ప్లాస్టిక్‎తో కలిగే ప్రమాదం.. కళ్లకు కట్టేట్లు చూపే వీడియో

ప్లాస్టిక్‎తో కలిగే ప్రమాదం.. కళ్లకు కట్టేట్లు చూపే వీడియో

ప్రస్తుత రోజుల్లో ఏ షాపింగ్ చేసినా.. దుకాణాదారులు వాటిని మనకు అందించేది ప్లాస్టిక్ కవర్లలోనే. వాడకానికి బాగానే ఉన్నా ఆ కవర్ల వల్ల కలిగే ప్రమాదం మాత్రం అంతాఇంతాకాదు. ప్లాస్టిక్ రసాయనాలతో తయారయ్యే ఈ కవర్లు అందంగాను, రంగురంగులతో ఉండి.. అత్యంత తేలికగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా బాగా వాడుకలోకి వచ్చాయి. ఈ ప్లాస్టిక్‏తో తయారుచేయలేని వస్తువంటూ ఏదీ లేదు. అయితే ఈ ప్లాస్టిక్  స్వతహాగా విష పూరితం కాదు, ఆరోగ్యానికి హానికరము అంతకన్నా కాదు. కానీ వీటి వ్యర్థ పదార్థాల వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు మాత్రం మామూలుగా ఉండదు. అందుకే గత కొంత కాలం నుంచి ప్లాస్టిక్ బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వాలు, ఎన్జీవోలు విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి. 

పర్యావరణ వేత్త ఎరిక్ సొల్హమ్ ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో, మెసెజ్‎లతో సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉంటారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్‎లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూస్తే ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రమాదమో కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. ‘ప్రజలు వాడి పడేసిన కవర్లు, వాటర్ బాటిళ్లతో నదులు, సముద్రాలలో కాలుష్యం పెరుగుతుంది. అవేంటో, వాటి వల్ల ఎంత ప్రమాదమో తెలియక పక్షులు వాటిని తింటాయి. కొన్నాళ్లకు వాటి కడుపంతా ప్లాస్టిక్‎తో నిండి.. ఆ ప్లాస్టిక్ జీర్ణం కాకపోవడంతో పక్షులు మరణిస్తుంటాయి. ఇలా మరణించిన కొన్ని పక్షుల కడుపులో చూస్తే లెక్కలేనన్ని ప్లాస్టిక్ వస్తువులు బయటపడుతున్నాయి. చనిపోయిన పక్షుల శరీరాలో మట్టిలో కలిసిపోతున్నాయి, కానీ వాటి కడుపులోని ప్లాస్టిక్ మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ ఈ భూమండలానికి ఎంత ప్రమాదమో ఇప్పటికైనా తెలుసుకోండి’ అంటూ ఆయన ఓ వీడియో ట్వీట్ చేశారు. భూగ్రహం మీద ప్లాస్టిక్ వల్ల కలిగిన అత్యంత భయానక దృశ్యాలలో ఇది ఒకటి అని ట్యాగ్ చేశారు.

ప్లాస్టిక్.. అందులో రకాలు
ప్లాస్టిక్ అనేది పాలిమర్లు, మోనోమర్ల కలయికతో పాలి ఎథిలిన్‎గా ఏర్పడి కవర్లు, ప్లాస్టిక్ వస్తువులుగా రూపాంతరం చెందుతుంది. ప్లాస్టిక్ సంచులు మూడు రకాల పాలిమర్లతో తయారవుతాయి.  మొదటిది ఎక్కువ సాంద్రతగల పాలీ ఎథిలిన్  (హెచ్‎డీపీఈ), రెండోది తక్కువ సాంద్రతగల  పాలీ ఎథిలిన్ (ఎల్‎డీపీఈ), మూడోది అతి తక్కువ సాంద్రతగల  పాలీ ఎథిలిన్  (ఎల్ఎల్‎డీపీఈ). కిరాణా సంచులు హెచ్‎డీపీఈతో, డ్రై క్లీనింగ్ వాడే సంచులు ఎల్‎డీపీఈతో తయారుచేస్తారు.

ప్లాస్టిక్‎ శరీరంలోకి వెళ్తే కలిగే ప్రమాదాలు
ప్లాస్టిక్‎లో కేన్సర్ కలుగచేసే పదార్థాలుంటాయి. అందుకే ప్లాస్టిక్ కడుపులోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్లాస్టిక్ బ్యాగుల తయారీలో కాడ్మియం, సీసం వంటి విషపూరిత పదార్థాలు వాడుతారు. ఇవి శరీరంలోకి పోతే.. వాంతులు,  గుండె పరిమాణంలో మార్పులు కలుగుతాయి. అదే సీసం శరీరంలోకి వెళ్తే.. మెదడులోని కణాలు చనిపోవడం వంటివి కలుగుతాయి.

