ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 404 మంది మృతి

ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 404 మంది మృతి
  • 560 మందికి పైగా గాయాలు
  • బందీల విడుదలకు నిరాకరించడంతో ఎయిర్‌‌‌‌స్ట్రైక్స్  
  • తమకు చెప్పే చేశారని అమెరికా వెల్లడి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మూడు దశల్లో అమలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మొదటి దశ పూర్తయింది. రెండు వారాలు గడుస్తున్నా రెండో దశ అమలుపై ముందుడుగు పడలేదు. రంజాన్ నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్‌‌ను ఏప్రిల్ 15 వరకు పొడిగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నది. కానీ దానికి హమాస్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో హమాస్‌‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.

గాజా స్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్‌‌ భీకర దాడులు చేసింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. నార్త్ గాజా, సౌత్ గాజా, సెంట్రల్ గాజా, గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా తదితర సిటీల్లో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 404 మంది చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. చనిపోయినోళ్లలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని వెల్లడించింది. 560 మందికి పైగా గాయపడ్డారని చెప్పింది. శిథిలాల కింద చిక్కుకున్నోళ్లను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ పోలీస్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చీఫ్ మహమ్మద్ అబూ వత్ఫా చనిపోయినట్టు తెలుస్తున్నది. నలుగురు సీనియర్ ఆఫీసర్లను తాము కోల్పోయామని హమాస్ ప్రకటించింది. కాగా, గాజాలో మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. హమాస్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో గాజా సరిహద్దులోని స్కూళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని దాడులు చేస్తం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్ జరిపిన అదిపెద్ద దాడి ఇదే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు హమాస్ ఒప్పుకోకపోవడంతోనే దాడులకు ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ‘‘బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులకు ఆదేశించాం. యుద్ధ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు, బందీలను విడుదల చేయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని వెల్లడించారు.

ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది: హమాస్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్ మండిపడింది. ‘‘ఇజ్రాయెల్ తమ పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి, మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది” అని పేర్కొంది. కాగా, యుద్ధం మళ్లీ మొదలుకావడానికి హమాసే కారణమని అమెరికా ఫైర్ అయింది. తమతో సంప్రదించాకే ఇజ్రాయెల్ దాడులు చేసిందని పేర్కొంది.