
గిఫ్ట్‌ల పేరుతో రూ.4లక్షలకు పైగా కొట్టేసిన్రు
ఆన్‌లైన్ అడ్డాగా నైజీరియన్ గ్యాంగ్ మోసం
ఐదుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఫ్రెండ్ షిప్ పేరుతో ట్రాప్ చేసి గిఫ్ట్ లు తెచ్చామంటూ మోసాలు చేస్తున్న నైజీరియన్ గ్యాంగ్ కి చెందిన ఐదుగురిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 సెల్ ఫోన్స్, పాస్ పోర్ట్స్, రూటర్ స్వాధీనం చేసుకున్నారు. సీపీ మహేశ్‌భగవత్ కేసు వివరాలను వెల్లడించారు. ఎల్ బీనగర్ కి చెందిన ఓ యువకుడికి గతేడాది నవంబర్ లో సోఫియా అలెక్సా పేరుతో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతను రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశాడు. ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్,వాయిస్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. తాను ఆస్ట్రేలియాలో పుట్టానని ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నానని ఆ యువతి చెప్పింది. తనకు పెళ్లయిందని.. ఓ కూతురు కూడా ఉందని చెప్పింది. ఇలా వాట్సాప్ చాటింగ్స్ ఫేక్ ఫొటోస్‌తో యువకుడిని ట్రాప్ చేసింది. కొన్నిరోజులకి హైదరాబాద్‌కు వస్తున్నట్టు యువకుడికి మెసేజ్ పెట్టింది. ముంబయి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యానని..హైదరాబాద్ వచ్చాక కాల్ చేస్తానని మరో మెసేజ్ చేసింది. ఆ తర్వాత ముంబయి ఎయిర్ పోర్టు కస్టమ్స్ ఆఫీసర్ పేరుతో యువకుడికి ఫిమేల్ వాయిస్ తో కాల్ వచ్చింది. సోఫియా అలెక్సా 75 వేల పౌండ్స్ క్యాష్, గోల్డ్ చైన్స్, మొబైల్ ఫోన్స్ తో పట్టుబడిందని, కస్టమ్స్ ట్యాక్స్ చెల్లిస్తే అన్ని వస్తువులు తిరిగి ఇస్తామని చెప్పింది. తనకోసం వస్తున్న అలెక్సా తెచ్చే గిఫ్ట్‌ల కోసం బాధిత యువకుడు రూ.4 లక్షల 83 వేలను వివిధ అకౌంట్స్ లోకి ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నంబర్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఢిల్లీ నుంచి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఆఫ్రికాలోని ఘనాకు చెందిన అకపౌల్ గాడ్స్‌టైమ్(26),లైబీరియాకు చెందిన అడ్జెల్ గిఫ్ట్(27), కికి కాన్ఫిడెన్స్ డెవిడ్(27), క్రోమా ఓయిబో(24) డానియల్(29) గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా నుంచి అందమైన ఫారిన్ యువతుల ఫొటోస్ డౌన్‌లోడ్ చేసుకుని ఈ గ్యాంగ్ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నట్లు గుర్తించారు. యువతల ప్రొఫైల్ ఫొటోస్‌తో వాట్సాప్,ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసి ట్రాప్ చేస్తున్నారని సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. గిఫ్టులు,కస్టమ్స్ పేరుతో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుని తర్వాత ఫోన్స్, సిమ్ కార్డులను బ్రేక్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ గ్యాంగ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8 మందిని ట్రాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆయన చెప్పారు.