నీ బాడీ చూసుకున్నావా?
నీ సైజ్‌కి సెట్ అయ్యే డ్రెస్‌లు కుట్టాలంటే ఎన్నేండ్లు పడుతుందో..
నీకు పెండ్లవ్వడం కష్టమే..
ఇంత బరువుతో జీవితంలో నువ్వేం సాధించలేవు..
ఇలాంటి ఎగతాళి మాటలు లైఫ్‌లో ప్రతి స్టేజ్‌లో ఎదురయ్యాయి దీక్షా సింఘికి. కానీ, ఎదుటివాళ్ల కోసం తనని తాను మార్చుకోవాలి అనుకోలేదామె. జనాల ఆలోచనల్ని మార్చాలనుకుంది. అందుకోసం ఫ్యాట్ ఈజ్ క్యూట్ అంటూ ర్యాంప్ వ్యాక్ చేసింది. మొన్న జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లోనూ కనిపించింది. ప్లస్ సైజ్ కోసం ‘ఏ లిటిల్ అజ్’ అనే క్లాతింగ్ లేబుల్‌ని కూడా నడుపుతోంది. ఫ్యాషన్ యాక్సెసరీస్‌ని తయారుచేస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్గా నిజమైన బ్యూటీ అంటే ఏంటో... చెప్తోంది. తన మాటలతో లక్షల మంది ఆలోచనల్ని మారుస్తున్న దీక్షా కథ ఇది.
వెడల్పాటి డబుల్ చిన్.. సాగిపోతున్న చర్మం.. స్లిట్ డ్రెస్‌లో కనిపిస్తున్న మోకాళ్ల నలుపు.. ముక్కుపై స్ట్రెచ్ మార్క్స్.. ఇవన్నీ నిజంగా నిజం. ఇది తన బాడీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో దీక్షా పెట్టిన ఒక పోస్ట్. ఇలాంటివి షేర్ చేసేటప్పుడు నెగెటివ్ కామెంట్స్‌కి భయపడరా? అని అడిగితే.. ‘ లేదు. నిజానికి అలాంటి కామెంట్లు పెట్టేవాళ్లకే రిప్లయ్‌లు ఇస్తుంటా. ఎందుకంటే నేను ఆ పోస్ట్ పెట్టడానికి కారణమే వాళ్లు. వాళ్లే లేకపోతే అసలు బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా!’ అని చెప్తోంది దీక్షా. తన ‘ఆల్వేస్ ఏ లిటిల్ఎక్స్ట్రా’ పేజీ గురించి కూడా ఇలా చెప్పుకొచ్చింది.
అద్దంలో చూసుకొని ఏడ్చేదాన్ని
చిన్నప్పట్నించీ నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దాంతో నా బాడీ సైజ్‌కి తగ్గట్టే డ్రెస్‌లు వేసుకునేదాన్ని. అది చూసి చాలామంది నన్ను టామ్‌బాయ్ అని పిలిచేవాళ్లు. నవ్వుతూ నేనూ యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ, ఎవరి నోటినుంచైనా పొరపాటున ఫ్యాట్ అన్న పదం వినిపిస్తే తట్టుకోలేకపోయేదాన్ని. అవి చెవిన పడ్డ ప్రతిసారీ అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ఏడ్చేదాన్ని. నేనెందుకు ఇంత లావుగా ఉన్నానని బాధపడేదాన్ని. కంటినిండా నిద్ర కూడా ఉండేది కాదు నాకు. కానీ, బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లాక లావుగా ఉండటం నా బాడీ, పర్సనాలిటీకి సంబంధించిన ఒక ఫ్యాక్టర్ మాత్రమే అని అర్థం చేసుకున్నా. దాన్ని నేను యాక్సెప్ట్ చేశా. హ్యాపీగా ఉండటం మొదలుపెట్టా. కానీ, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన ఉత్తరాఖండ్ ట్రిప్ నన్ను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మార్చేసింది.
వేలల్లో ఫాలోవర్స్
సెలవుల్లో ఫ్రెండ్స్‌తో ఉత్తరాఖండ్ ట్రిప్‌కి వెళ్లా. అక్కడ పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తే.. నన్ను అనుమతించలేదు. కారణం అడిగితే నా105 కేజీల బరువు అని చెప్పారు. అప్పటివరకు బరువు తగ్గడానికి కచ్చితమైన రీజన్ కనిపించలేదు నాకు. కానీ, మొదటిసారి నాకిష్టమైన బంగీ జంపింగ్, పారాసైక్లింగ్, గ్లైడింగ్ కోసం బరువు తగ్గాలనుకున్నా. హెల్దీ డైట్ ఫాలో అయ్యా. జిమ్‌లో జాయిన్ అయ్యా. ఆ ప్రాసెస్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశా. నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. దాదాపు నలభై, యాభై మంది ఆడవాళ్లు సోషల్ మీడియాలో ‘మా సమస్య ఇదేనం’టూ మెసేజ్‌లు పెట్టారు. మిమ్మల్ని చూస్తుంటే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని చెప్పారు. ఆ మాటలు నన్ను మరింత మోటివేట్ చేశాయి. దాంతో రెగ్యులర్‌గా ఫిజికల్, మెంటల్ హెల్త్, ప్లస్ సైజ్ ఫ్యాషన్ గురించి వీడియోలు పెట్టా. పర్ఫెక్ట్ బాడీ గురించి సొసైటీలో ఉన్న అపోహలు, ప్లస్ సైజ్ వాళ్లు చుట్టూ ఉన్న జనాల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మాట్లాడా. వేలల్లో ఫాలోవర్స్ వచ్చారు. ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్‌లు చేసే అవకాశాలు వచ్చాయి. రీసెంట్గా ‘ఎ లిటిల్ లార్జర్’( ఎఎల్ఎల్) కలెక్షన్లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేశా.
ప్లస్ సైజ్ క్లాతింగ్
చిన్నప్పట్నించీ బట్టల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. కాబట్టి నాలాగ మరొకరు ఇబ్బంది పడొద్దనే ‘ఏ లిటిల్ అజ్’ అనే క్లాతింగ్ లేబుల్ స్టార్ట్ చేశా. వరల్డ్ వైడ్‌గా డెలివరీ కూడా చేస్తున్నా. అలాగే ‘ఏ లిటిల్ ఎక్స్ట్రా’ పేరుతో జువెలరీ తయారుచేస్తున్నా. బీడెడ్, టెర్రకోట, ఫ్యాబ్రిక్, ఆక్సిడైజ్డ్ జువెలరీ కూడా అమ్ముతున్నా. పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్ సేల్ చేస్తున్నా అంటోంది దీక్షా.
“నన్ను రకరకాల పేర్లతో పిలిచేవాళ్లు జనాలు. చివరికి ముక్కూమొహం తెలియని వాళ్లు కూడా నా బాడీ గురించి కామెంట్ చేసేవాళ్లు. కొంతమంది రిలేటివ్స్ అయితే.. బరువు తగ్గితేనే నీకు పెండ్లి అవుతుంది అనేవాళ్లు. నువ్వు రోజూ తినకపోయినా బరువు తగ్గవు అని ఏడిపించిన వాళ్లూ ఉన్నారు. కానీ, ఆ మాటలు నన్ను ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా లైఫ్‌లో నాకు నేను ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకున్నా. నా బాడీని నేను ప్రేమించడం వల్లే అది జరిగింది” అంటోంది దీక్షా.