భూసమస్యలపై మళ్లీ అప్లై చేసుకోవాల్సిందే.. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికిపైగా రిజెక్ట్​

భూసమస్యలపై మళ్లీ అప్లై చేసుకోవాల్సిందే.. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికిపైగా రిజెక్ట్​
  • కొత్తగా భూ భారతి పోర్టల్​లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు
  • త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనూ మాన్యువల్​గా అప్లై చేసుకునే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: భూ సమస్యలపై ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్​ అవుతున్నాయి. భూ భారతి పోర్టల్​ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త ఆర్​వోఆర్​ చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్​లో మరోసారి అప్లికేషన్​ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో మాన్యువల్​గా దరఖాస్తులు ఇవ్వొచ్చని చెప్తున్నారు. 

దీంతో కొంతమంది భూ భారతిలో అప్లికేషన్లు పెట్టుకుంటుండగా.. మరికొందరు రెవెన్యూ సదస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. భూ భారతి పోర్టల్​ అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలో 81 వేలపైనే అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. ఇందులో పాస్ బుక్​ డేటా కరెక్షన్​ కింద అంటే టీఎం 33 మాడ్యుల్ కింద​ వచ్చినవే ఎక్కువ ఉన్నాయి. భూ భారతి ప్రారంభించడంతో ధరణిలో ఉన్న పెండింగ్​ అప్లికేషన్లన్నింటినీ భూ భారతి పోర్టల్​కు  బదిలీ చేశారు. 

తిరస్కరించినవే ఎక్కువ!

భూ భారతి చట్టం తీసుకురావడమే కాకుండా ఇందులో తహసీల్దార్​, ఆర్డీవో, అడిషనల్​ కలెక్టర్​, కలెక్టర్  స్థాయిలలో అధికారాలను వికేంద్రీకరించారు. దీంతో చిన్నాచితకా సమస్యలన్నీ తహసీల్దార్​, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందులో భాగంగానే ధరణి నుంచి వచ్చిన పెండింగ్​ అప్లికేషన్లను వెంటనే క్లియర్​ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. అధికారులు మాత్రం ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండానే, కారణాలు చెప్పుకుండానే పాత అప్లికేషన్లను ఒక్కొక్కటిగా తిరస్కరిస్తున్నారు. 

కొన్నిచోట్ల కనీసం రిపోర్ట్​లు కూడా పెట్టకుండానే రిజెక్ట్​ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో తహసీల్దార్ల స్థాయిలో ఉన్న 37 వేల పెండింగ్​ అప్లికేషన్లు  ఒకేసారి 20 వేలకు తగ్గిపోయాయి. ఆర్డీవోలు, అడిషనల్​ కలెక్టర్లు, కలెక్టర్ల లెవల్​లో పెండింగ్​లో  ఉన్న మిగతా 40 వేల అప్లికేషన్లలో దాదాపు సగానికి పైగా క్లియర్​ చేసినట్లు పైకి నివేదించారు. వీటిలో పరిష్కారమైనవి అరకొర కాగా, తిరస్కరించినవే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. 

కొత్తవాటికి భూభారతి రూల్స్​ ప్రకారమే క్లియరెన్స్​

ధరణిలో అప్లికేషన్లు రిజెక్ట్​ కావడం, కొత్తగా భూ భారతి చట్టం రావడంతో గతంలో పరిష్కారం కాని తమ సమస్యలు ఈసారైనా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో చాలామంది రైతులు ఆయా మాడ్యుళ్ల కింద అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. భూ భారతిలో ప్రతి అప్లికేషన్​కు కొంత నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూ భారతి పోర్టల్​లో  కొత్తగా అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తును కూడా భూ భారతి చట్టం రూల్స్​ ప్రకారమే క్లియర్​ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ అప్లికేషన్​ రిజెక్ట్​ చేసినా అందుకు సరైన కారణం చెప్పాల్సిందే. 

పైగా నిర్దేశించిన సమయంలో అప్లికేషన్​ ప్రాసెస్​ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. రైతులు ఆన్​లైన్​లో అప్లై చేసుకునేందుకు ఇబ్బంది ఉంటే రెవెన్యూ సదస్సులు నిర్వహించే వరకు ఆగాలని అధికారులు చెప్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ, మాన్యువల్​గా తీసుకునే దరఖాస్తులకు అంత ప్రియారిటీ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.