
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేపే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
- తెరపైకి వస్తున్న కొత్త పేర్లు.. మహిళా కోటాలో విజయశాంతికి చాన్స్?
- నేడు ఢిల్లీకి రేవంత్, మహేశ్ గౌడ్, భట్టి, ఉత్తమ్, మీనాక్షి నటరాజన్
- రేపు హైకమాండ్ తో భేటీ.. రాత్రికి అభ్యర్థుల ప్రకటన
- నామినేషన్లకు ఎల్లుండే ఆఖరు తేదీ
- ఢిల్లీలో ఆశావహుల ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు దగ్గరపడ్తున్న కొద్దీ తెరపైకి కొత్త పేర్లు వస్తుండడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపిక వేదిక ఢిల్లీకి మారడం, నామినేషన్లకు సోమవారం చివరి తేదీ కావడంతో ఆశావహుల్లో పలువురు ఢిల్లీకి చేరుకున్నారు. 4 సీట్ల కోసం ఇప్పటికే 40 మంది పోటీ పడుతుండగా, వారంతా సీనియర్లే కావడంతో అభ్యర్థుల ఎంపిక హైకమాండ్‌కు పరీక్షగా మారింది. దీంతో తమ పేరు లిస్టులో చేరేందుకు, చేరిన పేరు మారకుండా ఉండేందుకు హస్తిన కేంద్రంగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
రేపు పేర్లు ఫైనల్..
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మధ్య ప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఆదివారం ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ అయి, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అదేరోజు రాత్రి అభ్యర్థులను హైకమాండ్ ప్రకటించనుంది. దీంతో అభ్యర్థుల ప్రకటన తర్వాత నామినేషన్ల దాఖలుకు కొన్ని గంటల సమయమే ఉండటంతో ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
తెరపైకి కొత్త పేర్లు..
ఎమ్మెల్సీ అభ్యర్థులపై పీసీసీ ఫైవ్ మెన్ కమిటీలో సభ్యులైన రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్, భట్టి, ఉత్తమ్ బుధవారం సమావేశమై ఓ షార్ట్ లిస్టు రెడీ చేశారు. దీన్ని హైకమాండ్ కు కూడా పంపించారు. అయితే, హైకమాండ్ దాన్ని పక్కన పెట్టి కొత్త పేర్లను తెరపైకి తెచ్చిందని చెప్తున్నారు. శుక్రవారం పీసీసీ నేతల నుంచి కొందరి బయోడేటాను ఢిల్లీ పెద్దలు అడిగారు. ఇందులో యాదవ సామాజిక వర్గం నుంచి సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ తనయుడు వినయ్ కుమార్, మహిళా కోటా నుంచి మాజీ ఎంపీ, నటి విజయశాంతి ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ కోటా నుంచి సంపత్ కుమార్(మాదిగ), ఎస్టీ నుంచి విజయా బాయి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.