రికార్డు సంఖ్యలో నమోదయిన కరోనా కేసులు
కరోనా కేసుల్లో దేశం కొత్త రికార్డు
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6088 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి . కరోనా వల్ల గురువారం దేశవ్యాప్తంగా 148 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. ప్రస్తుతం దేశంలో 66,330 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అదేవిధంగా చనిపోయిన వారి సంఖ్య 3583కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 48,553 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గురువారం మహారాష్ట్రలో 2345 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదకావడం ఇదే మొదటిసారి. దాంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 41,600 దాటింది. అలాగే గురువారం 64 మంది చనిపోవడంతో.. మహారాష్ట్రలో కరోనా మరణాలు 1454 చేరాయి. తమిళనాడులో గత 24 గంటల వ్యవధిలో… 776 మంది కరోనా బారిన పడటంతో.. మొత్తం బాధితుల సంఖ్య 13,900 దాటింది. గుజరాత్‌లోనూ కరోనా కేసుల సంఖ్య 12,910కి చేరింది. గుజరాత్‌లో నిన్న 24 మంది చనిపోయారు. ఢిల్లీలో 571 కొత్త కేసులు నమోదు కావడంతో .. దేశ రాజధానిలో బాధితుల సంఖ్య 11,600 దాటింది. రాజస్థాన్‌లో 212, మధ్యప్రదేశ్‌లో 246 కొత్త కేసులు నమోదయ్యాయి.
వలస కూలీల రాకతో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిషా, జార్కండ్‌లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఉత్తరప్రదేశ్‌లో 340 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బీహార్‌లో నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 211 మందికి కరోనా సోకింది. ఇందులో ఎక్కువ మంది వలస కూలీలే కావడం గమనార్హం. ఒడిషాలో గత 24 గంటల్లో 51 మందికి వైరస్ సోకడంతో .. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1003కి చేరింది. కర్ణాటకలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో 143 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 1600 దాటింది.
For More News..