెంటర్లను గతంలో జియో ట్యాగింగ్ ద్వారా మానిటర్ చేసేవారు. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేకపోవడంతో కొందరు వ్యక్తులు తమ ఇష్టం వచ్చిన ప్లేస్‌కు సెంటర్‌ను మార్చివేస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా సెంటర్ ఏర్పాటుకు పర్మిషన్ తీసుకొని, బాలెంలలో నడిపిస్తున్నారు. కోదాడలో నడవాల్సిన సెంటర్‌ను నిర్వాహకులు ఏకంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి తరలించారు.
లైసెన్స్ ఒకదానికి… నడిచేది మూడు సెంటర్లు
ప్రతి మీ–సేవ సెంటర్‌కు సెపరేట్‌గా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సూర్యాపేటలో పోస్టాఫీస్ ఎదురుగా ‘అభినందన’ పేరుతో మీ – సేవ ఏర్పాటుకు పర్మిషన్ తీసుకున్నారు. ఇదే లైసెన్స్‌తో తెలంగాణ తల్లి విగ్రహం, కొత్త బస్టాండ్ వద్ద మరో రెండు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే కోదాడలో ‘పరమేశ్’ పేరుతో పర్మిషన్ తీసుకున్న మీ సేవ కేంద్రాన్ని కోదాడతో పాటు, సూర్యాపేటలోనూ నడిపిస్తున్నారు.
కనిపించని పర్యవేక్షణ
మీ–సేవ కేంద్రాలను పర్యవేక్షించే ఆఫీసర్ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ–డిస్ట్రిక్ మేనేజర్ మీ–సేవ సెంటర్ల బాధ్యతలను చూసేవారు. ఏడాది కింద ఆయన ట్రాన్స్‌ఫర్ కావడంతో మరో ఆఫీసర్‌ను నియమంచలేదు. కనీసం ఇంచార్జ్ కూడా లేకపోవడంతో మీ–సేవ సెంటర్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మీ –సేవ కేంద్రాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో ఇటీవల రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద ఉన్న సెంటర్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సీజ్ చేశారు. మిగతా సెంటర్లలో కూడా తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
మీ-– సేవ లైసెన్స్ తీసుకున్న వ్యక్తి ఒక్క సెంటర్‌ను మాత్రమే నడిపించాలి. ఒకే లైసెన్స్‌పై ఒకటి కంటే ఎక్కువగా సెంటర్లు నడిపుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని మీ– సేవ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తాం.
– కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
For More News..