జీడబ్ల్యూఎంసీలో సగానికి పైగా పోస్టులు వేకెంట్
ప్రపోజల్స్ వరకే పరిమితమవుతున్న ఖాళీలు
రాష్ట్రంలో చక్రం తిప్పే నాయకులున్నా భర్తీకి నోచుకోని పోస్టులు
వరంగల్, వెలుగు: వరంగల్ సిటీకి హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా పేరుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీ లాంటి పథకాల్లోనూ చోటు దక్కించుకుంది. మొత్తం 11 లక్షల జనాభాతో రాష్ట్ర రాజధానితో పోటీపడుతోంది. అందుకు తగ్గట్టుగానే లీడర్లు, ఆఫీసర్లు ఇక్కడ జరిగే అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాల్లోనూ నగరానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా నగర పాలనకు కేంద్రబిందువైన బల్దియాలో మాత్రం ఉద్యోగుల భర్తీకి చర్యలు తీసుకోవడం లేదు. సాంక్షన్ అయిన పోస్టుల్లో 55 శాతం ఖాళీగానే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాక ఎన్నికలు సమీపిస్తుండడంతో డెవలప్ మెంట్ చూపించుకోడానికి లీడర్లు ఆఫీసర్లకు టార్గెట్ ల మీద టార్గెట్లు పెడుతున్నారు. పనులు స్పీడప్ చేయాలని ఫోర్స్ చేస్తున్నారు. వర్క్స్ లేట్ అయితే ఆఫీసర్లపై గరం అవుతున్నారు. కానీ పోస్టుల భర్తీని మాత్రం కేర్ చేయడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై పడుతున్న పనిభారం పడుతోంది. జీడబ్ల్యూఎంసీలో ఖాళీల భర్తీకి ఎన్నోసార్లు సర్కారుకు పంపిన ప్రపోజల్స్ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
55 శాతం ఖాళీలు..
గ్రేటర్ వరంగల్ పరిధిలో 42 విలీన గ్రామాలతో కలిపి 58 డివిజన్లు ఉండగా.. 11లక్షలకు పైగానే జనాభా ఉంది. సిటీ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జీడబ్ల్యూఎంసీదే కీలక పాత్ర. ఇల్లు కట్టాలన్నా.. డ్రైనేజీ సిస్టం మంచిగ ఉండాలన్నా.. తాగునీరు అందిచాలన్నా బల్దియానే చూసుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కీలక పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 45 శాతం మంది ఉద్యోగులు, సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. బల్దియాలో ఆరు మెయిన్ డిపార్టుమెంట్లు ఉండగా.. 1515 పోస్టులకు ప్రభుత్వం సాంక్షన్ ఇచ్చింది. కానీ ఇందులో 663 మంది మాత్రమే ఉండగా.. 852 పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి.
కీలక విభాగాల్లోనూ వేకెన్సీలే..
బల్దియాలో అడ్మినిస్ట్రేషన్ విభాగం మొత్తం పరిపాలనను పర్యవేక్షిస్తుంది. ఈ కేటగిరిలో కమిషనర్, అడిషనల్ కమిషనర్, సెక్రటరీ, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్, సూపరింటెండెంట్, పీఆర్వో, ట్యాక్స్ఆఫీసర్లు, ఆడిటర్స్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్స్ ఉండగా.. అందులో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ అభివృద్ధి, నిర్మాణ పనులు, మంచినీటి సరఫరా, మరమ్మతులు, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లు రూపొందించడంలో కీలకంగా నిలిచే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ లోనూ ఇదే పరిస్థితి. ఈ వింగ్ అంతటికి హెడ్ గా ఉండాల్సిన ఎస్ఈ పోస్టులో ఇన్చార్జి ఆఫీసర్ విద్యాసాగర్ కొనసాగుతున్నారు. భవన నిర్మాణాల అనుమతులు, అక్రమ కట్టడాలను గుర్తించడం, కూల్చివేయడం, ఇతర అభివృద్ధి పనులకు ముఖ్యమైన టౌన్ ప్లానింగ్ విభాగం పరిస్థితి కూడా అంతే. ఈ డిపార్ట్ మెంట్ కు హెచ్ వోడీగా ఉండాల్సిన సిటీ ప్లానర్ పోస్టు కూడా వేకెంట్ గానే ఉండటంతో ఇన్ చార్జితోనే నెట్టుకొస్తున్నారు. చెత్తాచెదారం తొలగించడం, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, సీజనల్ వ్యాధులు, దోమలు విజృంభించకుండా చూసుకోవాల్సిన పబ్లిక్ హెల్త్ విభాగంలోనూ భారీగా ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. అకౌంట్స్ విభాగంలో మొత్తంగా ముగ్గురే పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉన్న ఆఫీసర్లు బలి..
జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు సమీపిస్తుండడంతో డబుల్ బెడ్ రూం ఇండ్లు, స్మార్ట్ సిటీ వర్క్స్, ఇంటింటికి డైలీ వాటర్ సప్లై, ఇతర పనుల విషయమై లీడర్లు ఆఫీసర్లకు ఫిబ్రవరి వరకు టార్గెట్ పెట్టి పనులు చేయిస్తున్నారు. అరకొర సిబ్బందితో క్షేత్రస్థాయిలో ప్రతి పని పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో గ్రేటర్ కౌన్సిల్ మీటింగ్‌తో పాటు ఇతర సమీక్షలు, సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆఫీసర్లపై సీరియస్ అవుతున్నారు. ఐదు రోజుల కిందట జరిగిన గ్రేటర్ కౌన్సిల్ మీటింగ్ లోనూ మేయర్, కార్పొరేటర్లు కూడా ఆఫీసర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల వారిపై పడుతున్న పని భారాన్ని మాత్రం అర్థం చేసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లీడర్ల తీరుతో తాము విసిగెత్తిపోతున్నామని పలువురు ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పోస్టులు భర్తీ చేసి, పనిభారం తగ్గించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
చక్రం తిప్పే లీడర్లున్నా..
గ్రేటర్లో ఉన్న ఖాళీల భర్తీకి పాలకవర్గం, అధికార యంత్రాంగం పలుమార్లు ప్రపోజల్స్ పంపించింది. ఇదే విషయాన్ని ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే సమస్యల విషయమై ఉద్యోగులపై విరుచుకుపడే ప్రజాప్రతినిధులు.. సర్కార్ నుంచి ప్రతిపాదనలు ఓకే చేయించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అర్బన్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సీనియర్ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, నరేందర్, ఎంపీలు బండా ప్రకాశ్, దయాకర్ , మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కేటీఆర్ కు సన్నిహుతుడిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇలా జాబితా చెప్పుకుంటూ చాలా పెద్దదే. కానీ.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో సమస్యలు, ఉద్యోగుల అవసరాల ప్రతిపాదనలను సర్కారు దృష్టికి తీసుకెళ్లి ఓకే చేయించడంలో పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వరంగల్ మహానగర అభివృద్ధి కోసం ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నగర వాసులు కోరుతున్నారు.
For More News..