- నిధుల గోల్‌మాల్ ఘటన ఎంక్వైరీ తీరుపై విమర్శలు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల వైద్య విధాన పరిషత్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ శాఖ పరిధిలో పనిచేసే ఎంప్లాయిస్ జీపీఎఫ్, సీపీఎఫ్ ఖాతాల్లో వేయాల్సిన నిధులు మళ్లించినట్లు బయటకు రావడంతో ఎంక్వైరీ వేశారు. కాగా ఎంక్వైరీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల గోల్‌మాల్ టైంలో పనిచేసిన జిల్లా ఆఫీసర్, ఎంక్వైరీ ఆఫీసర్లు బదిలీపై వెళ్లడం తీవ్ర అనుమానాలు వెల్లువెత్తున్నాయి. దీనికి తోడు ఇదే ఘటనపై కింది స్థాయి సిబ్బందిని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేయగా, దీర్ఘకాలంగా పని చేస్తున్న అనుమానితులపై ఎంక్వైరీ జరగకపోవడంపై ఆరోపణలువినిపిస్తున్నాయి. కోరుట్ల హాస్పిటల్‌కు మంజూరు కావాల్సిన నిధుల్లో రూ.28లక్షలను టీవీవీపీ సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి బ్యాంక్ వోచర్గుగా మార్చి మరో అకౌంట్ లో జమ చేసింది. ఈ ఘటనపై ఆఫీసర్లు ఆరా తీయగా నిధుల గోల్‌మాల్ విషయం బయటకు వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు బైంసా హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను ఎంక్వైరీ ఆఫీసర్‌గా నియమించారు.
రూ. 5 కోట్లకు పైగా పక్కదారి?
దాదాపు రూ. 5 కోట్ల కు పైగా నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ కాగా, రూ.కోటిన్నర రికవరీ చేసినట్లు సమాచారం. ఆ టైంలో టీవీవీపీ సూపరింటెండెంట్ సుదాక్షిణా దేవి, ఎంక్వైరీ ఆఫీసర్ కూడా బదిలీ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూల్స్‌కు విరుద్ధంగా ఐదారేళ్లుగా పనిచేస్తున్న ఆఫీసర్లు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బదిలీల పేరుతో ఎంక్వైరీని పక్కదారి పట్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పైగా ఏటా చేయాల్సిన ఆడిటింగ్ ఏళ్లు గడిచినా చేపట్టకపోవడంపై జిల్లా స్థాయి ఆఫీసర్ల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత నెల 22న వైద్య విధాన పరిషత్ లో సాధారణ బదిలీల్లో భాగంగా ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే నలుగురు డాక్టర్లను జిల్లా హాస్పిటల్‌కు బదిలీ చేశారు. జిల్లా హాస్పిటల్ మెడికల్ కాలేజీగా అప్ గ్రేడ్ కావడంతో ఇక్కడ డ్యూటీలు కేటాయించే అవకాశం లేదు. అయితే వారిని తిరిగి వైద్య విధాన్ పరిషత్ ఆధ్వర్యంలోని హాస్పిటళ్లకు కేటాయించాల్సి ఉండగా వారమైనా వారికి డ్యూటీలు కేటాయించలేదు.