- గాజాలో 20 వేలు దాటిన మృతులు
- భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలు
- జనాభాలో 1% మంది దుర్మరణం
- మరో 53,320 మందికి గాయాలు
- నిరాశ్రయులైన వేలాది మంది
గాజా: హమాస్ మిలిటెంట్లను రూపుమాపడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇటీవల గ్రౌండ్ అటాక్స్ను తీవ్రం చేసిం ది. అయితే ఈ దాడుల్లో వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 20,057 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ శుక్రవారం వెల్లడించింది. ఈ సంఖ్య యుద్ధానికి ముందు గాజాలో ఉన్న జనాభాలో దాదాపు ఒక్క శాతమని ఆవేదన వ్యక్తం చేసింది. మృతుల్లో రెండింట మూడొంతులు మహిళలు, మైనర్లేనని తెలిపింది. దాడుల్లో మరో 53,320 మంది గాయపడ్డారని చెప్పింది. కాగా, గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. పలు సిటీల్లో భీకర దాడులు చేస్తోంది. ఇండ్లు వదిలి వెళ్లిపోవాలని స్థానికులకు ఆదేశాలు ఇస్తోంది. దీంతో వేలాది మంది కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్తున్నారు. యుద్ధం కారణంగా దాదాపు 85% మంది నిరాశ్రయులయ్యారని, 5 లక్షల మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.
యూఎన్లో ఓటింగ్ వాయిదా..
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం ఓటింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. వెంటనే కాల్పుల విరమణ జరగాలని, బందీలను విడుదల చేయాలని, గాజాలోకి మానవతా సాయాన్ని అనుమతించాలని, ఈ కార్యక్రమాల పర్యవేక్షణను యూఎన్కు అప్పగించాలని వారం కిందట యూఏఈ తీర్మానం ప్రవేశపెట్టింది. దీన్ని వీటో అధికారంతో అమెరికా అడ్డుకుంది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలంటూ పేర్కొనడాన్ని వ్యతిరేకించింది. దీంతో తీర్మానంలో మార్పులు చేశారు. కాల్పుల విరమణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.