
- 5 నిమిషాల్లో లోన్, తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ మోసం
- యాదాద్రి జిల్లాలో ఈ ఏడాది 25కు పైగా కేసులు
- ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు
యాదాద్రి, వెలుగు : సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. 5 నిమిషాల్లో లోన్, తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ మెసేజ్‌లు, లింక్‌లు పంపుతున్నారు. దరఖాస్తు చేయకున్నా లోన్ శాంక్షన్ అయిందని ఇంకొన్ని మెసేజ్‌లు వస్తున్నాయి. వాటికి ఆకర్షితులై, సమాధానం ఇచ్చినా.. లింక్‌లను క్లిక్ చేసినా.. బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేస్తున్నారు.
తక్కువ రేటుకే ఆవులు ఇస్తామని..
యాదాద్రి జిల్లాలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతుకు తక్కువ రేటుకే ఆవులు ఇస్తామని వాట్సాప్‌లో మెసేజ్‌తోపాటు ఫొటోలు వచ్చాయి. పంపిన ఫొటోల్లోని మూడు ఆవులను సెలెక్ట్ చేసుకోవాలని, రూ.1.05 లక్షలు పంపించాలని సూచించారు. దీంతో, ఆవులను సెలెక్ట్ చేసుకొన్న సదరు రైతు రూ.85,300 ఫోన్ పే ద్వారా పంపించాడు. మిగిలిన సొమ్ము ఇస్తేనే జీవాలను సరఫరా చేస్తామని అవతలి వ్యక్తి చెప్పడంతో మోసపోయామని గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నాయి.
లోన్ శాంక్షన్ అయిందని..
ఇటీవల సైబర్ నేరగాళ్లు.. లోన్ శాంక్షన్ అయిందని చెబుతూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఎలాంటి గ్యారెంటీలు, పేపర్లు అవసరం లేదంటూ లింక్‌లు కూడా పెడుతున్నారు. రూ.లక్షల్లో లోన్ ఇస్తామని, ఐదు స్టెప్పుల్లోనే అకౌంట్లలో డబ్బు వేస్తామంటూ ఇంకొందరు లింక్‌లు పంపిస్తున్నారు. అప్పు ఇస్తామంటూ వాయిస్ కాల్స్ చేస్తున్నారు. ఆ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందిస్తే అకౌంట్ నంబర్లు, ఓటీపీలు కావాలంటారు. పంపించాక బ్యాంక్అకౌంట్లలోని డబ్బులు ఖాళీ చేస్తున్నారు.
జాబ్ ఇస్తామని..
జాబ్ ఇస్తామని.. అది కూడా ఇంట్లో కూర్చొని, చేయొచ్చంటూ వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. రోజుకు రూ.1,500 నుంచి రూ.8 వేల వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. డబ్బులు సంపాదిస్తున్న కొందరి పేమెంట్ వివరాలకు సంబంధించిన స్క్రీన్ షాట్ పంపిస్తున్నారు. ఇలాంటి మెసేజ్చూసిన భువనగిరి మండలం బండ సోమారం గ్రామానికి చెందిన వ్యక్తి క్లిక్ చేయడంతో అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.40 వేలు కాజేశారు.
సెర్చ్ చేసిన వారిని..
తమ అవసరాల కోసం కొందరు వ్యక్తులు ఆన్లైన్లో అప్పు కోసం యాప్స్‌ను వెతుకుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు వారిని సులభంగా ఉచ్చులోకి దింపుతున్నారు. అవతలి వ్యక్తుల మాటలు నమ్మి, అడగ్గానే కొంతమంది తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు చెప్పేస్తున్నారు. తర్వాత అకౌంట్లోని డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు. కొందరు లోన్ కోసం సెర్చ్ చేసిన వారికి ఇవ్వకుండానే.. ఇచ్చినట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఇటీవల ఓ వ్యక్తి లోన్ కోసం ట్రై చేసి, వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడికి లోన్ ఇవ్వకపోగా.. అకౌంట్లోని డబ్బును ఖాళీ చేశారు. పైగా తాము రూ. 50 వేలు లోన్ ఇచ్చామంటూ చెల్లించడానికి ఈఎంఐ తేదీలతో వాట్సాప్ మెసేజ్‌లు పంపించడంతోపాటు కాల్స్ కూడా చేశారు. లోన్ కట్టకుంటే నీ న్యూడ్ ఫొటోలు అందరికీ షేర్ చేస్తామంటూ.. కొన్ని ఫొటోలను పంపించారు. వాటిని చూసి, బెదిరిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి, తన గోడు వెల్లబోసుకున్నాడు. మరో వ్యక్తి తన ఫ్రెండ్‌కు ఫోన్ పే ద్వారా పంపించిన అమౌంట్ చేరకపోవడంతో ఫేక్ కస్టమర్ కేర్‌ను ఆశ్రయించి, రూ.40 వేలు పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెరుగుతున్న కేసులు..
గతంతో పోలిస్తే యాదాద్రి జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. 2021లో జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 2022 నుంచి 2024 వరకు 197 కేసులు నమోదవగా, రూ.1.40 కోట్లకు పైగా బాధితులు కోల్పోయారు. అయితే, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బు కోల్పోయినా.. పరువు పోతుందనే ఉద్దేశంతో కొందరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదు. మరికొందరేమో తమ పేర్లు బయటకు వెల్లడించవద్దని పోలీసులను కోరుతున్నారు. సైబర్ మోసాలపై పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నా పెద్దగా ఫలితం లేదు. అకౌంట్ నుంచి డబ్బులు కోల్పోయిన వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని బాధితులకు పోలీసులు సూచిస్తున్నారు.