విమానాలు వేస్టంట రైల్లోనే తిరుగుతరట

యూరప్​ దేశాల్లోని రవాణా రంగంలో ఈమధ్య స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మెజారిటీ జనాలు జర్నీల కోసం విమానాలు వదిలి రైళ్లెక్కుతున్నారు. ప్రయాణ సమయం, ఖర్చు, సౌకర్యం వంటి విషయాల్లో ఫ్లైట్లతో పోల్చితే ట్రైన్లే బెటరని అంటున్నారు. క్లైమేట్​ ఛేంజ్ ఎఫెక్ట్​లను తగ్గించటానికి ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి. లక్సెంబర్గ్​ అనే దేశంలో వచ్చే ఏడాది నుంచి పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ని ఫ్రీగా అందించనున్నారు. పబ్లిక్​ని, గవర్నమెంట్లను రైళ్ల దిశగా నడిపించటంలో ‘ఫ్లైట్​ షేమ్’ ఉద్యమం ముఖ్య పాత్ర పోషించింది.   ​

యూరప్​ దేశాల్లో బెల్జియం ఒకటి. ఆ దేశ రాజు, రాణి రీసెంట్​గా లక్సెంబర్గ్​లో మూడు రోజులు పర్యటించి స్వదేశానికి రైల్లో వచ్చారు. కింగ్​, క్వీన్​ సైతం సాధారణ వ్యక్తుల్లా ట్రైన్​లో జర్నీ చేయటం ఆసక్తికరంగా అనిపించింది. ‘ఫ్యూయెల్​తో ఎగిరే విమానాల్ని ఎక్కువగా వాడితే​ పొల్యూషన్ పెరుగుతుంది.​ వాతావరణం మార్పులకు గురవుతుంది. క్లైమేట్​ ఛేంజ్​ వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకని పర్యావరణాన్ని కాపాడుకోవటంపై ప్రజలకు అవగాహన కల్పించటానికి వాళ్లిద్దరు అలా చేశారు’ అని తర్వాత తెలిసింది.

రెండేళ్ల కిందటే మొదలైన మార్పు

యూరప్​ దేశాల్లో పబ్లిక్​ గతంలో ఎక్కువ శాతం చిన్న విమానాల్లో ప్రయాణించేవారు. 50 కిలోమీటర్ల లోపు జర్నీకి కూడా వాళ్లు ఫ్లైట్లకే ఓట్లేసేవారు. ఆయా దేశాల్లో గాలి మోటర్ల సర్వీసులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటాయి. అవి 20, 30 మందిని సైతం తీసుకెళుతుంటాయి. మన దేశంలో సిటీ బస్​లు ఎలా రయ్​ రయ్​న తిరుగుతుంటాయో అక్కడ ఫ్లైట్లు అలా కంటిన్యూగా వస్తూ పోతూ ఉంటాయి. అయితే.. విమానాల వాడకం పెరగటంతో ఆ దేశాలు క్రమంగా కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి.

ఈ పరిస్థితితోపాటు ప్రభుత్వ, ప్రజల ఆలోచనలో మార్పు తెచ్చేందుకు స్వీడన్​లో రెండేళ్ల క్రితం తొలి అడుగు పడింది. ఆ దేశానికి చెందిన స్టఫన్ లిండ్​బర్గ్​ అనే సింగర్​ తాను జీవితంలో ఇక ఫ్లైట్​ ఎక్కబోనని ప్రకటించాడు. ఈ మేరకు రాసిన ఓ ఆర్టికల్​పై​ ఆయన ఫ్రెండ్స్​ ఐదుగురు (ఫేమస్​ పర్సన్స్​) సంతకాలు చేశారు. వారిలో టీనేజీ​ ఎన్విరాన్​మెంటల్​ యాక్టివిస్ట్​ గ్రెటా థన్​​బెర్గ్ తల్లి కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఆ ఉద్యమం యూరప్​ మొత్తం వ్యాపించింది. దీంతో మెజారిటీ ప్యాసింజర్లు ట్రైన్ల వైపే మొగ్గుచూపటం మొదలైంది.

యూరైల్​ పాస్​ హోల్డర్లు బోలెడు బెనిఫిట్లు పొందుతున్నారు. యూరోపియన్​ యూనియన్​లోని ఏ దేశానికి వెళ్లినా వాళ్లకు రేట్లలో డిస్కౌంట్​ ఇస్తున్నారు. ఫెర్రీ రూట్లలో, నౌక ప్రయాణాల్లో, హోటల్స్​లో, మ్యూజియం టికెట్ల ధరల్లో, సిటీ కార్డులతోపాటు ఇతరత్రా ప్రయోజనాలు కలుగుతున్నాయి. ట్రావెలర్లు పాకెట్​ ఫ్రెండ్లీ ఎక్స్​పీరియెన్స్ పొందేలా యూరైల్​ సంస్థ అనేక రాయితీలు ఇస్తోంది. గ్లోబల్​ పాస్​లపై 37 శాతం వరకు పర్మనెంట్​ డిస్కౌంట్​ను ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించింది.

