డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల అవస్థలు
నాంచారమ్మ బస్తీలో రెండు నెలలకే నీటి గోస
సడన్ గా ఆగిపోతున్న లిఫ్టులు
వానలకు లీకేజీలు
డ్రైనేజీ పైపులైన్ పగిలి మురుగు కంపు
అధికారులకు చెప్పినా పట్టించుకోట్లే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఆదిలోనే అభాసుపాలవుతోంది. లేటుగా అయినా సర్కారు ఇచ్చిన ఇంటితో ఇబ్బందులు తీరుతాయనుకున్న జనానికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. నాగోల్ డివిజన్లోని ఎరుకల నాంచారమ్మ బస్తీలో ప్రభుత్వం రూ.26 కోట్లతో 288 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఈ ఏడాది జూన్15న మంత్రులు సబితా రెడ్డి, మల్లారెడ్డి 154 మందికి అందించారు. రెండు బ్లాకుల్లో 9 ఫ్లోర్ లునిర్మించగా, ఏడు ఫ్లోర్ లుమాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. ఇండ్లు అప్పగించిన రెండు నెలల్లో మెయింటెనెన్స్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇవీ సమస్యలు…
నాంచారమ్మ బస్తీలో డబుల్ ఇండ్లకు నీటి సరఫరా కోసం వేసిన నాలుగు మోటార్లు కాలిపోయాయి. వారం రోజులైనా పట్టించుకునే వారు కరువయ్యారు. దాంతో జనం నీళ్లకోసం బయటి నుంచి మోసుకొచ్చుకుంటున్నారు. ఏడో అంతస్తు వరకు మెట్ల మీది నుంచి తీసుకెళ్తున్నారు. లిఫ్ట్లు తరుచూ మధ్యలో ఆగిపోతున్నాయి. దాంతో అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నిర్మాణ పనుల్లో క్వాలిటీ పాటించకపోవడం వల్ల అప్పుడే గోడలకు పగుళ్లు వస్తున్నాయి. వర్షం కారణంగా లీకేజీలు ఏర్పడుతున్నాయి. చిన్న వానకే సెల్లార్లో, స్లాబ్‌పైన నీళ్లు నిలుస్తున్నాయి. డ్రైనేజీ పైపులైన్ పగిలి మురుగు పొంగి పొర్లుతోంది. ఫైర్ సేఫ్టీ పైప్లైన్స్ మాత్రమే వేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. మెయింటెనెన్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించిన షెటర్లను రెంట్ కి ఇవ్వాల్సి ఉండగా, అధికారులు ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. దాంతో అవి నిరుపయోగంగా మారాయి. సమస్యలపై అధికారులకు కంప్లయింట్ చేసినా పట్టించుకోవడం లేదని లబ్ధి దారులు వాపోతున్నారు.
బయటి నుంచే నీళ్లు
మేమొచ్చిన మొదట్లో ఇంట్లోకి నీళ్లొచ్చేయి. వారం నుంచి బంద్ అయినయి. బయటి నుంచి తెచ్చుకుంటున్నం. -యాదమ్మ, లబ్ధి దారు
లిఫ్ట్ ఎక్కాలంటే భయమైతాంది
రెండు బ్లాకుల్లో నాలుగు లిఫ్ట్ లు ఉన్నయి. కానీ అవి ఎక్కాలంటే భయమైతాంది. ఉన్నట్టుండి మధ్యలోనే ఆగిపోతున్నయి. -జయమ్మ, లబ్ధి దారు
అధికారులు పట్టించుకోవాలె
డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో సమస్యలపై అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకుంటలేరు. మోటార్లు కాలిపోవడంతో నీళ్లకు ఇబ్బంది అయితాంది.
-బాలమ్మ, లబ్ధి దారు
మెయింటెనెన్స్ వాళ్లే చూసుకోవాలె
లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చేంతవరకు మాత్రమే ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ వాళ్లే చూసుకోవాలి. మోటార్లు కాలిపోయిన విషయం మావరకు రాలేదు.
-సురేశ్, జీహెచ్ఎంసీ హౌసింగ్ సీఈ
For More News..