నిరసనకారులు, భద్రతా దళాల మధ్య గొడవ.. వెయ్యి మందికిపైగా మృతి

నిరసనకారులు, భద్రతా దళాల మధ్య గొడవ.. వెయ్యి మందికిపైగా మృతి

డెమాస్కస్: సిరియాలో హింస చెలరేగింది. మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ మద్దతుదారులు, సిరియా దళాలకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రెండ్రోజులపాటు జరిగిన ఈ ఘర్షణల్లో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 745 మంది సిటిజన్లు, 125 మంది సిరియన్ దళాలు, 148 మంది అసద్ వర్గీయులు మరణించినట్లు బ్రిటన్‌‌‌‌కు చెందిన సిరియన్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది. పద్నాలుగేండ్ల కింద జరిగిన సిరియా అంతర్యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద మారణహోమం అని పేర్కొంది.

ప్రతీకారంతోనే దాడులు.. 

3 నెలల కింద తిరుబాటుదారులు సిరియాను ఆక్రమించిన తర్వాత అప్పటి ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. అనంతరం రెబల్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న అసద్ మద్దతుదారులు గురువారం జబ్లే నగరంలో అధికార దళాలపై దాడులు చేసి, వంద మందికిపైగా సిరియన్ సైనికులను చంపేశారు. 

దీంతో అసద్ సపోర్టర్లు ఎక్కువగా నివాసముండే బనియస్ టౌన్‎తో సహా ఇంకొన్ని ప్రాంతాల్లోకి సిరియన్ సైన్యం ప్రవేశించి పెద్ద ఎత్తున కాల్పులకు దిగింది. అసద్ మద్దతుదారుల ఇండ్లలోకి చొరబడి అనేకమందిని మట్టుబెట్టింది. ప్రభుత్వం ఆ ప్రాంతాలకు తాగునీరు, కరెంట్ సదుపాయాలు నిలిపివేసింది. వీధుల్లో, ఇండ్లలో ఎక్కడికక్కడ మృతదేహాలు పడి ఉన్నాయని, వాటిని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరూ సాహసం చేయట్లేదని హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది.