జగిత్యాల, వెలుగు: ‘ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇస్తున్నం.. ఫ్లోరైడ్రక్కసిని రాష్ట్రం నుంచి తరిమికొట్టినం..’ అని సర్కార్ చెబుతున్నా పలు గ్రామాల్లో బాధితులు కనపడుతూనే ఉన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో ఫ్లోరోసిస్ తో పలువురు జనాలు కాళ్లు వంకర్లు పోయి నడవలేని స్థితిలో, ఎదగని శరీరాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఈ గ్రామానికి తలాపున గోదావరి పారుతున్నా ఫ్లోరైడ్ నీళ్లే దిక్కవుతున్నాయి. శరీరాలు ఎదగక.. కాళ్లు చేతుల్లో సత్తువ లేకుండా గ్రామస్తులు దినదిన గండంగా జీవిస్తున్నారు. పదేళ్లకు పైగా ఫ్లోరైడ్ సమస్యతో గ్రామస్తులు రోగాల పాలవుతున్నా సర్కార్ కన్నెత్తి చూడటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ ఏర్పాటు చేశామని చెబుతున్నా ఆ నీరు తూ తూ మంత్రంగా సరఫరా చేయడంతో బోరు నీళ్లే తాగుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
25 మందికి పైగా ఫ్లోరోసిస్ బాధితులు
గ్రామంలో సుమారు వెయ్యి జనాభా ఉంది. వీరిలో 25 మందికి పైగా యువతీ యువకులు, వృద్ధులు కాళ్లు, చేతులు వంకర్లు పోవడం.. ఎముకలు అరిగిపోయి భారంగా బతుకీడుస్తున్నారు. వీళ్లతోపాటు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. లీడర్లకు, ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని జనాలు ఆరోపిస్తున్నారు. ఫ్లోరోసిస్ తో పోరాడుతున్న గ్రామస్తులకు సాయంగా జగిత్యాలకు చెందిన ప్రముఖ డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి నాలుగేళ్ల క్రితం వాటర్ ప్లాంట్ఏర్పాటు చేశారు. అయితే దీని నిర్వహణ సరిగా లేకపోవడంతో మూలకు పడింది. మిషన్ భగీరథ పైప్ లైన్ పూర్తి చేసినా ఏదో ఒక సమస్య తో నీరు సరఫరా చేయకపోవడంతో బోరునీళ్లపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు.
డేంజర్ జోన్ లో ఆరు గ్రామాలు
నీటిలో పీపీఎం(పార్ట్స్పర్మిలియన్) శాతం సుమారు 1.0 లోపు ఉంటే తాగేందుకు వాడుకోవచ్చు. కానీ ఇక్కడ పీపీఎం శాతం 2.5కి పైగా ఉండడంతో జనాలు ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారని డాక్టర్లు చెప్తున్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం గుంజపడుగుతో పాటు మల్లాపూర్ మండలంలోని సాతారం, గుండంపల్లి, ఇంద్రనగర్ (కూస్తాపూర్), మల్యాల మండలం ఓబులాపూర్, ధర్మపురి మండలం బుద్దేశ్ పల్లి గ్రామాల్లో పీపీఎం శాతం 2.0 కు పైగా నమోదవుతోంది. చిన్నారులతో పాటు యువత ఫ్లోరోసిస్ బారిన పడుతుండడంతో జనాలు ఆవేదన చెందుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లను సరఫరా అయ్యేలా చూసి, హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే బాధితులను సర్కార్ ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
కండ్లు కనిపిస్తలేవ్
15 ఏండ్లుగా ఫ్లోరైడ్ నీళ్లు తాగి రోగాల పాలైతున్నం. నాకు కండ్లు కనిపించకుండా పోయినయ్. దవాఖానల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపాయే. డాక్టర్లు మందులు వాడాలని చెబుతున్నరు. నెలకు రూ. 3 వేలకు పైగా ఖర్చు అయితంది. ఆర్థికంగా కుంగిపోతున్నం. సర్కార్ ఆదుకోవాలె.
- వస్తం రోజా, గుంజపడుగు
త్వరలో భగీరథ నీళ్లు అందిస్తం
గుంజపడుగు గ్రామానికి వెళ్లే మిషన్ భగీరథ పైప్ లైన్ రోడ్డు వెడల్పు పనుల్లో డ్యామేజ్ కావడంతో నీటి సరఫరా ఆగిపోయింది. త్వరలో నీటి సరఫరాను స్టార్ట్ చేస్తాం. పీపీఎం శాతం 1.5 కంటే ఎక్కువగా నమోదైతే తాగేందుకు పనికి రావు. మిషన్ భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. - శేఖర్, మిషన్ భగీరథ, ఈఈ, జగిత్యాల
కాళ్లు వంకర్లు పోయినయ్
30 ఏండ్లకు పైగా కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించా. పదేండ్ల క్రితం ఫ్లోరోసిస్రావడంతో కాళ్లు వంకర్లు పోయినయ్. ఎలాంటి పని చేసుకోలేకపోతున్న. రోజు రోజుకు సమస్య తీవ్రమవుతోంది.
- లింగమూర్తి, గుంజపడుగు
ఏ పనీ చేయలేకపోతున్నం
అప్పట్ల కూలి పని చేసుకుని బతికేటోళ్లం. ఏమైందో ఏమో ఇరవై ఏండ్ల సంది కాళ్లు వంకర్లు పోతున్నయ్. కండ్లు, చేతులు పని చేస్తలేవు. ఏ దవాఖానకు పోయినా నీళ్లు మంచిగ లేక రోగాలు వస్తున్నయని చెబుతున్నరు. ఇప్పటికే రూ. 4 లక్షలు ఖర్చు చేసినం. ఏం చేయలేని పరిస్థితిల ఉన్నం. మా అక్కకు కూడా కాళ్లు, చేతులు పని చేస్తలేవు. ఇద్దరికీ మా అవ్వ, బాపే సేవలు చేస్తున్రు. ఊళ్ల ఉన్న నీళ్ల ప్లాంట్ కూడా పని చేస్తలేదు. సర్కార్ తాగునీళ్లు అందించి మమ్మల్ని ఆదుకోవాలె.
- కనకవ్వ, గుంజపడుగు