- భైంసా ఏఎంసీ చైర్మన్తో పాటు 1500 మందికి పైగా చేరిక
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం నుంచి సుమారు 1500 మందికి పైగా కమలం గూటికి చేరారు. హైదరాబాద్లో పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కండువాలు కప్పుకున్నారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి మళ్లీ టికెట్ఇవ్వొద్దని అసమ్మతి వర్గం కొంతకాలం అధిష్టానాన్ని డిమాండ్ చేసింది. మంత్రి కేటీఆర్, ముఖ్య నేతలకు ఫిర్యాదు చేసినా ఆయనకే టికెట్ కేటాయించడంతో వీరంతా ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్కు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, సీనియర్ లీడర్లు రమేశ్, విశ్వనాథ్ పటేల్, పండిత్ రావు పటేల్, రాజేశ్వర్, భీంరావుతో పాటు 1500 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, ముథోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. నియోజవర్గంలో కాషాయ జెండా ఎగురేసి తీరుతామని వీరంగా వెల్లడించారు. ఈ పరిణామాలతో ఇక్కడి బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది.