సైబర్​ మోసాలపై రోజుకు ..3 వేలకు పైగా కాల్స్.. రూ.391 కోట్లు ఫ్రీజ్

  • రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు లూటీ,,రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్నసైబర్ క్రైమ్స్.. 
  • 63 మంది పోలీసులతో కాల్‌ సెంటర్‌‌ ఆపరేషన్స్‌​
  • హెల్ప్​లైన్ నంబర్​​ 1930కు ఫిర్యాదులవెల్లువ.. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 3,900 కాల్స్​​
  • గడిచిన 21 నెలల్లో సుమారు 5 లక్షల కాల్స్‌.. 
  • గోల్డెన్​ అవర్​లో ఫిర్యాదు చేస్తేనే డబ్బు సేఫ్​!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ప్రతీరోజు బాధితులు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు కోల్పోతున్నారు. సైబర్​నేరాలను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన హెల్ప్‌‌లైన్ నంబర్‌‌‌‌ 1930కి రోజూ 3 వేలకు పైగా  కాల్స్ వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే 3,900 కాల్స్‌‌ను 1930 సిబ్బంది అందుకున్నారు. ఇలా ప్రతి నిమిషానికి రెండు కాల్స్‌‌ చొప్పున రోజుకు సగటున 2,500 నుంచి 3,500 కాల్స్‌‌ వరకు కాల్‌‌ సెంటర్‌‌‌‌ సిబ్బంది అటెండ్ చేస్తున్నారు.

గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేసినవారికి  రీఫండ్‌‌ చేయగలుగుతున్నారు.  కాల్‌‌ అందిన వెంటనే సంబంధిత బ్యాంకుల నోడల్ ఆఫీసర్స్‌‌తో మాట్లాడి.. 2 నుంచి 5 నిమిషాల వ్యవధిలో ఆయా అకౌంట్స్‌‌ నుంచి డబ్బు ట్రాన్స్‌‌ఫర్ కాకుండా హోల్డ్ చేస్తున్నారు. ఇలా గత 21 నెలల వ్యవధిలో 4,94,877 కాల్స్‌‌ను 1930 సిబ్బంది అటెండ్‌‌ చేశారు. నిర్ణీత సమయంలో బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రూ.391.5 కోట్లు ఫ్రీజ్ చేసి, ఇందులో రూ.196 కోట్లు బాధితులకు రీఫండ్ చేశారు. ఇలా ప్రతిరోజూ వచ్చే కాల్స్‌‌లో సగటున 350 ఫిర్యాదులను కాల్‌‌సెంటర్ సిబ్బంది ఆయా పోలీస్​స్టేషన్లకు రిపోర్ట్ చేస్తున్నారు.  

రోజూ కోట్లలో దోచేస్తున్నారు

రాష్ట్రంలో సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఆన్‌‌లైన్‌‌లో జరుగుతున్న ఈ దోపిడీని పూర్తిగా అరికట్టడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. సైబర్ నేరాల్లో బాధితులు రోజు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర కోల్పోతున్నారు.  సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బుకు ఆన్‌‌లైన్‌‌లోనే అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘1930 టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌’ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఈ కాల్‌‌ సెంటర్‌‌ ను బంజారాహిల్స్‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌ కమాండ్‌‌ అండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌లో 2023 మార్చిలో ప్రారంభించారు.

ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో కాల్‌‌సెంటర్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. కాల్స్‌‌ను మేనేజ్ చేసేందుకు మొదట్లో ‘ఎక్సోటెల్‌‌’ అనే సాఫ్ట్‌‌వేర్‌‌ వినియోగించారు. రోజురోజుకు కాల్స్ సంఖ్య పెరిగిపోవడంతో ప్రస్తుతం మోడ్రన్​‘సేల్స్‌‌ స్క్వాడ్‌‌’ సాఫ్ట్‌‌వేర్‌‌ ను‌‌ ఉపయోగిస్తున్నారు. దీన్ని కూడా అప్‌‌డేట్‌‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాల్‌‌ సెంటర్‌‌‌‌లో ఇన్​స్పెక్టర్‌‌‌‌, ఎస్‌‌ఐ, ఏఎస్‌‌ఐ సహా మొత్తం 63 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.  కా12 లైన్స్‌‌ ద్వారా కాల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ చేస్తున్నారు.