ఫ్లైట్​ షేమింగ్​ తెచ్చిన మార్పు ఇది

టీనేజీ క్లైమేట్​ ఛేంజ్​ యాక్టివిస్టు గ్రెటా థన్​బర్గ్.. ఇంగ్లండ్​ నుంచి న్యూయార్క్​కి షిప్​లో వచ్చారు. జీరో ఎమిషన్సే లక్ష్యంగా ఆమె ఈ ప్రయాణం చేశారు. దీనివల్ల వాతావరణంలోని కార్బన్ ఫూట్​ప్రింట్ సైజ్​ని సాధ్యమైనంత తగ్గించాలని భావించారు. ఈ నిర్ణయం ‘ఫ్లైట్​ షేమింగ్​’ ఉద్యమానికి ఊపునిచ్చింది. విమాన ప్రయాణాల్ని తగ్గించుకోవాలని కోరటమే ఈ ఉద్యమ ఉద్దేశం. ‘దేశంలో పొల్యూషన్​ ఈ స్థాయిలో ఉన్నా మనం ఇంకా ఫ్లైట్​ జర్నీ చేయాలనుకోవటం సిగ్గు సిగ్గు’ అనే ఫీలింగ్​ ప్రజల్లో పెరిగింది. ‘నెదర్లాండ్స్​లోని రోట్టర్​డ్యామ్​ అనే సిటీలో మా ఇంటికీ రైల్వే స్టేషన్​కి మధ్య ప్రయాణ దూరం మహా అయితే 15 నిమిషాలే. ఎయిర్​పోర్ట్​కి వెళ్లటానికి గంటలు పడుతుంది. అందుకే మేం పారిస్​కి రైల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని ఓ తెలుగు జంట చెప్పింది. ఈ దంపతులు యూరప్​ టూర్​లో ట్రైన్​ జర్నీనే ప్రిఫర్​ చేస్తున్నారు. ‘రైళ్ల వల్ల కాలుష్యం తగ్గుతుంది. టికెట్​ రేట్లు ఫ్లైట్​తో పోల్చితే చాలా తక్కువ. ప్రయాణం కూడా రైల్లోనే సౌకర్యవంతంగా ఉంది’ అని వివరించారు.

31 దేశాల్లో యూరైల్ నెట్​వర్క్​

ఫ్లైట్​ షేమింగ్​ మూవ్​మెంట్​ నార్త్​ యూరప్​లో బలంగా నడుస్తున్నా ఫ్రాన్స్​లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ ఆలోచన వైపు జనం మెల్లగా దృష్టి పెడుతున్నారు. ‘మా దేశంలో ఈ ఉద్యమం అంతగా లేకపోయినా రైల్లో జర్నీ చేయటం ఇప్పటికీ పాపులరే. ఇప్పుడు యూరప్​లో ఎక్కడికైనా ట్రైన్​లో చేరుకోవచ్చు’ అని పారిస్​కి చెందిన ఫ్రెంచ్​ డైరెక్టర్​ పాస్కల్​ ప్లిస్సన్​ అన్నారు. యూరైల్​ నెట్​వర్క్​ దాదాపు 31 యూరప్​ దేశాల్లో విస్తరించింది. 40 వేల రైల్వే స్టేషన్లతో 35కి పైగా యూరోపియన్​ రైల్వేలు, షిప్పింగ్​ కంపెనీలకు కనెక్టివిటీ ఉంది.       ​      ​

యూరప్​లో రైలు పాస్​లు కారు చౌక

యూరప్​ దేశాల్లో రైల్వే పాస్​లను చౌకగా ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు ట్రైన్లు ఎక్కటానికే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా స్కాండినేవియన్​ దేశాల్లో (ఫ్లైట్​ షేమింగ్​ మూమెంట్​ పుట్టిన ప్రాంతాల్లో) ఏటా రైళ్లలో రాకపోకలు ఎక్కువయ్యాయి. ట్రైన్​ పాస్​లు తీసుకునేవారి సంఖ్య 2018తో పోల్చితే 2019లో 80 శాతానికి పైగా పెరిగింది. కస్టమర్ల ప్రవర్తనలో మార్పుకు ఇది అద్దం పడుతోందని యూరైల్​, ఇంటర్​రైల్​ జనరల్​ మేనేజర్​ కార్లో బొసెల్లి తెలిపారు. విమాన ప్రయాణ సమయంతో పోల్చితే ట్రైన్​ జర్నీ టైమ్​ కొంచెం ఎక్కువైనా రైల్లో వెళ్తే ప్రకృతి అందాలు చూస్తూ ఎంజాయ్​ చేయొచ్చని ప్యాసింజర్లు చెబుతున్నారు. ఫ్లైట్​లో ఆ ఛాన్స్​ ఉండదని, టీజీవీ వంటి హైస్పీడ్​ ట్రైన్లు విమానాల కన్నా ఎక్కువ వేగంతో వెళతాయని అంటున్నారు. జనం పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ని ప్రిఫర్​ చేస్తున్న కారణంగా లక్సెంబర్గ్​లో 2020 మార్చి నుంచి ప్రజా రవాణాని అందరికీ ఉచితంగా అందించనున్నారు. ఈ సౌకర్యం కల్పిస్తున్న ప్రపంచంలో తొలి ప్రాంతంగా లక్సెంబర్గ్​ నిలవనుంది.​      ​