IPL 2025: పంత్‌ది అత్యాశ.. డబ్బు కోసమే క్యాపిటల్స్‌ను వీడాడు: ఢిల్లీ కోచ్

IPL 2025: పంత్‌ది అత్యాశ.. డబ్బు కోసమే క్యాపిటల్స్‌ను వీడాడు: ఢిల్లీ కోచ్

టీమిండియా వికెట్ కీపర్ రిష‌బ్ పంత్ పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ నూత‌న హెడ్ కోచ్ హేమంగ్ బ‌దానీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పంత్‌కు అత్యాశ ఎక్కువని అన్నారు. వేలంలో ఎక్కువ డ‌బ్బు సంపాందించవచ్చన్న దురాశతోనే అత‌ను ఢిల్లీని వీడినట్లు చెప్పుకొచ్చారు. భారత మాజీ క్రికెటర్ సుబ్ర‌మ‌ణ్యం బ‌ద్రీనాథ్‌తో చ‌ర్చ సంద‌ర్భంగా బ‌దానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు దక్కే అత్యధిక క్యాప్ అంటే రూ. 18 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వేలంలో సంపాదించగలనని రిషబ్ పంత్ భావించాడని హేమంగ్ బదానీ అన్నారు. అతన్ని నిలుపుకునేందుకు ఢిల్లీ యాజమాన్యం ఎంతో ప్రయత్నించిందని తెలిపారు. ఎంతకూ పంత్ అంగీకరించకపోవడంతో అతను మనసు నొప్పించలేక విడిచి పెట్టినట్లు వెల్లడించారు.

Also Read :- రోహిత్ శర్మ ఔట్.. అంతలోనే బతికి పోయిన హిట్‌మ్యాన్ 

ఏదేని ఒక ఆట‌గాడిని రిటైన్ చేసుకోవాలంటే.. అందుకు ఇరు పార్టీలు (ఆట‌గాడు, ఫ్రాంచైజీ) అంగీక‌రించాలి. ఇదే విషయాన్ని బదానీ చ‌ర్చలో ప్రస్తావించారు. పంత్‌ను నిలుపుకునేందుకు ఢిల్లీ యాజమాన్యం ఎంతో ప్రయత్నించిందని, పలు మార్లు అతనికి ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు చేసింద‌ని ఢిల్లీ కొత్త కోచ్ బహిరంగ పరిచారు. తొలి రిటైన్ ప్లేయ‌ర్‌గా అత‌నికి రూ.18 కోట్లు దక్కేవని.. అంత‌కంటే ఎక్కువ ఆశించి వేలంలోకి వెళ్లాడ‌ని వెల్లడించారు. బ‌దానీ చేసిన ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

వేలంలో రూ. 27 కోట్లు

తాను ఊహించినట్లుగానే పంత్‌ మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టాడు. రూ. 27 కోట్లు వెచ్చించి లక్నో సూపర్ జెయింట్స్‌ యాజమాన్యం అతన్ని దక్కించుకుంది. దాంతో, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ కార్డు(RTM) ఉపయోగించి రూ.21 కోట్ల వద్ద పంత్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో లక్నో ఏకంగా ఒకేసారి బిడ్‌ను రూ.6 కోట్లు పెంచడంతో వెనకడుగు వేసింది.