24 గంటలు పనిచేసేలా కాల్​సెంటర్​

డిపార్ట్‌‌మెంట్‌‌లో సాంకేతిక నైపుణ్యం ఉన్న కానిస్టేబుల్స్‌‌ను కాల్​సెంటర్​కు కేటాయించారు. వీరికి బాధితులు, నేషనల్ బ్యాంకులకు చెందిన నోడల్ ఆఫీసర్స్‌‌తో మాట్లాడేందుకు శిక్షణ ఇచ్చారు.  హిందీ, ఇంగ్లిష్‌‌, తెలుగు స్పష్టంగా మాట్లాడే సిబ్బంది షిఫ్ట్‌‌లవారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. కాల్‌‌ మేనేజ్‌‌ లైన్స్‌‌ ద్వారా బాధితుల నుంచి వచ్చే కాల్స్‌‌ రిసీవ్‌‌ చేసుకునేందుకు 40 మంది కాల్ ఏజెంట్స్‌‌ పనిచేస్తున్నారు. మరో 20 మంది బ్యాంక్‌‌ నోడల్‌‌ అధికారులు, రిస్క్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ టీమ్‌‌లతో కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇలా ఆయా బ్యాంకులు సైబర్‌‌ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి బ్యాంకు ఖాతాల ఆధారంగా డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని గుర్తించి, ఆ ఖాతాలను ఫ్రీజ్‌‌ చేస్తున్నారు.

గోల్డెన్​అవర్​లో ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు క్యాష్‌‌ డ్రా చేసుకోకుండా అడ్డుకోగలుగుతున్నారు. బాధితుల నుంచి సేకరించే వివరాల ఆధారంగా ఆయా సైబర్‌‌‌‌ మోసానికి సంబంధించిన డబ్బును సగటున 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలో హోల్డ్‌‌ చేస్తున్నారు.  సైబర్‌‌‌‌ నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ఆన్‌‌లైన్‌‌లోనే హోల్డ్‌‌ చేసి, బాధితుల అకౌంట్‌‌కి చేరుస్తున్నారు. దీంతోపాటు కాల్​సెంటర్​ సిబ్బందే స్థానిక పోలీస్‌‌స్టేషన్స్‌‌లో కేసులు కూడా నమోదు చేయిస్తున్నారు. 

1930 సత్ఫలితాలు ఇస్తున్నది

1930 కాల్​ సెంటర్​ సత్ఫలితాలు ఇస్తున్నది. బాధితులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఐబీఆర్‌‌‌‌ ఆప్షన్‌‌ 4ను కూడా అందుబాటులోకి తెచ్చాం. కాల్‌‌ రెస్పాండ్‌‌ టైమ్ చాలా వేగవంతంగా ఉంటుంది. ఏదైనా మోసం జరిగితే వెంటనే గోల్డెన్ అవర్స్‌‌లో ఫిర్యాదు చేయాలి. స్పష్టమైన ఆధారాలు అందించాలి.

దీంతో డబ్బు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడగలం. మన అప్రమత్తతే  శ్రీరామరక్ష. సైబర్‌‌ నేరగాళ్లు కొత్తకొత్త మోసాలు చేస్తున్నారు. మోసపోతున్న వారిలో దాదాపు 85 శాతం బాగా చదువుకున్న వాళ్లే ఉంటున్నారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్‌‌ పేరుతో బెదిరింపులు పెరిగిపోయాయి. మోసం జరిగితే వెంటనే 1930 లేదా సైబర్ క్రైమ్‌‌ పోర్టల్‌‌లో ఫిర్యాదు చేయాలి. 
– శిఖా గోయల్‌‌, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

డిజిటల్‌‌ అరెస్ట్‌‌తో ఓ వృద్ధుడి వద్ద సైబర్​నేరగాళ్లు రూ.4.82 కోట్లు కొట్టేశారు. బాధితుడు 1930 ద్వారా సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కాల్‌‌ చేశాడు.  అతడి నుంచి వివరాలు తీసుకున్న కాల్‌‌ ఏజెంట్స్‌‌.. సంబంధిత బ్యాంక్‌‌ నోడల్ ఆఫీసర్స్‌‌తో మాట్లాడారు. బాధితుడి అకౌంట్‌‌ నుంచి దాదాపు 8 అకౌంట్స్‌‌కు డబ్బు ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ అయినట్లు గుర్తించారు. ఆయా బ్యాంకులను సంప్రదించి రూ.2.43 కోట్లు ఫ్రీజ్‌‌ చేశారు. అనంతరం కోర్టు ద్వారా బాధితుడికి  ఆ మొత్తాన్ని రీఫండ్ చేశారు.