- 21.2% మంది మహిళలకు షుగర్.. 30.2% మందికి బీపీ..
- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్‌లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో సగం మంది మహిళలు ఊబకాయులేనని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. రాష్ట్రంలో 15 ఏండ్లు దాటిన ఆడవాళ్లలో 30.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుంటే, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 51 శాతం మంది ఆడవాళ్లు అధిక బరువుతో ఉన్నారని ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 14 శాతం మంది మహిళలే అధిక బరువుతో ఉన్నారని తెలిపింది. షుగర్, బీపీ రోగులు కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నారు. నడక, వ్యాయామం తగ్గిపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. రాష్ట్రంలో 15 ఏండ్లు దాటిన ఆడవాళ్లలో 14.7 శాతం మందికి షుగర్ ఉంటే, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 21.2 శాతం మందికి షుగర్ ఉంది. రాష్ట్రంలో 18.1 శాతం మంది మగవారికి షుగర్ ఉంటే, హైదరాబాద్‌లో అత్యధికంగా 26.8 శాతం మందికి షుగర్ ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 11.6 శాతం మంది మగవాళ్లు, 8.4 శాతం మంది ఆడవాళ్లకు మాత్రమే షుగర్ ఉంది. రాష్ట్రంలో 26.1 శాతం మంది ఆడవాళ్లు బీపీతో బాధపడుతుండగా, హైదరాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 30.2 శాతం మంది బీపీ రోగులున్నారు. రాష్ట్రంలో 31.4 శాతం మగవాళ్లకు బీపీ ఉంటే, హైదరాబాద్‌లో 41.7 శాతం మందికి బీపీ ఉందని రిపోర్ట్‌లో వెల్లడైంది. 2019–20లో చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వివరాల ఆధారంగా కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ రూపొందించిన ఈ రిపోర్ట్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ(ప్లానింగ్) కె.రామకృష్ణారావు సోమవారం విడుదల చేశారు.
రిపోర్ట్‌లోని మరికొన్ని ముఖ్యాంశాలు..
- ఐదేండ్లలోపు పిల్లల్లో 15.3 శాతం మంది మాత్రమే ప్రీప్రైమరీ స్కూళ్లకు వెళ్తున్నారు.
- మహిళల్లో అక్షరాస్యత 66.6 శాతంగా ఉంది. అక్షరాస్యతలో హైదరాబాద్(83.6 శాతం) టాప్‌లో ఉంటే, గద్వాల(45 %) చివరలో ఉంది.
- సర్వే జరిగే నాటికి 20 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న యువతుల్లో 23.5 శాతం మందికి బాల్య వివాహాలు జరిగాయి. అత్యధికంగా వికారాబాద్‌లో 39.8 శాతం, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 10.2 శాతం మంది 18 ఏండ్ల కంటే ముందే పెండ్లిళ్లు అయినయి.
- సర్వే జరిగే నాటికి 20 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్న యువతుల్లో 5.8 శాతం మంది మేజర్లు అవకముందే గర్భం దాల్చారు.
- ప్రభుత్వ దవాఖాన్లలో ప్రసవాలు చేయించుకున్నా, చేతిగుంట ఖర్చు పెట్టక తప్పుతలేదు. ఒక్కో డెలివరీ కోసం జనాలు రూ.3,846 ఖర్చు చేయల్సి వస్తోంది.
- ప్రభుత్వ దవాఖాన్లలో 44.5 శాతం, ప్రైవేటు దవాఖాన్లలో 81.5 శాతం సిజేరియన్ డెలివరీలే జరుగుతున్నాయి. సిజేరియన్లు అత్యధికంగా కరీంనగర్‌లో జరుగుతుండగా, అత్యల్పంగా అసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్నాయి.
- రాష్ట్రంలో 5.6 శాతం మంది మహిళలు, 22.3 శాతం మంది మగవాళ్లు పొగాకు తింటున్నారు.
- రాష్ట్రంలో 43.3 శాతం మంది మగవాళ్లు, 6.7% మంది ఆడవాళ్లు ఆల్కహాల్ తాగుతున్నారు.