కార్పొరేషన్లు అప్పుల కుప్పలు.. అవసరంలేని వాటిల్లో కొన్నింటిని మూసేసే చాన్స్​

కార్పొరేషన్లు అప్పుల కుప్పలు.. అవసరంలేని వాటిల్లో కొన్నింటిని మూసేసే చాన్స్​
  • రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు.. అందులో బాకీల్లో ఉన్నవి 90% పైనే
  • కేవలం లోన్ల కోసమే ఇష్టారీతిగా ఏర్పాటు
  • పదేండ్లలో కార్పొరేషన్ల మొత్తం అప్పు రూ.2.82 లక్షల కోట్లపైనే
  • గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. సెట్​ రైట్​ చేసేందుకు చర్యలు
  • అవసరమైన, అవసరంలేని కార్పొరేషన్ల లిస్ట్ తయారీ
  • అవసరంలేని వాటిల్లో కొన్నింటిని మూసేసే చాన్స్​
  • ఆ ఉద్యోగులను ఇతర సంస్థల్లో మెర్జ్​ చేసే ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారుకు గుదిబండలుగా మారాయి. కొన్ని కార్పొరేషన్లను కేవలం అప్పులు తీసుకునేందుకే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటైన పలు కార్పొరేషన్లకు పదేండ్లలో సర్కారు నుంచి పైసా సాయం అందలేదు. ఇందులో తెలంగాణ స్టేట్‌‌‌‌ మోస్ట్‌‌‌‌ బ్యాక్‌‌‌‌వర్డ్‌‌‌‌ క్లాసెస్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ వంటివి ఉన్నాయి. ఇంకొన్ని కార్పొరేషన్లయితే  సిబ్బంది లేక నామ్​ కే వాస్తేగా తయారయ్యాయి. కాళేశ్వరం, మిషన్‌‌‌‌ భగీరథ, రోడ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దినదిన గండంగా సాగుతున్న ఇలాంటి సంస్థలపై విధానపర నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

ఇందులో భాగంగా..  అవసరమైన, అవసరంలేని కార్పొరేషన్ల లిస్ట్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రభుత్వ నిధులు వృథా అవుతూ.. ఎలాంటి ఉపయోగం లేని కార్పొరేషన్లలో కొన్నింటిని మూసేయాలని, అందులోని ఉద్యోగులను ఇతర సంస్థల్లో విలీనం చేయాలని  ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక.. బీసీ, ఎస్సీ , ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న కార్పొరేషన్లను మాత్రం మరింత బలోపేతం చేయాలని.. ఆదాయం తెస్తున్న కార్పొరేషన్లను కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కార్​ యాక్షన్ ప్లాన్  సిద్ధం చేస్తున్నది. 

మొత్తం అప్పుల్లో 42% కార్పొరేషన్లవే 

రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో ఐదారు మినహా మిగతా కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేదు. కార్పొరేషన్లలో ఎక్కువగా పదవుల కోసం.. ప్రభుత్వానికి అప్పులు సమకూర్చడానికి ఉపయోగపడ్డాయి. కార్పొరేషన్ల ద్వారా గత ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులు  రూ.2,82,084 కోట్లు ఉన్నది. ఇది మొత్తం రాష్ట్ర అప్పులో 42 శాతం. ఇందులో ప్రభుత్వం హామీ ఇచ్చి, తీర్చబోయే అప్పులు రూ.1,27,208 కోట్లు. ప్రభుత్వ హామీల మేరకు అప్పులు తీసుకుని, వాటిని తీర్చే బాధ్యత కార్పొరేషన్ల మీద ఉన్నవి రూ.95,462 కోట్లు. కార్పొరేషన్లు స్వయంగా అప్పు చేసి, తామే తీర్చే అప్పులు రూ.59,414 కోట్లు. అయితే ఈ కార్పొరేషన్లకు ఆదాయం లేక వీటి అప్పులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న కార్పొరేషన్లలో 90శాతం కార్పొరేషన్లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. 

నిధులు ఇవ్వక కొన్ని.. ఉనికే లేక మరికొన్ని.. 

నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాన్ని చూపాల్సిన సెట్విన్‌‌‌‌‌‌‌‌ అనే కార్పొరేషన్​పూర్తిగా ఉనికి కోల్పోయింది.  ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టెలివిజన్‌‌‌‌‌‌‌‌, థియేటర్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ తోపాటు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసి రైతులకు అందించే‌‌‌‌‌‌‌‌ ఆగ్రోస్‌‌‌‌‌‌‌‌ వంటివి నిధుల్లేక నిర్జీవంగా మారాయి. ఆర్టీసీ, టూరిజం డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, బేవరేజెస్ కార్పొరేషన్, జెన్‌‌‌‌‌‌‌‌కో, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో, సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్​, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌, మినరల్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్లు, సింగరేణి వంటివి సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ సస్టెయిన్డ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్లుగా పని చేస్తున్నాయి. వాటికి వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధులను జీతభత్యాలు, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తున్నాయి. ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌, ‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌, హాకా వంటి సంస్థలకు ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్చి ఉంటుంది. 

ఇలాంటి సంస్థలపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నది. నిర్జీవంగా ఉన్న కొన్ని కార్పొరేషన్లలో.. స్టేట్‌‌‌‌‌‌‌‌ హ్యాండిక్రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, స్టేట్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ కో-ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, స్టేట్‌‌‌‌‌‌‌‌ మోస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, విశ్వబ్రాహ్మణ కో-ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, మేదర కో-ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్, ట్యాడీ టాపర్స్‌‌‌‌‌‌‌‌ కో-ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, మైనారిటీస్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, వుమెన్‌‌‌‌‌‌‌‌ కో-ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, వికలాంగుల కో-ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, స్టేట్‌‌‌‌‌‌‌‌ యోగాధ్యయన పరిషత్‌‌‌‌‌‌‌‌, ట్రేడ్‌‌‌‌‌‌‌‌ ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, లెదర్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ డెవల్‌‌‌‌‌‌‌‌పమెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, ఆగ్రోస్‌‌‌‌‌‌‌‌ డెవల్‌‌‌‌‌‌‌‌పమెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, ఖాదీ అండ్‌‌‌‌‌‌‌‌ విలేజ్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ బోర్డు, టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, లైవ్‌‌‌‌‌‌‌‌స్టాక్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ, అర్బన్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ డెవల్‌‌‌‌‌‌‌‌పమెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, సెట్విన్‌‌‌‌‌‌‌‌, ట్రైకార్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ ఫుడ్స్‌‌‌‌‌‌‌‌ వంటివి ఉన్నాయి. 

అధిక అప్పులు 5 కార్పొరేషన్ల మీదే 

గత సర్కారు.. అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి అధిక వడ్డీతో అప్పులు తీసుకుంది. మొత్తం కార్పొరేషన్ల అప్పులో ఐదు కార్పొరేషన్లవే 95 శాతం ఉన్నాయి. మార్కెట్ వడ్డీ 7.63 శాతం కంటే ఎక్కువగా 10.49% వడ్డీతో లోన్లు తెచ్చుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్​పై 9.69% ఇంట్రెస్ట్ రేటుతో రూ. 74 వేల 599 కోట్లు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్​పై 9.48% ఇంట్రెస్ట్ రేటుతో రూ. 20,200 కోట్లు,  వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ పై 10.49% ఇంట్రెస్ట్ తో రూ. 14 వేల 60 కోట్ల అప్పు తీసుకుంది. హౌసింగ్ కార్పొరేషన్​పై రూ. 9 వేల కోట్లు, రోడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​పై రూ. 2,951 కోట్ల లోన్లు ఉన్నాయి. గొర్రెల కార్పొరేషన్​ కింద గత ప్రభుత్వం గొర్రెల పథకం కోసం రూ.4 వేల కోట్లు, చేపల కోసం రూ.600 కోట్ల అప్పు చేసింది. హాస్పిటళ్ల నిర్మాణాల కోసం కూడా రూ.3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే లోన్లు తీసుకుంది.