- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ. 2,215 కోట్ల దాకా రుణాలు
- ఐదేళ్లలో తీసుకున్న రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- తీరనున్న పంట పెట్టుబడి కష్టాలు
- త్వరలో రైతు భరోసా, ఫసల్ బీమా అన్నదాతల్లో హర్షం
రూ.2 లక్షల పంట రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3.90 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా రైతులు 17 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా ఎంతో కొంత రుణాలను బ్యాంకుల ద్వారా తీసుకుంటారు. ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఆశపెట్టుకొని చాలా మంది రుణాలు చెల్లించలేదు. గత ప్రభుత్వంలో విడతల వారీగా రుణమాఫీ చేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే పెరిగిన వడ్డీని చెల్లించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆగస్టు 15 లోగా రూ.2 లక్షలను ఏకకాలంలో మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, అందుకు అనుగుణంగా మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ.2,215 కోట్లు అవసరం
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చాలా మంది రైతులు ఈ ఏడాది రుణాన్ని రెన్యువల్ చేసుకోలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ. 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న దాదాపు 3.90 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలంటే సుమారు రూ.2,215 కోట్లు నిధులు అవసరమని అధికారుల అంచనా. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఈ మాఫీ వర్తించనుంది.
రైతు భరోసా, ఫసల్ బీమాతో మరింత మేలు
రుణమాఫీ కానుండటంతో రైతులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఇక త్వరలో రైతు భరోసా, పంటలకు ఫసల్ బీమా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక పక్క రుణమాఫీ, మరోపక్క రైతు భరోసా కింద రూ. 15 వేలు సాయం సైతం అమలైతే ఇక రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్నారు. వీటితోపాటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసిన పంట నష్ట పరిహారానికి సంబంధించి ఫసల్ బీమా పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమైంది. ఇది కూడా అమల్లోకి వస్తే ప్రతి ఏడాది అధిక, అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్న రైతులకు లాభం జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని పత్తి రైతులకు ఫసల్ భీమా ఎంతగానో ఉపయోగపడనుంది.
గత ప్రభుత్వం తీరుతో విసిగిపోయిన రైతులు
గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేసేందుకు ఆపసోపాలు పడింది. ఏకకాలంలో కాకుండా విడతలవారీగా చేపట్టడంతో రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే నమ్మకంతో చాలా మంది రెన్యువల్ చేసుకోలేదు. బ్యాంకర్లు తీసుకున్న రుణాలకు మూడు, ఆరు నెలలకు ఒకసారి వడ్డీలు పెంచుకుంటూ పోయారు. ఫలితంగా రుణమాఫీ లేక.. అటు కొత్త రుణాలు తీసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది మాత్రం వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ప్రస్తుతం ఏకకాలంలో రూ. 2 లక్షలు మాఫీ కానుండటంతో ఇక సాగుపెట్టుబడికి ఇబ్బందులు తప్పుతాయని రైతులు
భావిస్తున్నారు.
ఒకేసారి రుణమాఫీతో లాభం
నాకు 3 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. గత ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయకుండా విడతల వారీగా చేయడంతో ఇబ్బందులు పడ్డా. ప్రస్తుతం నేను బ్యాంకులో రూ. లక్ష బాకీ ఉన్నాను. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుకు అవసరమైన సమయంలో ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటించడంతో నా బాకీ తీరిపోతుందని ఆనందంగా ఉంది.
- రాథోడ్ ఉత్తమ్ నాయక్, రైతు, కొల్హారీ గుడిహత్నూర్
ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ వివరాలు
జిల్లా రైతులు రుణాలు
ఆదిలాబాద్ 1.17 లక్షలు రూ.730 కోట్లు
మంచిర్యాల 94 వేలు రూ.504 కోట్లు
నిర్మల్ 1.17లక్షలు రూ.652 కోట్లు
ఆసిఫాబాద్ 62 వేలు రూ.329 కోట్లు