ప్రాణాల మీదికి తెస్తున్న పతంగుల మాంజా .. వారం రోజుల్లోనే 10 మందికి పైగా గాయాలు

ప్రాణాల మీదికి తెస్తున్న పతంగుల మాంజా .. వారం రోజుల్లోనే 10 మందికి పైగా గాయాలు
  • మాంజాలపై నిషేధం ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న వ్యాపారులు
  • ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నా కనిపించని ఫలితం
  • సంక్రాంతి టైంలో బైక్‌‌పై రోడ్డెక్కాలంటే భయపడుతున్న ప్రజలు

ఖమ్మం, వెలుగు : సంక్రాంతి టైంలో కొందరు యువకులు, పిల్లలు సరదాగా ఎగురవేసే పతంగులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పతంగులు ఎగురవేయడానికి కొందరు వ్యక్తులు సాధారణ దారాలు కాకుండా గట్టిగా ఉండే మాంజాలు వాడుతున్నారు. ఈ మాంజాల కారణంగా బైక్‌‌పై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాంజా దారం తగిలి వారం రోజుల్లోనే 10 మంది వరకు గాయపడ్డారు. ఇందులో ఒకరిద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ప్లాస్టిక్‌‌ పొడి, గాజుతో తయారీ

నైలాన్‌‌, సింథటిక్‌‌ దారానికి గాజు, ప్లాస్టిక్‌‌ పొడి పూసి మాంజాను తయారు చేస్తారు. మామూలు కాటన్‌‌ దారంతో పోలిస్తే ఈ మాంజా దారం గట్టిగా ఉంటుంది. దీని వల్ల పతంగులు ఎగురవేసే టైంలో ఇతరుల కైట్స్‌‌ దారాలను తెంపడం ఈజీ అవుతుంది. దీంతో పతంగులు ఎగురవేసేందుకు మాంజాను వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే పతంగి తెగిన తర్వాత దానికి ఉన్న మాంజా గాలిలో తేలుతూ బైక్‌‌పై వెళ్లే వారికి గొంతుకు చుట్టుకుంటోంది. దీని కారణంగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడుతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. గతేడాది సంక్రాంతి రోజున హైదరాబాద్‌‌లోని లంగర్‌‌హౌజ్‌‌ వద్ద ఆర్మీ జవాన్‌‌ కోటేశ్వరరావు మెడకు మాంజా తగలడంతో అతడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. 

బ్యాన్‌‌ ఉన్నా ఆగని అమ్మకాలు

మాంజా కారణంగా పెద్ద సంఖ్యలో పక్షులు, మనుషులు చనిపోతుండడంతో రాష్ట్రంలో వీటి అమ్మకంపై గతంలో నిషేధం విధించారు. కొన్నేండ్ల కిందటి వరకు మాంజాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్మేవారు. ఇటీవల వీటిని లోకల్‌‌గానే తయారు చేస్తున్నారు. మాంజాలను అమ్మొద్దని నిషేధం ఉన్నా అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. మాంజాలు అమ్మడం లేదని పతంగుల హోల్‌‌సేల్‌‌ షాపు నిర్వాహకులు ఓ వైపు బోర్డులు పెడుతూ.. మరో వైపు సీక్రెట్‌‌గా అమ్మకాలు సాగిస్తున్నారు. మాంజాలు వాడొద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నా, ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు టాస్క్‌‌ఫోర్స్‌‌ టీమ్‌‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.

