బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh khan) పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. నవంబర్ 2 నాటికి షారుఖ్ 58 వసంతాలు పూర్తి చేసుకొని 59వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో వేలాది మంది షారుఖ్ అభిమానులు అర్ధరాత్రి నుండే ఆయన ఇంటివద్దకు చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. షారుఖ్ కూడా బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అంతేకాదు అభిమానులతో కాసేపు ముచ్చటించారు.
అయితే.. అభిమానులందరూ షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకల్లో ఉండగా.. దొంగలు తమ చేతివాటాన్ని చూపించారు. షారుఖ్ ఇంటిముందు గుమిగూడిన జనాల నుంచి ఏకంగా 30కి పైగా సెల్ ఫోన్లను స్వాహా చేశారు. వేడుకల అనంతరం విషయం తెలుసుకున్న అభిమానులు అవాక్కయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో సెల్ ఫోన్ల దొంగతనం జరగడం పట్ల కేసు నమోదు చేసిన బాంద్రా పోలీసులు.. విచారణ చేపట్టారు.
ఇక షారుఖ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే జవాన్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి మరి.