- రైలు ప్రయాణం భద్రతకు ఇక భరోసా
- సమాచార మార్పిడితో యాక్సిడెంట్లకు చెక్
- దక్షిణ మధ్య రైల్వేలో 144 లోకోమోటివ్ల్లో ఏర్పాటు
సికింద్రాబాద్, వెలుగు: రైలు ప్రయాణానికి ఇకపై మరింత భద్రత, బరోసా రానుంది. రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే కవచ్రక్షణ 4.0 నూతన వెర్షన్ను అందుబాటులోకి తెచ్చింది.కవచ్ 4.0 కొత్త వెర్షన్ ను కేంద్రం ఈ ఏడాది జూన్16న ప్రవేశపెట్టింది. ఇటీవల కోటా నుంచి సవాయి మధోపూర్మధ్య 108 కిలో మీటర్ల పరిధిలో అమలు చేసి సత్ఫలితాలు సాధించింది. రైల్వే శాఖ కవచ్ 4.0 కు సంబంధించిన 7 రకాల పరీక్షలను నిర్వహించింది. అనంతరం10 వేల లోకోమోటివ్ లో ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
భారతీయ రైల్వే చరిత్రలో కవచ్ 4.0 ఒక ప్రధాన మైలురాయి, అప్ గ్రేడ్ చేసిన వెర్షన్ గా నిలిచింది. ఇది రైళ్ల భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. రాబోయే రోజుల్లో రైళ్ల ప్రధాన రక్షణ వ్యవస్థగా కూడా సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటిదాకా కవచ్ ను 1,465 రూట్ కిలోమీటర్లు, 144 లోకోమోటివ్ లో ఏర్పాటు చేశారు.
ఢిల్లీ నుంచి -ముంబై, ఢిల్లీ నుంచి --హౌరా (సుమారు 3 వేల రూట్ కిలోమీటర్లు) వంటి సుదూర మార్గాల్లోనూ కవచ్ విస్తరణ ప్రారంభమైంది. కవచ్ విస్తరణ రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలోభాగంగా..వచ్చే నాలుగేండ్లల్లో అన్ని లోకోమోటివ్ ల్లో, కొన్ని బ్లాక్ సెక్షన్ ల్లో ఆర్ఎఫ్ఐడీ సదుపాయం ద్వారా ఏర్పాటు చేయనున్నారు. రెండవ దశలో భాగంగా.. రైల్వే స్టేషన్, యార్డులో కవచ్ పరికరాలను అమర్చడం ద్వారా పూర్తిగా మన్నికలోకి రానుంది.
కవచ్ -అభివృద్ధి ఎలా జరిగిందంటే..!
2014--~15లో దక్షిణ మధ్య రైల్వేలో 250 కిలో మీటర్ల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేశారు. 2015~-16లో ప్యాసింజర్ రైళ్లతో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ చేశారు. 2017~-18 కవచ్ స్పెసిఫికేషన్ వెర్షన్ 3.2 ముగించి.. జూలై 2020లో కవచ్జాతీయ ఏటీపీ వ్యవస్థను ప్రకటించారు. మార్చి 2022న కవచ్ అదనంగా 1,200 రూట్ కిలోమీటర్లలో ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది జూలై 16న గతంలో కవచ్ వినియోగం, ఇన్స్టాలేషన్ అనుభవం ఆధారంగా మరింత ఆధునిక సాంకేతికను జోడించి కవచ్ వెర్షన్ 4.0 అందుబాటులోకి తెచ్చారు.
అత్యాధునిక సాంకేతికత
కవచ్ అత్యాధునిక సాంకేతికతతో కూడిన వ్యవస్థ. లోకోలో ఏర్పాటు చేసిన కవచ్ నుంచి స్టేషన్ కవచ్ సమాచారాన్ని అందుకుని , సిగ్నలింగ్ వ్యవస్థ లోకోమోటివ్ కు మార్గ నిర్దేశం చేస్తుంది. అలాగే.. రైలు గమనం దిశను గుర్తించడానికి ట్రాక్ లపై ప్రతి ఒక కిలోమీటరు దూరంలో ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ఏర్పాటు చేస్తారు. ట్రాక్ వెంట ఏర్పాటు చేసిన టవర్లు , ఓఎఫ్ సీ ద్వారా లోకో స్టేషన్ మధ్య సమాచార మార్పిడి జరుగుతుంది. లోకో కవచ్ లో ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లను రీడ్ చేస్తూ బ్రేకింగ్ సిస్టమ్ తో అనుసంధానించిన స్టేషన్ కవచ్ తో కమ్యూనికేట్ చేస్తుంది. డ్రైవర్ తన విధి నిర్వహణలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేకింగ్ ను వర్తింపజేస్తుంది.
ఆన్ బోర్డు పరికరాలు, డ్రైవర్ మిషన్ ఇంటర్ఫేస్ , క్యాబ్లో సిగ్నల్ అంశం, రైలు గమనం, వేగపరిమితి మొదలగు అంశాలు కవచ్ సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడతాయి. లోకో పైలట్ విధి నిర్వహణలో విఫలమైతే బ్రేక్ లు ఆటోమేటిక్ గా పనిచేసి రైలు ప్రమాదానికి గురికాకుండా కాపాడుతుంది. లోకో నుంచి లోకో కు ప్రత్యక్ష సమాచార మార్పిడి ద్వారా ఎదురు ఎదురుగా రైళ్లు ఢీకొనకుండా కాపాడుతుంది. ముందు మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎస్ ఓ ఎస్ సందేశం అందజేస్తుంది.