- భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహణ
- వెయ్యి మందికి పైగా పాల్గొన్న యువత
బీజింగ్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం చైనాలోని పలు చోట్ల యోగా శిబిరాలు నిర్వహించారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో రెండు గంటల పాటు యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందులో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్, ఆయన భార్య శృతి రావత్, డిప్యూటీ అంబాసిడర్ అభిషేక్ శుక్లాతోపాటు ఎంబసీ అధికారులు కూడా రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగాకు అటెండ్ అయ్యారు.
వారితో భారతీయ సంస్కృతి గురువు లోకేశ్ శర్మ పలు ఆసనాలు చేయించారు. పుణెలోని ప్రసిద్ధ కైవల్యధామ్ యోగా ఇనిస్టిట్యూట్ నుంచి ధ్యాన నిపుణుడు ప్రొఫెసర్ ఆర్.ఎస్. భోగల్ ధ్యానంపై ప్రత్యేక సెషన్స్ నిర్వహించారు. యోగి యోగా, వి యోగా, ఓం శివ యోగా,హేమంత్ యోగా అనే నాలుగు సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగిసాక యోగా బాగా చేసిన విజేతకు బహుమానం అందజేశామని, భారత రాయబార కార్యాలయం ఇన్‌చార్జ్ ఫస్ట్ సెక్రటరీ వివేకానంద తెలిపారు. చైనాలోని వివిధ నగరాల్లో ఏటా నిర్వహించే యోగా కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. చైనా యువత యోగా చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని..ఏటా వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు.