- వరంగల్ ఎన్నికల కోసం ఎడా పెడా శంకుస్థాపనలు
- పనులు ఎక్కడియక్కడ్నే
- ఇప్పటివరకు పూర్తయిన వర్క్స్ 20 శాతమే
‘వరంగల్‌లో రూ.2,578 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నం. రూ. 660 కోట్లతో కొత్త పనులు చేపడుతున్నాం. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ఆరు నెలల టైం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరుతున్నం. ఆరు నెలల లోపట మళ్లీ వరంగల్‌కు వస్తే.. ఇది వరంగలా అని ఆశ్చర్యపడేలా డెవలప్ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నం’ ... ఏప్రిల్ 12న మంత్రి కేటీఆర్ టూర్ సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పిన మాటలివి.
ఆరు నెలల్లో ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయినా, క్షేత్రస్థాయిలో 80 శాతం వర్క్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి.
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు నోటిఫికేషన్రావడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు మున్సిపల్ మంత్రి కేటీఆర్వరంగల్లో పర్యటించారు. ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 12న ఉదయం నుంచి రాత్రి దాకా సుడిగాలిలా సిటీని చుట్టేశారు. రూ.2,500 కోట్ల విలువైన పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సిటీలో రూ.660 కోట్లతో కొత్తగా చేపట్టబోయే డెవలప్ మెంట్ వర్క్స్ కు శిలాఫలకాలు వేశారు. ఈ పనులను ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. కానీ.. శంకుస్థాపనల్లో కనిపించిన స్పీడ్ పనుల్లో కనిపించలేదు. కొన్ని పనులు టెండర్‌దశలో ఉంటే, మరి కొన్నింటికి అవసరమైన స్థలాల కేటాయింపు కూడా జరగలేదు.
ఎలక్షన్ ముందు హడావుడి
మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన అంతకు ముందు మూడు సార్లు వాయిదా పడింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నాలుగు రోజుల ముందు మాత్రం ఆయన సిటీకి రావడమే కాకుండా క్షణం తీరికలేకుండా తిరిగారు. ఎన్నికల్లో కీలక అంశమైన డైలీ వాటర్ సప్లై స్కీంను ఉగాదికి ముందు రోజే ప్రారంభించేశారు. భద్రకాళి బండ్, సుందరీకరించిన జంక్షన్లు, లక్ష్మీపురంలో పండ్ల మార్కెట్, బట్టల బజార్ ఆర్వోబీ, రైల్వే అండర్ బ్రిడ్జి, పద్మాక్షి టెంపుల్ వద్ద సరిగమ పార్క్, సెంట్రల్ లైటింగ్ సిస్టం లను కూడా ప్రారంభించారు. ఎంతోకాలంగా ఎదురుచూసిన పనులను కేటీఆర్ ప్రారంభించేయడం లోకల్ లీడర్లలో.. క్యాడర్ లో జోష్ నింపింది. దీంతో ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది.
ఆ ఊపు పనుల్లో కనిపించలేదు
ఈ టూర్లో కేటీఆర్ రూ.662కోట్లతో చేపట్టబోయే 30 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు పూర్తయితే గుంతల రోడ్లు, వరద ముంపు, తదితర సమస్యలు తీరుతాయని భావించిన నగర ప్రజల ఆశ నెరవేరలేదు. శంకుస్థాపనలు చేసినవాటిలో ఇంకా చాలా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వరంగల్ తూర్పులో జర్నలిస్ట్ కాలనీ, సీబీసీ చర్చి డెవలప్మెంట్, సమ్మయ్యనగర్ వద్ద నాలా ప్రొటెక్షన్ వాల్, భద్రకాళి బండ్ వర్క్స్తప్ప మరేవీ టెండర్ దశ దాటలేదు. కేవలం రూ.125.18 కోట్ల విలువైన పనుల్లో పురోగతి ఉండగా, మిగిలిన రూ.535 కోట్ల పనులు స్టార్ట్ కాలేదు.
రాంపూర్ డంపింగ్ యార్డులో బయో మైనింగ్, సమ్మయ్య నగర్లో వరద కాల్వ, నయీంనగర్ నాలాపై హైలెవల్ బ్రిడ్జి, శివనగర్ నుంచి మైసయ్య నగర్ వరకు స్ట్రోమ్ వాటర్ డక్ట్, ఆర్ ఎస్ నగర్ నుంచి 12 మోరీ వరకు వరద కాల్వ, దసరా రోడ్డు జంక్షన్ నుంచి ఉర్సు గుట్ట, కరీమాబాద్ ఫ్లై ఓవర్ నుంచి గవిచర్ల క్రాస్ , వరంగల్ ఫోర్ట్ జంక్షన్ నుంచి నాయుడు బంక్, లేబర్ కాలనీ నుంచి సీకేఎం కాలేజ్ రోడ్ల పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. కొన్నిపనులకు సంబంధించి ల్యాండ్ ఇష్యూస్ కూడా క్లియర్ కాలేదు. రంగశాయిపేటతో పాటు ఐబీ గెస్ట్ హౌజ్ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు ఇంకా స్థలం కేటాయించలేదు. మార్కెట్ల నిర్మాణం మొదలు కావాలంటే ఇంకా చాలా టైమ్ పట్టేలాఉంది. మంత్రి కోరిన గడువులో ఇంకా మిగిలిన రెండు నెలల్లోనైనా ఈ వర్క్స్ స్టార్ట్ అవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకొన్ని హామీల్లోనే..
మంత్రి కేటీఆర్ టూర్లో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్ పశ్చిమలో కూడా ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని ఊసేలేదు. వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని 30 ఎకరాల గ్రౌండ్ ను వాకర్స్ కోసం కొనుగోలు చేసి ఇస్తామని, ఇందుకు రూ.7 కోట్లయినా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ ఎయిర్ పోర్టు, మెట్రోనియో ప్రాజెక్టు త్వరలోనే వస్తాయని చెప్పారు. కానీ ఇంతవరకు వాటి ఊసే లేదు. ఇకనైనా పనులు స్పీడప్ చేసి.. ఇచ్చిన మాట ప్రకారం నగర అభివృద్ధికి కృషి చేయాలని గ్రేటర్ ప్రజలు కోరుతున్నారు.