- కరీంనగర్ చల్మెడ మెడికల్ కాలేజీ, దగ్గర్లోని ఇంటి నంబర్లతో భారీగా బోగస్ ఓట్లు
- చదువు పూర్తయిన మెడికల్ స్టూడెంట్స్ పేర్లను తొలగించని అధికారులు
- రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో బీజేపీ నేతల ఫిర్యాదు
ఒక ఇంట్లో లేదా కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు లేదా చివరికి 10 మంది ఓటర్లు ఉంటారు. కానీ కరీంనగర్ లోని చల్మెడ కాలేజీకి సంబంధించిన 10--–100/1, 10-–100/2, 10-–100/8 , 10–-100/9, 10–-100/A, ఇంటి నంబర్లపై సుమారు 615 ఓట్లు నమోదయ్యాయి. ఈ కాలేజీలో చదువుకున్న మెడికల్, నర్సింగ్ స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఏళ్లు గడిచినా వారి పేర్లు ఓటరు జాబితాలో ఇంకా కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ నియోజకవర్గంలో కొన్ని ఇంటి నంబర్లపై 100కుపైగా ఓట్లు నమోదయ్యాయి. చల్మెడ మెడికల్ కాలేజీ, కాలేజీలోని హాస్టళ్లు, సమీపంలోని హాస్టళ్లకు సంబంధించిన ఒక్కో ఇంటి నంబర్‌లో 100 నుంచి 200 ఓట్లు ఎన్ రోల్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే అధికారులు ఈ బోగస్ ఓట్లను గుర్తించినప్పటికీ.. వీటిని జాబితా నుంచి తొలగించలేకపోయారు.
జాబితాలోని మెజారిటీ ఓటర్లు ఇక్కడ లేకపోవడంతో ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కూడా చాలా తక్కువగా నమోదైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ నాయకులు.. బోగస్ ఓట్లపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించారు. ఆధారాలతో సహా సీఈఓ వికాస్ రాజ్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
పేర్ల తొలగింపులో నిర్లక్ష్యం..
చనిపోయిన ఓటర్లతోపాటు మెడికల్ కాలేజీలో చదువు పూర్తై సొంతూర్లకు వెళ్లిపోయిన విద్యార్థుల పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించలేదు. దీంతో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఓటరు జాబితాలో పేర్కొన్న కొన్ని ఇండ్ల అడ్రసుల్లో సంబంధిత ఓటర్లు నివాసముండడం లేదని బీజేపీ నాయకులు గుర్తించారు. కొన్ని అడ్రసుల్లో ఓటర్ల పేర్లను విచారిస్తే అలాంటి వారే ఎప్పుడూ ఇక్కడ లేరని తేలినట్లు ఫిర్యాదులో బీజేపీ నేతలు పేర్కొన్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలసపోయినా పేర్లు అలాగే కొనసాగుతున్నాయని తెలిపారు.
బీఎల్‌వోలు ఫీల్డ్ వెరిఫికేషన్ సరిగా చేయకపోవడంతోనే ఇలాంటి బోగస్ ఓట్లు ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఒక్కో ఇంటి నంబర్ పై నమోదైన వందలాది ఓటర్ల జాబితాను కూడా ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో బీజేపీ నేతలు పొన్న వెంకటరమణ, బి.అజయ్ కుమార్, పవన్ కుమార్, రాజ్ కుమార్ ఉన్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదుపై సీఈసీ వికాస్ రాజ్ వెంటనే స్పందించి కలెక్టర్ తో మాట్లాడారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.