- పాత నారాయణరావుపేటలో కొత్త స్కూల్ నిర్మాణం
భద్రాచలం, వెలుగు : దుమ్ముగూడెం మండలంలోని పాత నారాయణరావుపేటలో 30 మందికి పైగా గిరిజన పిల్లలు ఉన్నారు. వారికి గిరిజన ప్రాథమిక పాఠశాల చాలా దూరంలో ఉంది. అక్కడకు వెళ్లి చదువుకోవాలంటే దూరభారం ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై చిన్నారులు, వారి తల్లిదండ్రులు వెళ్లి ఐటీడీఏ పీవో రాహుల్‌ను కలిశారు. చదువుకోవాలనే తమ ఆశను చిన్నారులు పీవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పీవో పాత నారాయణరావుపేటలోనే రూ.4.50లక్షలు ఖర్చు పెట్టి రేకులతో స్కూల్‌ను కట్టించారు.
ఆ స్కూల్‌ను శనివారం ఆయన ఓపెన్ చేశారు. గిరిజన పిల్లల చదువుపట్ల కుతుహలం, తల్లిదండ్రుల పట్టుదల వల్లే ఈ స్కూల్ ఓపెన్ అయినట్లుగా పీవో తెలిపారు. చదువుతో పాటు, కోయభాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా రక్షించుకోవడం తమ బాధ్యతేనని పిల్లల తల్లిదండ్రులకు గుర్తు చేశారు. చిన్నారులతో కలిసి ఆయన ముచ్చటించి వారికి అవసరమైన పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్వెల్ఫేర్ఈఈ తానాజీ, డీఈ హరీశ్, ఏఈ రవి తదితరులు పాల్గొన్నారు.