Google Employees :సుందర్ పిచాయ్ కు గూగుల్ ఉద్యోగుల లేఖ

Google Employees :సుందర్ పిచాయ్ కు గూగుల్ ఉద్యోగుల లేఖ

Google Employees : ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగుల తొలగింపు తారాస్థాయికి చేరింది. ప్రపంచంపై ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముకుంటున్నాయి. ఈ ప్రభావం ఐటీ, టెక్ రంగాలపై అధికంగా ఉంది. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందోననే ఒత్తిడిలో ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారు. మాంద్యం భయాలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు గత ఆరు నెలల్లోనే వేలాది మందిని తొలగించాయి. కొత్త ఏడాదిలోనే దాదాపు లక్ష మందికిపైగా ఐటీ, టెక్ కంపెనీల ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. 

గూగుల్ మాతృసంస్థ అల్భాబెట్‌లో పనిచేసే 1400 మందికిపైగా ఉద్యోగులు ఏకమై.. సీఈఓ సుందర్ పిచాయ్ కు లేఖ రాశారు. లేఆఫ్స్ ప్రక్రియ సమయంలో కాస్త పరిణతితో వ్యవహరించాలని, ఉద్యోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఒక పిటిషన్‌పై సంతకాలు చేశారు. ఇంకా పలు డిమాండ్లను సీఈఓ సుందర్ పిచాయ్ ముందు ఉంచారు. ఇటీవల గూగుల్ సుమారు 12 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడానికే ఇలా చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే.. లేఆఫ్స్ ప్రక్రియ సమయంలో ఉద్యోగుల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించింది అంటూ చాలా మంది ఉద్యోగులు.. సోషల్ మీడియాల్లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గూగుల్  సంస్థ ఉద్యోగులు సుందర్ పిచాయ్ కు ఓపెన్ లెటర్ రాశారు.

ఉద్యోగుల డిమాండ్లు ఇవే..

* కొత్త నియామకాలను స్తంభింపజేయాలని డిమాండ్ 
* కొత్త ఉద్యోగాలకు సంబంధించి లేఆఫ్స్ చేసిన ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించడం సహా పేరెంటల్, బిరేవ్‌మెంట్ లీవ్స్‌కు సంబంధించి చెల్లింపులు పూర్తి చేయాలని డిమాండ్
*  మానవతా సంక్షోభం నెలకొన్న ఉక్రెయిన్‌ వంటి ప్రాంతాల్లో ఉద్యోగులను తొలగించవద్దని డిమాండ్. ఆ దేశాల్లో వారికి ఉద్యోగం పోతే వీసా లింక్డ్ రెసిడెన్సీ పోతుందని గుర్తుచేశారు. 

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ లేఆఫ్స్ ఉన్నాయని తెలుసని, తమ స్వరాలను అణిచేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే తామంతా బలంగా కలిసే ఉన్నామని చెప్పారు. గూగుల్ జనవరి నెలలో ఉద్యోగులకు సంబంధించి లేఆఫ్స్ ప్రకటించింది. అప్పటి నుంచి పలు దేశాల్లో దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికాలో ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోయినప్పటికీ.. బలమైన కార్మిక రక్షణ చట్టాలు ఉండే యూరప్ దేశాల్లో ఈ లేఆఫ్స్ కాస్త తక్కువగా ఉండటం గమనార్హం. ఇక గూగుల్ ఉద్యోగులు.. ఇటీవల చాలా మంది తమను తొలగించిన తీరుపై లింక్డ్‌ఇన్‌లో పోస్టులు చేశారు.

ఒక ఉద్యోగి తన తల్లి చనిపోగా.. ఆ కార్యక్రమాలకు వెళ్లి ఆఫీసుకు తిరిగొచ్చిన 3 రోజుల్లోనే తొలగించిందని ఆవేదనం వ్యక్తం చేశాడు. కుటుంబం కంటే ఎక్కువగా కంపెనీని ప్రేమించానని, అయినా తనకు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో మహిళా ఉద్యోగి.. వెకేషన్‌లో ఉండగా సడెన్‌గా ఒక మెసేజ్‌తో తనను తీసేసినట్లు చెప్పిందని బాధపడింది. మరో ఉద్యోగి.. ఆరేళ్లుగా ఆఫీసులో తన భర్తను కలుసుకోకుండా పనిచేసినప్పటికీ గూగుల్ తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొకరు అర్ధరాత్రి 2 గంటలకు లేఆఫ్ ఇచ్చిందని చెప్పడం.. ఇలా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు గూగుల్ ఉద్యోగులు.. లేఆఫ్స్ సమయాల్లో ఉద్యోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సుందర్ పిచాయ్‌కు బహిరంగ లేఖ (Open Letter) రాయడం చర్చనీయాంశంగా మారింది.