కొత్త వరి వంగడాల కోసం మరిన్ని పరిశోధనలు

కొత్త వరి వంగడాల కోసం మరిన్ని పరిశోధనలు
  • ఐఐఆర్ఆర్, అగ్రికల్చర్​ వర్సిటీ మధ్య అగ్రిమెంట్

హైదరాబాద్, వెలుగు: వరి వంగడాల కోసం మరిన్ని పరిశోధనలు జరపాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. వరి సాగుపై ప్రధానంగా అతివృష్టి, అనావృష్టి  తీవ్ర ప్రభావం చూపుతున్నందున అన్నిరకాల వాతావరణ పరిస్థితులు తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలు రూపొందించాలని ప్రభుత్వం ప్రొఫెసర్​ జయశంకర్​ అగ్రికల్చర్​ వర్సిటీని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్​ వర్సిటీల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్ లోని వర్సిటీ అడ్మిన్​ బిల్డింగ్​లో జరిగిన కార్యక్రమంలో  రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, ఇండియన్​ఇనిస్టిట్యూట్​అఫ్​ రైస్ రిసెర్చ్​(ఐఐఆర్ఆర్​) డైరెక్టర్​ డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం, అగ్రివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సమక్షంలో ఎంఓయూ పేపర్స్​పై సంతకాలు జరిగాయి. 

వరిలో ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుతో పాటు రైతులకు, వినియోగదారులకు ప్రయోజనాలు కలిగించేలా ఈ రెండు సంస్థలు కలిసి కృషి చేయనున్నాయి. వరిలో కార్బన్ క్రెడిట్ ద్వారా రైతులకు మరింత ఆర్థిక  ప్రయోజనం కలిగించే విధానాలపై దృష్టిపెట్టబోతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో మన అవసరాలు పోగా ఏటా 50 లక్షల టన్నుల వరి ధాన్యం అదనంగా ఉత్పత్తి అవుతోంది. ఈ మిగులు ధాన్యాన్ని వివిధ రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న సాంకేతికపరమైన అడ్డంకులను తొలగించేందుకు ఈ రెండు సంస్థలు కృషిచేయనున్నాయి.