భద్రాద్రి రామయ్యకు మరిన్ని పూజలు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్య భక్తులకు మరింత చేరువ కానున్నాడు. ఆ దశరథ తనయుడిని సేవించుకునేందుకు మరిన్ని పూజలు అందుబాటులోకి రానున్నాయి. ఎంతో ఆసక్తిదాయకమైన, భక్తి ప్రదాయకమైన వేదాశీర్వచనం, తులాభార సేవలను నిర్వహించాలని సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ఈవో రమాదేవి ఆరు కొత్త పూజల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి కొత్త సేవలు నిర్వహించనున్నారు. 

పూజల వివరాలు ఇలా..

వేద ఆశీర్వచనం: దర్శనం అనంతరం బేడా మండపంలో దంపతులు లేదా ఒకరికి ఈ సేవ చేస్తారు.  టికెట్​ ధర రూ.500. ఉదయం 9.30, 10, 11 గంటలకు స్లాట్స్ కేటాయించారు. ఈ సేవ చేయించుకున్న భక్తులకు ఆశీర్వచనంతో పాటు కండువా, జాకెట్ పీసు, రెండు చిన్న లడ్డూలు ఇస్తారు.
తులసిమాల అలంకరణ: ప్రతి శనివారం మాత్రమే ఈ సేవ ఉంటుంది. దంపతులు లేదా ఒకరు ఉదయం 7 గంటలకు చేయించుకోవచ్చు. రూ.1000 టికెట్​ ధర. సేవ చేయించుకునే వారి శిరస్సుపై తులసిమాలలు ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయించి అంతరాలయంలో మూలవరులకు వారి సమక్షంలో ఆ తులసిమాలలతో అలంకరణ చేస్తారు. ఈ సందర్భంగా సేవ చేయించుకునేవారికి కండువా, జాకెట్ పీసు, రెండు లడ్డూలు, అంతరాలయ అర్చనతో రామకోటి పుస్తకం ఇస్తారు.

ఉదయాస్తమాన సేవ: ఒక రోజులో ఆలయంలో జరిగే అన్ని సేవల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా దంపతులకు ఈ సేవ కింద అనుమతి ఇస్తారు. టికెట్ ధర రూ.5 వేలు. సుప్రభాతం, అభిషేకం, అంతరాలయ అర్చన, శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి అర్చన, ఆంజనేయస్వామివారి అర్చన, నిత్య కల్యాణం, వేదాశీర్వచనంలో సచిత్ర రామాయణ పుస్తకం, ముత్యాల తలంబ్రాలు, అన్నదానం, దర్బారుసేవ, పవళింపు( ఏకాంత సేవ) ఇలా 11 రకాల సేవల్లో భక్తులు పాల్గొనవచ్చు. 

శ్రీరామనవమి ముత్యాల సమర్పణ: శ్రీరామనవమి సీతారాముల కల్యాణానికి రూ.10 వేలు కట్టి భక్తులు ముత్యాల తలంబ్రాలు సమర్పించవచ్చు. శ్రీరామనవమి రోజున కల్యాణ సెక్టారులో ఇద్దరికి టికెట్లను ఇస్తారు. కల్యాణ వస్త్రాలు, ప్రసాదాలు, 108 ముత్యాలతో కూడిన తలంబ్రాలు అందిస్తారు. 

నిత్య పూల అలంకరణ సేవ: సోమవారం నుంచి శనివారం వరకు ఏదైనా ఒక రోజు స్వామివారికి, ఉపాలయాలకు అవసరమైన పూలదండలు అలంకరణ చేసే ఈ సేవకు టికెట్​ ధర రూ. 5 వేలు. ఈ సేవ చేయించుకున్న భక్తులకు కండువ, జాకెట్ పీసు, రెండు లడ్డూలు, అంతరాలయ అర్చన, అన్న ప్రసాదం కల్పిస్తారు.

తులాభారం: ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు వారికి ఇష్టమైనది, వారి బరువుకు అనుగుణంగా స్వామికి  సమర్పించుకోవచ్చు. టికెట్ ధర రూ.100.