ధరణి స్పెషల్ ​డ్రైవ్​ స్పీడప్ .. అప్లికేషన్ల క్లియరెన్స్​లో ఆఫీసర్లు బిజీ

  • సెలవు రోజుల్లోనూ కసరత్తులు​
  • ఈ నెలాఖరు వరకు డెడ్​ లైన్​
  • జిల్లాలో 3 వేలకు పైగా అప్లికేషన్ల పెండింగ్​

జనగామ, వెలుగు: ధరణి సమస్యల పరిష్కారం మళ్లీ స్పీడందుకుంది. మార్చి ఒకటిన మొదలైన స్పెషల్​ డ్రైవ్​ ఎంపీ ఎలక్షన్ కోడ్​తో నిలిచిపోగా, ప్రస్తుతం వీటి క్లియరెన్స్ కు ఆఫీసర్లు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని సర్కారు డెడ్ లైన్​ పెట్టడంతో మరింత వేగం పెంచారు. సెలవు రోజుల్లోనూ పనులు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా, భూ సమస్యలను పరిష్కరించాలన్న ఒత్తిడి పెరగడంతో రెవన్యూ అధికారులు చిన్నచిన్న కారణాలను చూపి ఎక్కువ మొత్తం అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

జిల్లాలో 3 వేలకుపైగా అప్లికేషన్లు పెండింగ్..

జనగామ జిల్లాలో 12 మండలాలుండగా, ధరణి భూ రికార్డుల సమస్యలతో పలువురు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి ధరణి స్పెషల్ డ్రైవ్​చేపట్టడంతో కాస్త ఉపశమనం లభించినట్లైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 5312 మందికి పైగా బాధితులు అప్లై చేసుకోగా, ప్రస్తుతం పనులు స్పీడ్​ అందుకున్నాయి. ఈక్రమంలో రెండువేలకు పైగా అప్లికేషన్లు క్లియర్ అయ్యాయి. మరో 3 వేల పైచిలుకు అప్లికేషన్ల పై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో టీఎం 33 అప్లికేషన్లు రెండు వేల వరకు, ఇతర అప్లికేషన్లు మరో వెయ్యి వరకు ఉన్నాయి. 

లాగిన్లతో ఉపశమనం..

గతంలో ధరణి భూ సమస్యలను పరిష్కరించే అధికారం కేవలం కలెక్టర్ కు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. చిన్నచిన్న కారణాలతో పట్టాలకు నోచుకోక రైతులు అవస్థలు పడ్డారు. కాంగ్రెస్​ సర్కారు రూల్స్ సడలించింది. తహసీల్దార్లు, ఆర్డీవోలకు కూడా లాగిన్​ అవకాశం ఇచ్చింది. దీంతో కొంత మేర సమస్యలకు పరిష్కారం లభించే సౌలభ్యం కలిగింది. తహసీల్దార్ పరిధిలో జీఎల్ఎంలోని సమస్యలను పరిష్కరించే అధికారం కల్పించారు. ఆధార్​కార్డు, పేరు, కులం, స్త్రీ, పురుషులు, తండ్రి పేరు వంటి తప్పుల సవరణ బాధ్యతలు తహసీల్దార్లకు ఇచ్చారు.

అసైన్డ్​భూములు, వారసత్వం, జీపీఏ (పాస్​బుక్​ఉంటే), ఖాతానంబర్​విలీనం వంటివి కూడా తహసీల్దార్ పరిధిలో ఉన్నాయి. పాస్​ బుక్ లేకుండా నాలా కన్వర్షన్, ల్యాండ్ అక్విజేషన్ సమస్యలు, మిస్సింగ్ సర్వే నంబర్, ఎన్ఆర్ఐలకు సంబంధించిన భూ సమస్యలు ఆర్డీవో లాగిన్​లో పరిష్కారానికి ఛాన్స్ ఇచ్చారు. పెండింగ్ మ్యుటేషన్లు, పాసుబుక్​ లేకుండా అసైన్డ్ భూములు, వారసత్వం, పట్టాదారు పాసుబుక్​ కోర్టు కేసులు తదితర సమస్యలు కలెక్టర్ లాగిన్​లో పరిష్కారానికి అవకాశమిచ్చారు. ఇవి కూడా రూ.50 లక్షల పైబడి విలువ చేసేవైతే సీసీఎల్​ఏ చేతిలో పరిష్కరింపబడేలా సడలింపులు ఉన్నాయి. 

క్లియరెన్స్​ఒత్తిడి..

కోడ్​కారణంగా ఆగిపోయిన పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని సర్కారు ఒత్తిడి పెంచడంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను అప్రమత్తం చేశారు. కాగా, ఫీల్డ్ విజిట్ చేసి భూ సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉండగా, అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. స్టాఫ్​ కొరతకు తోడు టైం లేదన్న వాదనలున్నాయి. ఫీల్డ్ విజిట్ రిపోర్ట్ ఆధారంగా ఆఫీస్ లోని రికార్డులను పరిశీలించి పరిష్కార మార్గం చూపాల్సిన ఆఫీసర్లు ఆ దిశగా ముందుకు సాగడంలేదన్న ఆరోపణలున్నాయి. అప్లికేషన్లలోని వివరాలపైనే ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైళ్లు క్లియర్​ కావాలనే ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఏ చిన్న సమస్య దొరికినా సదరు అప్లికేషన్​ను రిజెక్ట్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.  

వేగంగా చేపడుతున్నం..

ధరణి సమస్యల పరిష్కారానికి కసరత్తులు పెంచాం. ప్రతి రోజు 200 నుంచి 300 వరకు అప్లికేషన్లు క్లియర్ చేస్తున్నం. భూ సమస్యలను రూల్స్​ మేరకు పరిష్కరిస్తున్నం. ఎంపీ ఎలక్షన్ కోడ్ కారణంగా జాప్యం జరుగగా, ఇప్పుడు వేగంగా అప్లికేషన్ల క్లియరెన్స్ చేస్తున్నం.  

దేవరాయి కొమురయ్య, ఆర్డీవో జనగామ