Virat Kohli Bowling: బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్.. కోహ్లీకి కొత్త తలనొప్పులు

Virat Kohli Bowling: బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్.. కోహ్లీకి కొత్త తలనొప్పులు

దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. మాజీ బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే స్థానంలో మోర్కెల్‌ సేవలందించనున్నాడు. వచ్చే నెల 19న బంగ్లాదేశ్‌‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌తో మోర్కెల్‌ ఒప్పందం మొదలవ్వనుంది. కోచ్‌గా అతను మూడేళ్ల పాటు (2027 వన్డే వరల్డ్‌ కప్‌) భారత జట్టుకు తన సేవలందించనున్నాడు. ఇది బాగానే ఉన్నా.. సఫారీ పేసర్ ఎంపిక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

ఒకే ఓవర్‌లో 28 పరుగులు

బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ ఆల్బీ మోర్కెల్‌ ఇద్దరూ సోదరులు. మంచి హిట్టర్‌గా పేరొందిన ఆల్బీ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు కూడానూ. ఈ క్రమంలో ఐపీఎల్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో ఈ సఫారీ హిట్టర్.. కోహ్లీ బౌలింగ్‌లో 28 పరుగులు రాబట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ  హేటర్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

2012 ఐపీఎల్ సీజన్‍లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చెన్నై 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో బంతి చేతికందుకున్న కోహ్లీ.. ఒంటిచేత్తో ధోని సేనకు విజయాన్ని అందించాడు. 

కోహ్లీ వేసిన 19 ఓవర్‪లో ఆల్బీ.. ఏకంగా 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. దాంతో, 28 పరుగులు వచ్చాయి. విరాట్ పుణ్యమా..! అని అప్పటివరకు ఆర్సీబీ వైపు ఉన్న మ్యాచ్ కాస్త.. చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. 20వ ఓవర్ వేసిన వినయ్ కుమార్ అవీ సమర్పించుకున్నాడు. కోహ్లీ యొక్క ఈ బౌలింగ్‌ గణాంకాలను ఎత్తి చూపుతూ హేటర్స్ భారత క్రికెటర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎలా బౌలింగ్ చేయకుడదో కోహ్లీకి నేర్పడానికే ఆల్బీ సోదరునికి బౌలింగ్ కోచ్ బాధ్యతలు ఇచ్చారని ఆట పట్టిస్తున్నారు.