భవిష్యత్‎లో బీసీలకే ఎక్కువ సీట్లు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

భవిష్యత్‎లో  బీసీలకే ఎక్కువ సీట్లు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: భవిష్యత్‎లో బీసీలకే ఎక్కువ సీట్లు ఇస్తామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్‎లో ఇవాళ (సెప్టెంబర్ 28) మీడియా ప్రతినిధులతో మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే టీపీసీసీ కార్యకర్గ విస్తరణ చేపడతామని.. డీసీసీ బాధ్యతలు  ఎమ్మెల్యేలకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. పీసీసీ కార్యకర్గ విస్తరణపై త్వరలోనే ఏఐసీసీ పెద్దలను కలుస్తామని పేర్కొన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నది వాస్తవమేనని.. కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

ALSO READ | ఏ వ్యక్తికీ అన్యాయం జరగనివ్వం.. మూసీ నిర్వాసితులకు దానకిషోర్ భరోసా

మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం చేయాలన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ బాధితుల కన్నీళ్లు హరీష్ రావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు మేము వెళ్తే  మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయలేదా అని నిలదీశారు. మల్లన్న సాగర్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా న్యాయం చేస్తోందన్నారు. హైడ్రా, మూసీ అభివృద్ధితో సామాన్యులకు కొంత ఇబ్బందైనా.. హైదరాబాద్ మొత్తానికి లాభం జరుగుతుందని స్పష్టం చేశారు.