వారం రోజుల్లో పది మందికి పైగా గాయాలు

  • రంగారెడ్డి జిల్లాలో గురువారం బైక్‌‌పై వెళ్తున్న భార్యాభర్తలకు మాంజా దారం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. 
  • షాద్‌‌నగర్‌‌కు చెందిన రంగనాథ్, తన భార్యతో కలిసి ముచ్చింతల్‌‌ వైపు నుంచి వస్తుండగా పతంగి మాంజా కారణంగా రంగనాథ్​ గొంతు కోసుకుపోయింది. దాన్ని తొలగించే క్రమంలో రంగనాథ్‌‌ భార్య చేతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 
  • రెండు రోజుల కింద చంద్రుగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఏరువ కృష్ణారావు బైక్‌‌పై కొత్తగూడెం వైపు వెళ్తున్నాడు. ఈ టైంలో మాంజా గొంతుకు తగలడంతో వాయునాళం 75 శాతం తెలిగిపోయింది. ఎడమ చేతితో మాంజా దారాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా చేతి వేళ్లకు సైతం గాయాలు అయ్యాయి.
  • జనగామ పట్టణంలోని సిద్దిపేట రోడ్డులో సైతం ఇటీవల మాంజా తగిలి నలుగురికి గాయాలు అయ్యాయి. ఇందులో ఓ పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
  • బచ్చన్నపేటకు చెందిన సనత్‌‌కుమార్‌‌ మరో ఇద్దరు ఫ్రెండ్స్‌‌తో కలిసి బైక్‌‌పై వెళ్తుండగా మాంజా తగిలి సనత్‌‌కుమార్‌‌ గొంతుకు గాయమైంది. ఈ టైంలో బైక్‌‌ అదుపుతప్పి కిందపడడంతో మిగతా ఇద్దరు కూడా గాయపడ్డారు. 
  • జనగామ జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు వీక్షిత్‌‌ తల్లిదండ్రులతో కలిసి బైక్‌‌పై వెళ్తుండగా గొంతు భాగంలో మాంజా తగిలింది.

చైనా మాంజా అమ్ముతున్న 22 మంది అరెస్ట్

హైదారాబాద్ సిటీ, వెలుగు : నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళ్​హాట్​పరిధిలో నాన్ బయో డీగ్రేడబుల్, సింథటిక్ తో తయారు చేసిన నిషేధిత చైనీస్ మాంజాను విక్రయిస్తున్నట్లు ఇటీవల పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో 2024 నవంబరు 10 నుంచి మాంజా, పతంగులు అమ్మే షాపుల్లో తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 22 మందిని అరెస్ట్​చేశారు. 18 కేసులు నమోదు చేసి, 1094 బాబిన్లను సీజ్ చేశామని  పోలీసులు పేర్కొన్నారు.  

సంక్రాంతి టైంలో జాగ్రత్తగా ఉండాలి 

కొత్తగూడెంలో మాంజా కారణంగా గొంతు తెగిన కృష్ణారావుకు ఆపరేషన్‌‌ చేసేందుకు గంటకు పైగా టైం పట్టింది. అతడి వాయునాళం 75 శాతం కట్‌‌ అయింది. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళం కట్‌‌ అయితే ప్రాణాలే పోయేవి. ఘటన జరిగిన తర్వాత హాస్పిటల్‌‌కు వచ్చే సరికే రెండు లీటర్ల వరకు రక్తం పోయింది. సంక్రాంతి టైంలో బైక్‌‌పై తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలి.– డాక్టర్‌‌ మేడ రాజశేఖర్, ఖమ్మం

తనిఖీలు చేయిస్తున్నాం 

మాంజాలు వాడొద్దని అవగాహన కల్పించేలా పోస్టర్లు, సోషల్‌‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. హోల్‌‌సేల్‌‌ షాపులను సైతం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ముగ్గురు బీట్‌‌ ఆఫీసర్లు, ఒక సెక్షన్‌‌ ఆఫీసర్‌‌, డిప్యూటీ రేంజర్, రేంజర్‌‌తో కలిపి రెండు టీమ్‌‌లను ఏర్పాటు చేశాం. ఎవరైనా మాంజాలు అమ్మినట్లు తేలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

సిద్దార్థ్‌‌ విక్రమ్‌‌ సింగ్‌‌, ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్‌‌