ఫిట్ లెస్​ బస్సులు.. 568 బస్సుల్లో 462కే సర్టిఫికెట్

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఫిట్ నెస్ వ్యవహారం ప్రహసనంగా మారుతోంది. ఈ విద్యాసంవత్సరంలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండానే వందకు పైగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఏటా మే15లోగా స్కూల్​బస్సులకు ఫిట్ నెస్ చేయించాల్సి ఉంది. కాగా గడువు దాటి నెల గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయించలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు దాటుతున్నా ఫిట్ నెస్ లేని బస్సులపై ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. రవాణాశాఖలో సిబ్బంది కొరత కారణంగా రోడ్లపై తనిఖీల డ్యూటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. జిల్లాలో 568 స్కూల్ బస్సులకు గాను, ఇప్పటి వరకు 462 బస్సులకే ఫిట్ నెస్ టెస్ట్​ చేయించారు. మరో 106 పైగా ఫిట్ నెస్ లేని బస్సుల్లో రోజూ వందల మంది స్టూడెంట్స్​ను తరలిస్తున్నా యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ట్రాన్స్​పోర్ట్ డిపార్ట్‌‌మెంట్ ఆఫీసర్లు ఉండడంపై పేరెంట్స్​అసహనం వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ సొంత జిల్లాలో స్కూల్​బస్సులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. 

‘ఫార్మాలిటీస్’ చెల్లిస్తే చాలు...

బస్సుల తనిఖీ సమయంలో ఆఫీసర్లు ఆ బస్సు ఇంజిన్ పొజిషన్, స్టెప్నీ, బ్రేక్​లు, క్లచ్, మీటర్ ​రీడింగ్, సైడ్​లైట్లు, ఇండికేటర్లు, గేర్ల పనితీరును క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంది. టైర్ల క్వాలిటీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్​తోపాటు ఫైర్​సేఫ్టీ మెజర్ మెంట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, రేడియం స్టిక్కర్లు, సీట్లు, లైట్ల పనితీరును చెక్ చేస్తారు. ఎంవీఐ స్వయంగా టెస్ట్ డ్రైవ్​చేసి చెకింగ్ చేస్తారు. ఈ సమయంలో ప్రమాణాలకు అనుగుణంగా లేని బస్సులకు సర్టిఫికెట్ ఇవ్వకుండా, తిప్పి పంపిస్తారు. అయితే ఖమ్మం ట్రాన్స్​పోర్ట్ ఆఫీస్ లో సిబ్బంది కొరత, పని ఒత్తిడితో తూతూమంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్ బస్ లలో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మిడిల్ రాడ్స్ లేకుండానే పాత బస్ లకు కొత్త రంగులు అద్ది ఫిట్ నెస్ కు తేవడం కొసమెరుపు. ఆన్​లైన్ లో ప్రభుత్వానికి చెల్లించిన ఫీజు కాకుండా ప్రతి స్కూల్ బస్ ఫిట్​నెస్ కు ఆఫీసర్లకు రూ.1200 ఫార్మాలిటీస్ చెల్లిస్తే తప్పులను కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి.   

ఫిట్ నెస్ లేని బస్సులపై  చర్యలు తీసుకుంటాం..

ప్రైవేట్ స్కూల్ బస్సులను ఫిట్ నెస్​ కోసం తీసుకువస్తున్నారు. ఇంకా కొన్ని బస్సులకు ఫిట్ నెస్​ చేయించలేదు. త్వరలోనే రోడ్లపై ఎన్ ఫోర్స్​మెంట్ తనిఖీలు నిర్వహిస్తాం. ఫిట్ నెస్ లేని బస్సులపై యాక్షన్​ తీసుకుంటాం. తనిఖీలకు వచ్చిన సమయంలో అన్ని బస్సులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతనే సర్టిఫికెట్ జారీ చేస్తున్నాం. ప్రమాణాల ప్రకారం లేని బస్సులను తిరిగి పంపిస్తున్నాం.

–తోట కిషన్ రావు, ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్, ఖమ్మం