
- 2025లో ఇప్పటికే 259 స్టార్టప్‌లకు మూత
- సరైన నిర్ణయాలు లేకే కష్టాలు
న్యూఢిల్లీ: మనదేశంలో మెజారిటీ స్టార్టప్‌లు సక్సెస్ రుచి చూడలేకపోతున్నాయి. గత రెండేళ్లలో దాదాపు 28వేల స్టార్టప్‌లు మూతబడ్డాయి. 2023 సంవత్సరంలో 15,921 స్టార్టప్‌లు, గత ఏడాది 12,717 స్టార్టప్‌లు మూతపడ్డాయి. 2019, 2020 సంవత్సరాల్లో మూతపడిన వాటితో (2,300) పోలిస్తే, గత రెండేళ్లలో 12 రెట్లు పెరుగుదల ఉంది. మూతపడిన స్టార్టప్‌లలో చాలా వరకు దివాళా తీసినవే ఉన్నాయి. మరికొన్ని సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహించడమే లేదు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా పేరున్న ఇండియాలో వేల స్టార్టప్‌లు కార్యకలాపాలను ఆపేశాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రాక్సన్ రిపోర్ట్ వెల్లడించింది.
దీని ప్రకారం... సరైన బిజినెస్ఐడియాలు లేకపోవడం వల్లే స్టార్టప్‌లకు ఈ దుస్థితి దాపురించింది. చాలా మంది పెట్టుబడిదారులు, ఫౌండర్లు ఆలోచన/ప్రతిపాదన నచ్చి పెట్టుబడులు పెట్టారు. అయితే, ఆ ఆలోచన విజయవంతమవుతుందో లేదో అంచనా వేయలేకపోవడంతో స్టార్టప్‌లు విఫలమవుతున్నాయి. మరికొన్ని స్టార్టప్‌లు కార్యకలాపాలను మొదలుపెట్టకముందే భారీ మొత్తంలో పెట్టుబడులు తెచ్చుకున్నాయి. మార్కెట్‌లో తగినంత ఆదరణ లభించకపోవడంతో అవి కూడా మూతపడాల్సి వచ్చింది. కొత్తగా ప్రారంభమయ్యే స్టార్టప్‌ల సంఖ్య కూడా తగ్గింది. 2019– 2022 మధ్య సగటున సంవత్సరానికి 9,600 కొత్త వెంచర్లు ప్రారంభమయ్యాయి. 2024లో కేవలం 5,264 మాత్రమే మొదలయ్యాయి.
మూసివేతలు ఈ రంగాలలో ఎక్కువ...
గత రెండేళ్లలో ఎక్కువగా మూతపడిన వాటిలో అగ్రిటెక్, ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, హెల్త్‌టెక్ రంగాలలోని స్టార్టప్‌లు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార ఆలోచన ఆచరణాత్మకమైనదని గుర్తించకముందే భారీగా పెట్టుబడులు పొందడం, నిర్వహణ ఖర్చులు అదుపు తప్పటంతో చాలా స్టార్టప్‌లు విఫలమయ్యాయి. దీర్ఘకాలిక దృష్టి లేకపోవడం కూడా నష్టదాయకంగా మారింది. 2025లో ఇప్పటివరకు 259 స్టార్టప్‌లు మూతబడ్డాయి. ఈ సంఖ్య సంవత్సరాంతానికి బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల చాలా మంది పెట్టుబడిదారులు కొత్త వ్యాపారాల విషయంలో ముందుకువెళ్లడం లేదు. పెట్టుబడి మార్గాలు మూసుకుపోవడం కూడా స్టార్టప్‌లు అకాలంగా మూతపడటానికి దారితీస్తోంది. స్టార్టప్‌లను ఇతర సంస్థలు కొనుగోలు చేయడం (స్టార్టప్ అక్విజిషన్స్) కూడా గణనీయంగా తగ్గింది. 2021లో 248 కొనుగోళ్లు జరిగాయి. గత సంవత్సరం కేవలం 131 అక్విజిషన్లు ఉన్నాయి.
ఏఐ స్టార్టప్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం
2024లో ఏఐ ఆధారిత స్టార్టప్‌లకు 30 పెట్టుబడి రౌండ్‌లలో 171.4 మిలియన్ డాలర్లు వచ్చాయి. 2025 జనవరి-–మార్చిలో కేవలం రెండు రౌండ్‌లలోనే 12.5 మిలియన్ డాలర్లు వచ్చాయి. అయితే, ఈ రంగంలో చైనా, యూఎస్ స్టార్టప్‌ల పనితీరుతో పోలిస్తే భారతదేశం చాలా వెనుకబడి ఉంది. యూఎస్ స్టార్టప్‌లు 34 బిలియన్ డాలర్లు, చైనా కంపెనీలు 3.3 బిలియన్ డాలర్లు పొందగా, భారతీయ కంపెనీలకు వచ్చిన పెట్టుబడి 171.4 మిలియన్ డాలర్లు దాటలేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చైనా స్టార్టప్‌లు 220 మిలియన్ డాలర్లు, యూఎస్ కంపెనీలు 6.2 బిలియన్ డాలర్ల నిధులను దక్కించుకున్నాయి.