ప్లాస్టిక్ కవర్లతో కలిగే సమస్యలు
మనం ఏదైనా షాపింగ్ లేదా కూరగాయాలో తీసుకొచ్చి ప్లాస్టిక్ కవర్లను బయటపడేస్తాం. అవి డ్రైనేజి కాలువలలోకి వెళ్లడం వల్ల కాల్వలు మూసుకుపోయి.. మురుగునీరు ముందుకు వెళ్లిపోవడం ఆగిపోతుంది. దాంతో అశుభ్రమైన వాతావారణం ఏర్పడి.. నీటి ద్వారా వచ్చే వ్యాధులు పెరుగుతాయి. అందుకే కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా.. భూమిలో గుంత తీసి పూడ్చివేయాలి. చాలామంది మిగిలిపోయిన ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో కట్టి బయటపడేస్తారు. దాంతో జంతువులు, పక్షులు ఆ ఆహారాన్ని తినే క్రమంలో ప్లాస్టిక్ కవర్లను కూడా తింటాయి. కొంతమంది ఈ కవర్లను, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను కాల్వలలో, నదులలో, సముద్రాలలో పడేస్తారు. దాంతో భూగర్భజలాలు కూడా అంతరించిపోతున్నాయి.

బయోడిగ్రేడబుల్ గార్బేజ్ చట్టం
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ సంచులు మురుగుకాల్వలో పడేయటం వల్ల పర్యావరణానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో జమ్ముకశ్మీర్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బయోడిగ్రేడబుల్ గార్బేజ్ చట్టాన్ని రాష్ట్రమంతా అమలుచేస్తుంది. ఈ చట్టాన్ని 2009 ఆగష్టు 15 నుంచి అమలులోకి తీసుకొస్తూ అప్పటి రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దేశంలో వ్యర్ధ ప్లాస్టిక్ వల్ల వాతావరణానికి కలిగుతున్న నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేసింది. దాంతో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడానికి కొన్ని కమిటీలతో పాటు టాస్క్‎ఫోర్స్ టీమ్‎లను కూడానియమించింది. అంతేకాకుండా.. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మీద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) 10 ప్రమాణాలని ప్రకటించింది. వాటికనుగుణంగానే ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను, వస్తువలను తయారుచేయాలని సూచించింది. దాంతో ప్లాస్టిక్ కంపెనీల యాజమాన్యాలు.. కవర్ల వాడాకాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పలుచని, తక్కువ మందం కలిగిన కవర్ల తయారీ వల్ల వాటి ధర తక్కువగా ఉండటంతో వాడకం బాగా పెరిగింది. అదే ఎక్కువ మందంతో, అధిక ధరకు కవర్లను విక్రయిస్తే వాటిని వాడే వినియోగదారులు తగ్గుతారని అంచనా వేస్తున్నాయి. 

ప్లాస్టిక్‎కు ప్రత్యామ్నాయాలు
ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని అలవాటుచేయాలి. అయితే పేపరు సంచుల తయారీలో చెట్లను నాశనం చేస్తున్నారు. అందుకే వాటి వినియోగాన్ని కూడా పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమస్యలన్నింటికి అధిగమించాలంటే.. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి.
 
బంగాళదుంపలతో ప్లాస్టిక్
బంగాళదుంపలతో క్యారీబ్యాగులు, స్పూన్‎లు, ప్లేట్స్‌, పిల్లల ఆట వస్తువులు కూడా తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఎందుకంటే వీటిని వాడి పడేసిన తర్వాత కొద్ది రోజులకే కరిగి భూమిలో కరిగిపోతాయి. అంతేగాక వీటిని రిసైక్లింగ్‌కి  కూడా వాడవచ్చు. బ్రిటన్‌, జపాన్‌లలో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. వీటిని అక్కడ ‘స్పడ్‌వేర్’గా పిలుస్తుంటారు. ఇది సంప్రదాయ ప్లాస్టిక్‌ కంటే బలమైనది. మామూలు ప్లాస్టిక్‌ కంటే చవక. కిచెన్‌లో ఉపయోగించే కత్తులను సైతం పొటాటో, కార్న్‌ స్టార్చ్‌లతో తయారుచేస్తారు. బంగాళదుంప నుండి తీసే స్టార్చ్‌ బయో పాలిమర్‌ ప్లాస్టిక్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. బయో పాలిమర్‌ భూమిలో త్వరగా కరిగిపోయే గుణం ఉన్నందువలన పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు.పొటాటో ప్లాస్టిక్‌ను తయారు చేసుకోవడం చాలా సులభం. బంగాళదుంపలు, వెజిటేబుల్‌ లిక్విడ్‌ గ్లిజరిన్‌, వైట్‌ వెనిగర్‌, ఫుడ్‌ కలరింగ్‌ లతో పొటాటో ప్లాస్టిక్‌ తయారు చేసుకోవచ్చు.