స్కూల్, కాలేజీ బస్సులు భద్రమేనా? .. ఫిట్​నెస్​పై పట్టింపేది?

స్కూల్, కాలేజీ బస్సులు భద్రమేనా? .. ఫిట్​నెస్​పై పట్టింపేది?
  • స్కూల్, కాలేజీ బస్సులు భద్రమేనా?
  • కొద్దిరోజుల్లో కొత్త విద్యా సంవత్సరం షురూ
  • ఇంకా తనిఖీలు చేపట్టని ఆర్టీఏ అధికారులు 
  • సిటీలో 8 వేలకుపైనే స్కూల్, కాలేజీ బస్సులు

హైదరాబాద్, వెలుగు : ప్రతి ఏడాది స్కూల్స్, ​కాలేజీల రీ ఓపెనింగ్​కు ముందు నిర్వహించే బస్సుల ఫిట్​నెస్​తనిఖీలపై ఆర్టీఏ ఇంకా దృష్టి సారించట్లేదు. కొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం షురూ కానుంది. స్కూళ్లు, కాలేజీలు ఓపెన్​ కానున్నాయి. మరోవైపు కాలం చెల్లిన బస్సులు, అనుభవం లేని డ్రైవర్లు, యాజమాన్యాల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.  ప్రతి ఏడాది బస్సుల కండీషన్ ను చెక్​ చేసి ఆర్టీఏ అధికారులు ఫిట్​నెస్​ సర్టిఫికెట్​జారీ చేస్తారు. అలాగే  పిల్లల భద్రతపై విద్యాసంస్థలు, పేరెంట్స్, బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఈ నెల 12 నుంచి స్కూల్స్ ఓపెన్ కానుండగా.. ఇప్పటికీ అధికారులు ఫిట్ నెస్ తనిఖీలు ప్రారంభించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. 

8  వేలకు పైనే బస్సులు  

గ్రేటర్​ సిటీ పరిధిలో 8 వేలకు పైగా స్కూల్​, కాలేజీ బస్సులు ఉన్నాయి. లక్షల మంది స్టూడెంట్స్​ను తీసుకెళ్తుంటాయి. 15 ఏండ్లకు పైగా కాలం చెల్లిన బస్సులు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నా అధికారులు  పట్టించుకోవడంలేదు.  సామర్థ్యం లేని బస్సులకు ఫిట్​నెస్​ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు ఆర్టీఏ అధికారులపై ఆరోపణలు  ఉన్నాయి. 

మొక్కుబడిగా తనిఖీలు 

స్కూల్, కాలేజీ బస్సులను నడిపే డ్రైవర్ల ఏజ్ 60 ఏండ్లకు మించకూడదు. బస్సు నడపడంలో డ్రైవర్ కు కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి. డ్రైవర్​ అర్హతలు, డ్రైవింగ్ ​లైసెన్స్​ను ఆర్టీఏ అధికారులను చెక్  చేయాలి. స్కూల్ ​యాజమాన్యాలు ప్రతి 3 నెలలకు ఒకసారి డ్రైవర్లకు బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేయించాలి. బస్సు డ్రైవర్, అటెండర్​తప్పనిసరిగా యూనిఫామ్​ ధరించాలి. కానీ ఆర్టీఏ అధికారులు వీటిని చూసి చూడట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.   ప్రతి బస్సులో ఫైర్ సేఫ్టీ ఎక్వీప్ మెంట్ ఉండాలి.

 సీటింగ్ కెపాసిటీకి మించి పిల్లలను బస్సులో ఎక్కించకూడదు. బస్సుపై స్కూల్​, కాలేజీకి పేర్లను, అడ్రస్​ను, ఫోన్ నంబర్లను తప్పనిసరిగా రాయాలి.  వీటిపై అధికారులు మొక్కుబడిగా​ తనిఖీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. రూల్స్​ పాటించకుండా బస్సులు నడుపుతుండటం, కాలం చెల్లిన బస్సులు రోడ్ల మీద తిరుగుతుండటం, అనుభవం లేని డ్రైవర్లు బస్సులను నడుపుతుండటంతో తరచూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ఇకనైనా ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  

తనిఖీలు నిర్వహిస్తాం

ప్రతి ఏటా స్కూల్​, కాలేజీల ఫిట్​నెస్​ లను తనిఖీ చేస్తున్నాం. ఈ ఏడాది కూడా తనిఖీలు నిర్వహిస్తాం. తనిఖీల కోసం బృందాలను రెడీ చేస్తున్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పెనాల్టీ విధిస్తాం. కాలం తీరిన బస్సులు ఉంటే సీజ్​ చేసి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం.  ​
రమేశ్​ కుమార్, ఆర్టీఏ జాయింట్​ కమిషనర్, హైదరాబాద్